కేంద్ర ప్రభుత్వం పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్

by Disha Web Desk 20 |
కేంద్ర ప్రభుత్వం పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ కవిత జైల్ కు వెళ్తుందని ఒక మామూలు బీజేపీ ఎంపీ ఎలా డిసైడ్ చేస్తాడని, రేపు తనలాంటి వారిపై కూడా వేధింపులు ప్రారంభిస్తారని కేంద్ర ప్రభుత్వం పై మంత్రి వేములప్రశాంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో మోడీ అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా కేసీఆర్ ఒక్కరే పోరాటం చేస్తున్నారని మనమంతా వారికి అండగా నిలవాలని రాష్ర్ట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బాల్కొండ నియోజకవర్గంలోని బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలకు చెందిన సుమారు 500 మంది రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ప్రసంగించారు.

ఎనిమిదేళ్ళ బీజేపీ మోది పాలనలో ఎవరికి లాభం జరిగిందో ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. పైగా కేసీఆర్ ప్రభుత్వం చేసే మంచి పనుల పై బీజేపీ కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు వ్యవహరిస్తుందన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం నుండి ఎన్నినిధులు పల్లెలకు వస్తున్నాయి. కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం నుండి ఎన్నినిధులు వస్తున్నాయో గమనించాలన్నారు. చైనా మన దేశసరిహద్దు దాటి వస్తున్న ఏమి చేయలేకపోతున్నారని, విదేశాంగ మంత్రి బాధ్యతారాహిత్యంగా చైనాతో ఇప్పుడు పెట్టుకోలేం అని మాట్లాడడం సిగ్గు చేటన్నారు. అసలు దేశరక్షణ గాలికి వదిలేశారని, అసలు మోడీ దేశం కోసం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

సామాన్య ప్రజలు చిన్నలోన్ తీసుకుంటే బ్యాంకులు ముక్కు పిండి వసూలు చేస్తాయి కానీ మోడీ తన కార్పొరేట్ మిత్రులు తీసుకున్న 12 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారని అన్నారు. ఎవడబ్బ సొమ్మని తమ కార్పొరేట్ మిత్రులకు మేలు చేసి దేశప్రజల మీద భారం వేశారని నిలదీశారు. వేల కోట్ల ఎల్ఐసీ ప్రీమియం డబ్బులను కూడా పక్కదోవ పట్టించిన ఘనత మోదిది అని అన్నారు. తన మిత్రుడు అదానీ కేవలం 8 ఏళ్లలో 45వేల కోట్ల నుండి 11లక్షల కోట్లకు పడగలెత్తిండు. ఆ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చిందని ప్రశ్నించారు. హిండేన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ మోడీ దోస్త్ అవినీతిని బయటపెట్టిందని అన్నారు.

ఒక్క ఎల్ఐసీ సంస్థనే అదానీ వల్ల 40వేల కోట్లు నష్ట పోయిందని అదంతా ప్రజల సొమ్మని అన్నారు. నిజంగానే ప్రధాని మోది సచ్చీలు డైతే అదానీపై సీబీఐ,ఈడీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి వేముల, ఎంపీ అరవింద్ నోరు విప్పితే అబద్ధాలు, బూతులు మాట్లాడుతరు తప్పా ఆయన వల్ల ఒరిగింది ఏమీ లేదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తాను బాల్కొండలో 10వేల మందికి 40కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహయనిది ద్వారా అందించాననీ, దమ్ముంటే ప్రధాన మంత్రి సహాయనిధి కింద నిధులు తీసుకురావాలని సవాల్ చేశారు.

ఎంపీ అరవింద్ కు దమ్ముంటే గ్రామాల్లో పర్యటించే ముందు ఆ ఊరికి ఏమి ఇచ్చాడో, కేంద్రం నుంచి తెచ్చిన నిధులతో ఏమీ అభివృద్ది చేశాడో చెప్పి ఆ గ్రామంలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని బాండ్ రాసిచ్చి గెలిచి రైతులను మోసం చేసిన అరవింద్, ఇపుడు మళ్లీ గెలిపిస్తే పసుపు పరిశ్రమ తెస్తానని సిగ్గులేకుండా చెప్తున్నాడని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వస్తే అన్ని ఇస్తామని చెప్తున్న ఎంపీ ముందుగా తెలంగాణలో ప్రస్తుతం అమలవుతున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయించాలని డిమాండ్ చేశారు.

18 రాష్ట్రాల్లో ప్రభుత్వంలో ఉన్న బీజేపీ అక్కడ ప్రజలకు ఇస్తున్న పెన్షన్ ఎంతో అందరికీ తెలుసన్నారు. ప్రజలంతా మెల్లమెల్లగా ఆలోచన చేస్తున్నారు కాబట్టే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. ఈ ఎనిమిదేళ్ళ కాలంలో కేవలం బాల్కొండ నియోజక వర్గంలో 100 కోట్లతో రోడ్లు నిర్మించానని తెలిపారు. వందల కోట్లతో బీటీ రోడ్లు, మెయిన్ రోడ్లు, చెక్ డ్యాంలు, హెల్త్ సబ్ సెంటర్, గ్రామ పంచాయతీ భవనాలు, కుల సంఘాల భవనాలు, 50 పైగా గుడులు నిర్మించుకున్నమని తెలిపారు. ఎండాకాలంలో కూడా నవాబ్ లిఫ్ట్, చౌట్పల్లి హన్మంతు రెడ్డి లిఫ్ట్ లను నడిపిస్తూ చెరువులను నింపుకుంటున్నమని అన్నారు.

Next Story

Most Viewed