కేసీఆర్ బీఆర్ఎస్‌పై స్పందించని జాతీయ నేతలు

by Disha Web |
కేసీఆర్ బీఆర్ఎస్‌పై స్పందించని జాతీయ నేతలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ ఎజెండా అంటూ బీఆర్ఎస్ ను ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆదిలోనే నిరాశ ఎదురవుతోంది. బీజేపీ, కాంగ్రెస్ లను తలదన్ని నేషనల్ పాలిటిక్స్ లో చక్రం తిప్పుతానని చెప్పిన కేసీఆర్ కొత్త పార్టీకి జాతీయ స్థాయి నేతల నుంచి స్పందన కరువైంది. హైదరాబాద్ కు వచ్చిన వారు మినహా మిగతా జాతీయ స్థాయి నేతలెవరూ బీఆర్ఎస్ పట్ల స్పందించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీపై యుద్ధం చేయడమే తన లక్ష్యం అంటూ ఆయా రాష్ట్రాల్లోని పలువురు ప్రాంతీయ పార్టీ నేతలను గతంలో కేసీఆర్ కలిసి వచ్చారు.

మోడీ ప్రభుత్వంపై పోరాటానికి అందరూ ఏకతాటిపైకి రావాలని పిలుపునిస్తూ పనికట్టుకుని మరీ పర్యటనలు చేస్తూ దేశ రాజకీయాల్లో ప్రముఖులందరితో కేసీఆర్ చర్చలు జరిపారు. కానీ బుధవారం బీఆర్ఎస్ ప్రకటిస్తే నేషనల్ పొలిటీషియన్లలో ఎవరూ స్పందించకపోవడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, ఉద్దవ్ ఠాక్రే, అర్వింద్ కేజ్రీవాల్, శరద్ పవార్, ఎం.కే స్టాలిన్, నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్, హేమంత్ సోరెన్ లతో కేసీఆర్ భేటీ అయ్యారు.

వీరంతా తామ ప్రత్యామ్నాయ ఎజెండాలో భాగం అవుతారనే ప్రచారం టీఆర్ఎస్ నేతల్లో జోరుగా వినిపించింది. తీరా బుధవారం టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుతూ తీర్మానం ఆమోదించినప్పటికీ.. ఈ నేతలెవరూ కనీసం అభినందనలు కూడా తెలపకపోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల ఢిల్లీ, పంజాబ్, బిహార్ లో పర్యటించిన కేసీఆర్ ఆ రాష్ట్రాలకు చెందిన రైతు ఉద్యమంలో మరణించిన వారి కుటుంబాలతో పాటు గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం కింద చెక్కులు పంపిణీ చేశారు. ఆ సమయంలో కేసీఆర్ తో చెట్టాపట్టాలేసుకు తిరిగిన ముఖ్యమంత్రులు, నాయకులు కూడా బీఆర్ఎస్ విషయంలో ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో బీఆర్ఎస్ విషయంలో జాతీయ పార్టీ నేతల వైఖరి తేలిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed