జాతీయ రహదారే.. డంపింగ్ యార్డ్

by Disha Web Desk 10 |
జాతీయ రహదారే.. డంపింగ్ యార్డ్
X

దిశ, మంథని : మంథని మున్సిపాలిటీలో డంపింగ్ యార్డ్ లేక కంపుకొడుతోంది. మంథని మున్సిపాలిటీగా మారి నాలుగున్నరేళ్లు అవుతున్నా స్థలం దొరకక డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు మోక్షం కలగడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ విషయంలో పట్టనట్లుగా ఉంటున్నారని ప్రజల నుంచి విమర్శలు వెలువెత్తుతున్నాయి. మంథని పట్టణంలో 3500 పైగా గృహాలు ఉన్నాయి. పారిశుధ్య నిర్వహణలో భాగంగా మున్సిపాలిటీ రిక్షాల ద్వారా చెత్త సేకరించి మంథని-కాటారం ప్రధాన రహదారి పక్కన పోస్తున్నారు. మంథని మేజర్ పంచాయతీగా ఉన్న నాటి నుంచి ఇదే కొనసాగుతోంది. పారిశుధ్య కార్మికులు చెత్తను తగులబెడుతుండగా వెలువడుతున్న పొగతో రహదారిపై విస్తరిస్తోంది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోసారి పొగ అధికమై ఎదురుగా వస్తున్న వాహనాలను గుర్తించలేని పరిస్థితిలో ప్రమాదాలు జరుగుతున్నాయి. మరోవైపు చెత్త నిల్వ చేస్తున్న ప్రాంతంలో దుకాణాలతోపాటు మాతా, శిశు సంరక్షణ కేంద్రం ఉన్నాయి. చెత్త నుంచి వెలువడుతున్న దుర్గంధం పరిసర ప్రాంతవాసులు, ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తుంది. గాలి వీచినప్పుడు దుర్వాసన భరించలేని పరిస్థితి నెలకొన్నది. ఇంకోవైపు వర్షాకాలంలో వరదకు చెత్తంతా పక్కనే ఉన్న బొక్కలవాగు ప్రవాహంలో కొట్టుకుపోయి గోదావరిలో కలుస్తోంది. మరోవైపు చెత్తను మంథని-గోదావరిఖని రహదారి పక్కన కూడా వేస్తుండడంతో అదే పరిస్థితి మరి దారుణంగా ఉంటుంది.

డంపింగ్ యార్డ్ ఏర్పాటు ఎప్పుడో?

మంథని మున్సిపాలిటీలో డంపింగ్ యార్డ్ ఏర్పాటులో అధికారులు, ప్రజాప్రతినిధులు ఉదాసీనంగా ఉంటున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో బోయిన్‌పేట, ఎక్లాస్‌పూర్‌ శివారు ప్రాంతాలను డంపింగ్ యార్డ్ కోసం అధికారులు పరిశీలించారు. కానీ వివిధ కారణాలతో అక్కడ ఏర్పాటు చేయలేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం గాజులపల్లి శివారులో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని అధికారులు అనుకుంటున్నారు. రెవెన్యూ అధికారుల సూచన మేరకు ఆరు రోజుల పాటు అక్కడికి తరలించామని మున్సిపల్ కమిషనర్ శారద తెలిపారు. కానీ కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో చెత్త తరలింపును నిలిపివేశామని చెప్పారు. అక్కడ రెండు ఎకరాల స్థలం ఇస్తామని రెవెన్యూ అధికారులు చెప్పారని ఆమె తెలిపారు. డంపింగ్ యార్డ్‌కు స్థలం సమస్య త్వరలోనే తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed