మునుగోడు కాంగ్రెస్‌లో టికెట్ పంచాయితీ

by Disha Web Desk 12 |
మునుగోడు కాంగ్రెస్‌లో టికెట్ పంచాయితీ
X

దిశ, సంస్థాన్ నారాయణపురం: మునుగోడు కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారైంది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ మునుగోడు అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించింది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖాయమని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైనే నియోజకవర్గంలో సస్పెన్షన్ నెలకొంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు ఆశావహులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రధానంగా చలమల కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతి,పున్న కైలాష్ నేతల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఇప్పటికే వీరంతా ఎవరికి వారుగా నియోజకవర్గంలో పర్యటిస్తూ టికెట్ తనకంటే తనకంటూ జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఎవరికి వారుగా తమ అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తూ సొంతంగా పార్టీ కార్యాలయాలను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు.

సయోధ్య కుదిరేనా!

మునుగోడు నియోజకవర్గంలో తన అనుచరులకే మండల పార్టీ అధ్యక్ష పదవులను కట్టబెట్టారంటూ పాల్వాయి స్రవంతి, పూర్ణ కైలాష్ నేత చలమల కృష్ణారెడ్డి పై గాంధీభవన్లో అధిష్టానం ముందు ఆందోళనకు దిగారు. మునుగోడు ఉప ఎన్నికల్లో పాల్వాయి స్రవంతి గెలుపు కోసం చలమల కృష్ణారెడ్డి పని చేశారని కానీ అధిష్టానం ఆశీస్సులతో చలమల నియోజకవర్గం లో కార్యక్రమాలు చేపడుతుంటే పాల్వాయి స్రవంతి సహకరించడం లేదని చలమల అనుచర వర్గం వాపోతుంది. పాల్వాయి స్రవంతి,చలమల కృష్ణారెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో నియోజకవర్గంలో వీరు ఎవరికి వారే కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు.

దీంతో కాంగ్రెస్ పార్టీ కేడర్ ఎవరి వెనక నడవాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే ప్రజా చైతన్య యాత్రతో చలమల కృష్ణారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. అదేవిధంగా పాల్వాయి స్రవంతి తన అనుచరులతో ఎక్కడికి అక్కడ సమావేశాలు ఏర్పాటు చేస్తూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకే వస్తుందంటూ చెప్పుకొస్తున్నారు. బీసీ కోటాలో మునుగోడు కాంగ్రెస్ టికెట్ తనకే వస్తుందంటూ పున్నా కైలాస్ కూడా తన అనుచరులతో చెబుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా వీరి ముగ్గురిలో ఎవరికి టికెట్ కేటాయించిన మిగిలిన వారు వారికి సహకరిస్తారా లేదా పార్టీ ఓటమికి వీరే కారకులవుతారా అని సొంత పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు.

అనైక్యతతో చేజార్చుకునేనా!

ఇప్పటికే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో వామపక్ష పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐ మునుగోడు టికెట్ ను తమకు కేటాయించాలని కోరుతున్నట్లు సమాచారం. అయితే మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ముగ్గురు నేతలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ముగ్గురు నాయకుల మధ్య అనైక్యత ఇప్పటికే బహిర్గతమైంది.

చలమల్ల అనుచరులకే మండల పార్టీ అధ్యక్ష పదవులు కట్టబెట్టారంటూ గాంధీభవన్ వద్ద పాల్వాయి స్రవంతి ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల మధ్య సయోధ్య కష్టమనే భావనతో అధిష్టానం మునుగోడు టికెట్ ను సీపీఐ కి కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ స్థానికంగా చర్చించుకుంటున్నారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి పనిచేసి మునుగోడు టికెట్ ను కాంగ్రెస్ కి వచ్చేలా చూడాలని ఆ పార్టీ క్యాడర్ ఆశిస్తుంది.

Next Story