మును'గోడు' తీరడం లేదు.. ప్లకార్డులతో నిరసన

by Disha Web Desk 13 |
మునుగోడు తీరడం లేదు.. ప్లకార్డులతో నిరసన
X

దిశ, మునుగోడు: ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలు పాలకులు మారిన మునుగోడు `గోడు` తీరడం లేదని, మునుగోడు నియోజకవర్గ కేంద్ర హక్కుల సాధనకై ఉద్యమాలను ఉదృతం చేస్తామని మునుగోడు మండల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు పాలకూరి నరసింహ గౌడ్ మునుగోడు సర్పంచ్ మిర్యాల వెంకన్న అన్నారు. గురువారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గత ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ మునుగోడు మండల కేంద్రానికి కేటాయించకపోవడంతో ఆగ్రహించిన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, బీఎస్పీ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు జాయింట్ యాక్షన్ కమిటీగా మారి ప్లకార్డులతో నిరసన తెలిపి, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నియోజకవర్గ కేంద్రమైన మనుగోడుపై స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సవతి తల్లి ప్రేమ కురిపిస్తున్నారని ఆరోపించారు. ఉప ఎన్నికలలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మునుగోడును దత్తత తీసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మోడల్ మండల్‌గా మునుగోడును తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చి ఆ హామీలలో ఏ ఒక్కటి మునుగోడు కేటాయించకుండా పక్క మండలానికి కేటాయించడం దారుణమని, అందుకు స్థానిక ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు కారణమన్నారు.

మునుగోడులో ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కళాశాలలు, 30 పడకల ఆసుపత్రి, మునుగోడును మున్సిపాలిటీగా కేటాయించాలని, ఇంకా ఎన్నో అర్హతలు కలిగిన మునుగోడు లో ఏ ఒక్కటి కేటాయించకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా మండల ప్రజా ప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసి మునుగోడు డిమాండ్లను తెలియజేయకపోతే భవిష్యత్తులో మునుగోడుని నియోజకవర్గ కేంద్రం పేరును కూడా తొలగించడం ఖాయమని అన్నారు. ప్రజా ప్రతినిధులు స్పందించకపోతే త్వరలో వాళ్ళు ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. రాస్తారోకో తో మండల కేంద్రంలో ఎక్కడి వాహనాలు అక్కడే రెండు గంటలపాటు నిలిచాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పోలగోని సత్యం, వివిధ పార్టీల నాయకులు నన్నూరి విష్ణువర్ధన్ రెడ్డి, సురిగి నరసింహ గౌడ్, మక్కేన అప్పారావు, పాల్వాయి చెన్నారెడ్డి, జిట్టగోని యాదగిరి, భాస్కర్, ఎండి అన్వర్, యాసరాని దినేష్, సురేష్, వెంకన్న, హరీష్, జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed