మునుగోడు బీఆర్ఎస్‌లో విచిత్ర పరిస్థితి

by Disha Web Desk 12 |
మునుగోడు బీఆర్ఎస్‌లో విచిత్ర పరిస్థితి
X

దిశ, నల్లగొండ బ్యూరో: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఏర్పడింది. ఈ ఉత్సాహంతోనే మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సభలు సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల్లోకి మరింత వేగంగా వెళ్లేలా వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ కూడా తమ ఎన్నికల ప్రచారానికి అవసరమైన కార్యాచరణ రూపొందిస్తున్నాయి. కానీ మునుగోడు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన స్థానిక ఎమ్మెల్యే ఈ భిన్నమైన పరిస్థితి కారణమని తెలుస్తోంది. అందువల్లే క్షేత్ర స్థాయిలో నిర్వహించే సమావేశాలకు స్థానిక లీడర్లు హాజరు కాకుండా డుమ్మా కొడుతున్నారని సమాచారం.

పార్టీ సమావేశాలకు డుమ్మా..

నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వ్యవహార శైలి తో విసుగు చెందిన స్థానిక నాయకులు బీఆర్ఎస్ నిర్వహించే సమావేశాలకు డుమ్మా కొడుతున్నారు. ఎమ్మెల్యే ఫోన్ చేసినా కూడా స్పందించట్లేదని తెలుస్తుంది. నాంపల్లి మండలంలోని సుమారు 20 గ్రామాలకు పైగా నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాలకు సొంత పార్టీకి చెందిన స్థానిక సర్పంచులు కూడా హాజరు కాలేదు. అంతేకాకుండా మండల స్థాయిలో ప్రధాన పాత్ర పోషించే జెడ్పీటీసీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీపీ రవీందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ రజిని వెంకన్న గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు, ఇంకా మండల స్థాయిలో ప్రభావితం చేయగల నాయకులు ఎవరు కూడా సమావేశాలకు రావడం లేదని తెలుస్తుంది.

లబ్ధిదారుల ఎంపికలు ప్రాధాన్యత లేకనే..

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి లతోపాటు ఇతర సంక్షేమ పథకాలకు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి తన ఇష్టారాజ్యంగా ఎంపిక చేశారని, అందులో అర్హులైన పేదలకు న్యాయం జరగలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాంతో ప్రజల్లోకి వెళ్లలేక వారిని సమావేశాలకు హాజరు కామని చెప్పలేక నేతలంతా ఎమ్మెల్యే‌కు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఇదే పరిస్థితి కొనసాగితే నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి గడ్డు కాలమనే చెప్పవచ్చు.

కేసీఆర్ సభ సక్సెస్ కష్టమే..?

మునుగోడు నియోజకవర్గంలో ఈనెల 26న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ సభకు జనాల తరలింపు ఇప్పుడు పెద్ద సవాల్‌గా మారింది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేయడంతో స్థానిక నేతలు ప్రజల్లోకి వెళ్లలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్ సభకు జనాలను తీసుకురావడానికి ప్రజలు ఎవరూ కూడా సహకరించే పరిస్థితి లేదని తెలుస్తోంది. దీంతో స్థానిక లీడర్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

స్థానిక ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడల వల్లే నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారయిందని పలువురు స్థానిక బీఆర్ఎస్ నాయకులు వాపోతున్నారు. దీంతో ఈ నెలలో నిర్వహించే ముఖ్యమంత్రి కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందా లేదా అనే డైలమాలో పార్టీ శ్రేణులు ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వ్యవహార శైలిపై స్థానిక నేతలు ఇచ్చిన సమాచారం మేరకు ఇప్పటికే ఇంటిలిజెన్స్ వర్గాలు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్లినట్లు సమాచారం.

Next Story

Most Viewed