భాగ్యనగరం తరహాలో నల్లగొండలో చవిచూడక తప్పదా...?

by Dishanational1 |
భాగ్యనగరం తరహాలో నల్లగొండలో చవిచూడక తప్పదా...?
X

దిశ, నల్లగొండ బ్యూరో: కార్పొరోట్ పాఠశాలల ఆగడాలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ మితిమీరిపోతున్నాయి. అయితే ఒక్కో స్కూల్‌లో ఫీజు దోపిడీ ఒక్కో రకమనే చెప్పాలి. ఇక్కడ పిల్లలను హింసించడమే కాదండోయ్.. తల్లిదండ్రులను సైతం మానసికంగా హింసించడం పనిగా పెట్టుకున్నారు. ఎలాగైనా పూర్తి ఫీజును సకాలంలో రాబట్టుకునేందుకు యాజమాన్యాలు, సిబ్బంది.. వేధించి.. హింసించి.. తమ ఫీజును వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటు తల్లిదండ్రులు.. అటు పిల్లలు పడుతున్న నరకయాతన అంతా ఇంతా కాదు. నిజానికి కార్పొరేట్ స్కూల్‌లో తమ పిల్లలను చదివించాలనే కోరిక.. పక్కవారితో పోటీపడడం.. వెరసి తల్లిదండ్రులు తమ తహతుకు మించి అప్పులు చేసి పిల్లలను కార్పొరేట్ బడికి పంపుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కార్పొరేట్ స్కూళ్ల బాగోతంపై దిశ కథనం.

30 శాతం ఫీజు ముందే వసూలు...

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కార్పొరేట్ బడులు కొత్త తరహా వసూళ్లకు తెరలేపాయి. ఉమ్మడి జిల్లాలో గత రెండు మూడు సంవత్సరాలుగా ఓ ప్రముఖ విద్యాసంస్థ చాలాచోట్ల తమ బ్రాంచ్‌లను ఓపెన్ చేసింది. అయితే సదరు విద్యాసంస్థకు చాలా పేరు ఉండడం.. కార్పొరేట్ మోజు కావడంతో ఓపెన్ చేసిన కొద్ది రోజుల్లోనే కుప్పలు తెప్పలుగా విద్యార్థులు వచ్చి చేరారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ సదరు విద్యాసంస్థలో ఒక్కో క్లాస్‌కు నాలుగైదు సెక్షన్లు చేసి విద్యార్థులను విభజించుకోవడం కొసమెరుపు. ఉదాహరణకు నర్సరీలో 25 మంది విద్యార్థుల చొప్పున ఉండాల్సి ఉండగా, నాలుగు సెక్షన్లు చేయడంతో ఒక్క నర్సరీలోనే 100 మంది విద్యార్థులకు పైగా ఉండడం గమనార్హం. ఇదిలావుంటే.. ఇదే కార్పొరేట్ స్కూల్ ప్రస్తుతం 9వ తరగతి విద్యార్థులకు సిలబస్ కంప్లీట్ చేశారు. దీంతో 10వ తరగతి సిలబస్ మొదలుపెట్టేశారు. దీంతో ఆగకుండా 10వ తరగతికి చెల్లించాల్సిన ఫీజులో 30 శాతం ఫీజును ఇప్పటికిప్పుడు చెల్లించాలి. లేకపోతే సదరు విద్యార్థులకు 10వ తరగతి సిలబస్ బోధించకుండా పక్కన కూర్చోబెడుతున్నారు. దీంతో తోటి విద్యార్థుల్లో షేమ్‌గా ఫీలయ్యి.. మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో తమ తల్లిదండ్రులపైన ఫీజు కట్టాలంటూ విపరీతమైన ఒత్తిడి తెస్తున్నారు.

ఫీజు ఇవ్వకుంటే.. రానీయ్యట్లే...

నకిరేకల్ పట్టణంలో కొత్తగా ఏర్పాటైన ఓ ప్రముఖ స్కూల్ నిర్వాకం మరీ దారుణంగా తయారయ్యింది. సదరు స్కూల్‌లో చదివే విద్యార్థి పూర్తి ఫీజు చెల్లించలేదని ఏకంగా స్కూల్ లోపలికి రానీయ్యలేదు. అంతేకాకుండా ఆ విద్యార్థి తీసుకొచ్చే ఆటో డ్రైవర్‌కు సైతం ఆ విద్యార్థి ఫీజు చెల్లించలేదు.. రేపట్నుంచి స్కూల్‌కు తీసుకురావొద్దంటూ చెప్పారు. 10 మంది తోటి విద్యార్థుల్లో ఫీజు చెల్లించలేదని చెప్పడం.. తోటి విద్యార్థులు గేలి చేయడం.. ఆ పసిప్రాయాన్ని ఎంతగా మానసికంగా వేధించిందో మాటల్లో చెప్పలేనిది. ఇదే స్కూల్ యాజమాన్యం శాలిగౌరారం మండలం నుంచి తీసుకొచ్చే స్కూల్ వ్యాన్‌ సిబ్బందికి సైతం ఫీజు చెల్లించని జాబితా ఇచ్చి.. ఆ జాబితాలో పేరు ఉన్న విద్యార్థులను వ్యాన్ ఎక్కించుకు రావొద్దంటూ ఆదేశాలియ్యడం కొసమెరుపు. అసలే కరోనాతో ఇప్పడిప్పుడు కోలుకుంటున్న తరుణంలో స్కూల్ యాజమాన్య కర్కశత్వం ఇటు తల్లిదండ్రులను.. అటు పిల్లల్ని తీవ్ర మానసిక క్షోభకు గురిచేసింది.

అధికార యంత్రంగం పూర్తి విఫలం...

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రైవేటు విద్యాసంస్థల ఆగడాలను అరికట్టడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యిందనే చెప్పాలి. పిల్లల నుంచి మితిమీరిన ఫీజులు వసూలు చేయడం దగ్గరి నుంచి బుక్స్ అమ్మడం.. నిబంధనలకు విరుద్ధంగా స్కూల్స్‌ను నెలకొల్పోడం.. ఇలా అడుగడుగునా.. నిబంధనలను తుంగలో తొక్కుతున్న అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. రెండు మూడు అంతస్థుల్లో పాఠశాలలను ఏర్పాటు చేస్తే.. చుట్టూ ఫైరింజన్ తిరిగేంత స్థలం ఉండడం.. క్రీడా ప్రాంగంణం.. తదితర నిబంధనలు మచ్చుకైనా కానరావడం లేదు. విద్యాశాఖ అధికారులు కనీసం నెలకు ఒక్కసారైనా ప్రైవేటు స్కూల్స్‌ని సందర్శించకపోవడం.. అసలు సదరు స్కూల్స్‌లో ఏం జరుగుతుందో.. తెలుసుకోలేనంత బిజీగా ఉండడం.. కొత్త సమస్యల్ని తెచ్చిపెడుతోంది. ఇప్పటికైనా ఇటు జిల్లా అధికార యంత్రాంగం.. అటు విద్యాశాఖ ఎప్పటికప్పుడు ప్రైవేటు స్కూల్స్‌పై పర్యవేక్షణ చేయకపోతే.. భాగ్యనగరం తరహాలో ఆత్మహత్య ఘటనలు చవిచూడక తప్పదు.



Next Story

Most Viewed