రైతులను నిలువు దోపిడీ చేస్తున్న ప్రైవేట్ వడ్ల కొనుగోలు కేంద్రాలు

by Disha Web Desk 22 |
రైతులను నిలువు దోపిడీ చేస్తున్న ప్రైవేట్ వడ్ల కొనుగోలు కేంద్రాలు
X

దిశ, మోత్కూరు: ప్రైవేట్ వడ్ల కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్ముతున్న రైతులను వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారని, ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు రూ. 2230 ఉంటే రూ.1800 నుంచి 1900లకే కొనుగోలు చేస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. గురువారం మోత్కూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని అడ్డికి పావుశేరు లెక్కన కొంటున్నారని, పైగా క్వింటాలుకు తాలు, తేమ పేరిట రెండు కిలోలు కటింగ్, రెండు శాతం కమిషన్ కట్ చేసుకుని డబ్బులు చెల్లిస్తున్నారని అన్నారు. దీంతో రైతులు మరింత నష్టపోతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ వడ్ల కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న మోసాలను, దోపిడీని పలువురు రైతులు తన దృష్టికి తెచ్చారని చెప్పారు. గ్రామాల్లో ప్రైవేట్ వే బ్రిడ్జి కాంటాలు విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తూ వడ్లు కొంటున్నారని, వాటికి పర్మిషన్లు ఎవరు ఇస్తున్నారో తెలియడం లేదని, వేబ్రిడ్జి కాంటాల తూకాల్లో భారీగా తేడాలు ఉంటున్నాయన్నారు.

తనకున్న భూమితో పాటు కౌలుకు తీసుకుని 25 ఎకరాల్లో వరి పండిస్తున్నానని, గత వానాకాలంలో తన వడ్లు అమ్మితేనే వేబ్రిడ్జి తూకంలో4క్వింటాళ్ల తేడా వచ్చిందని తెలిపారు. మోత్కూరు, అడ్డగూడూరు మండలాలతో పాటు నియోజకవర్గంలో వందకు పైగా సెంటర్లు ఏర్పాటు చేశారని, ఓ రైతు ప్రైవేట్ సెంటర్లో వడ్లు అమ్మితే వే బ్రిడ్జి తూకంలో క్వింటాలుకు 85 కిలోల తూకమే వచ్చిందని తన దృష్టికి తెచ్చాడని, మార్కెటింగ్, తూనికలు, కొలతల ఆఫీసర్లు వే బ్రిడ్జి కాంటాలను తనిఖీలు చేయాలని, తక్కువ ధరకు వడ్లు కొంటూ రైతులను దోపిడీ చేస్తున్న ప్రైవేట్ వడ్ల కొనుగోలు కేంద్రాలు వెంటనే మూసి వేయాలన్నారు. వారం, పది రోజులుగా వరి కోతలు ముమ్మరమయ్యాయని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు త్వరగా ప్రారంభించాలని కలెక్టర్లను కోరామని, సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అధికారులకు ఆదేశాలిచ్చారని తెలిపారు. రైతులు పిల్లల చదువులకు, బిడ్డల పెళ్లిళ్లకు, అప్పో సప్పో కట్టడానికి త్వరగా వడ్లు అమ్ముకుంటుండటంతో దాన్ని ఆసరా చేసుకుని వ్యాపారులు, మధ్య దళారులు విచ్చలవిడిగా దోపిడీకి తెగబడ్డారన్నారు. రైతులు కొంత ఓపిక పడితే ప్రభుత్వ కేంద్రంలో మద్దతు ధరకు అమ్ముకోవచ్చని కోరారు.

భువనగిరి ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని అధిష్ఠానం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలంతా సమన్వయంతో పని చేయాలని, రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డి 5లక్షల కుపైగా మెజార్టీతో గెలిచి చరిత్ర తిరగ రాయడం ఖాయమన్నారు. కాంగ్రెస్ జిల్లా నాయకులు డాక్టర్ జి. లక్ష్మీ నర్సింహారెడ్డి, అవిశెట్టి అవిలిమల్లు, పట్టణ అధ్యక్షుడు గుండగోని రామచంద్ర, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ పోలినేని ఆనందమ్మ, నాయకులు మలిపెద్ది మల్లారెడ్డి, పన్నాల శ్రీనివాస్ రెడ్డి, పోలినేని స్వామి రాయుడు, మందుల సురేష్, పల్లపు నమ్మయ్య, చేత రాశి వీరస్వామి, మలిపెద్ది శ్రీకాంత్ రెడ్డి, మెంట నగేష్ తదితరులు ఆయన వెంట ఉన్నారు.


Next Story