మంత్రులు చెప్పిన ‘‘డోంట్ కేర్’’.. మునుగోడులో బీఆర్ఎస్‌కు భారీ ఎదురుదెబ్బ..!

by Disha Web Desk 19 |
మంత్రులు చెప్పిన ‘‘డోంట్ కేర్’’.. మునుగోడులో బీఆర్ఎస్‌కు భారీ ఎదురుదెబ్బ..!
X

దిశ, చౌటుప్పల్: బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న స్థానిక ప్రజాప్రతినిధులు స్థానికంగా తమకు ఎలాంటి గౌరవ దక్కడం లేదని, పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానం అందడం లేదని అలకబూనారు. అంతేకాకుండా స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిపై ఒకింత అసంతృప్తితో కూడా ఉన్నారు. వీరంతా ఎవరో కాదు మునుగోడు బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ.. ఆయా మండలాలకు, పట్టణాలకు పెద్దదిక్కుగా ఉన్న ప్రజాప్రతినిధులు. వీరంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిపై అసహనంతో ఉన్నారనే సమాచారంతో స్వయంగా మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి రంగంలోకి దిగి వారిని బుజ్జగించారు.

చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్‌గా ఉన్న వెన్ రెడ్డి రాజు తెలంగాణ మున్సిపల్ ఛాంబర్స్ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు. ఆయనకు మంత్రి కేటీఆర్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా మంత్రి జగదీష్ రెడ్డితో కూడా ఆయనకు సాహిత్యం ఉంది. దీంతో వీరు ఇరువురు మంత్రులు వెన్ రెడ్డి రాజుకు పార్టీలో సముచిత గౌరవం దక్కుతున్నదని పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని సూచించిన్నట్లు తెలిసింది. అయినా కూడా పార్టీలో ఎలాంటి గౌరవం దక్కలేదనే వాపోయారు. అదేవిధంగా పార్టీలో అసంతృప్తితో ఉన్న మరో నేత నాంపల్లి జెడ్పీటీసీ ఏ.వి.రెడ్డిని గత రెండు మూడు రోజుల క్రితమే స్వయంగా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రులు జగదీశ్ రెడ్డి, కేటీఆర్ వద్దకు తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా మండలంలో పార్టీలో ఆయనకే మొదటి ప్రయారిటీ ఉంటుందని స్వయంగా మంత్రులు హామీ ఇచ్చినట్లు సమాచారం. అయిన కూడా తిరిగి పార్టీ కార్యక్రమాలలో ప్రయారిటీ ఇవ్వకుండా దూరంగా పెట్టడంతో ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. వీరితోపాటు మిగిలిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి, మునుగోడు జెడ్పీటీసీ స్వరూపారాణి, నారాయణపురం ఎంపీపీ గుత్తా ఉమాదేవి, మునుగోడు వైస్ ఎంపీపీ అనంత వీణ, నాంపల్లి వైఎస్ ఎంపీపీ పాల్వాయి రజినిలకు కూడా పార్టీలో తగిన ప్రాధాన్యత లభించడం లేదనే కారణంతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

రాజగోపాల్ రెడ్డితో ముగిసిన అసంతృప్తుల సంప్రదింపులు!

మునుగోడు బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న స్థానిక ప్రజా ప్రతినిధులు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో ఒక మారు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని ఒక నాయకుడి ఇంట్లో ఇప్పటికే సమావేశమై కాంగ్రెస్ పార్టీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన స్థానిక ప్రజాప్రతినిధులందరూ నేడో రేపో రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు అయినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం రాజీనామా చేసినవారే కాకుండా మరికొంతమంది బీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో జరిపిన చర్చల్లో పాల్గొన్నట్లు తెలుస్తుంది.

వీరు కూడా ప్రస్తుతం రాజీనామా చేసిన వారితో పాటే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు.. ఈ రెండు రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కర్నే ప్రభాకర్ అనుచరులకు కూడా పార్టీ అభ్యర్థి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదనే అసంతృప్తితో గత రెండు రోజుల క్రితం నియోజకవర్గంలో రహస్య సమావేశాన్ని ఏర్పాటుచేసి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన నాయకులు మరికొంతమంది నాయకులను వెంట తోలుకుని తమ అనుచరులతో కలిసి భారీసభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాలా.. లేక సాదాసీదాగా చేరాల అనే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది.

బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బే..!

మునుగోడు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన స్థానిక ప్రజా ప్రతినిధులతో నియోజకవర్గంలో ఆ పార్టీకి కొంత ఎదురుదెబ్బే అని చెప్పాలి. పార్టీకి రాజీనామా చేసిన వారితో ఎలాంటి నష్టం లేదని బీఆర్ఎస్ నాయకులు అంటున్న అది మేకపోతు గాంబీర్యంగానే చెప్పుకోవచ్చు. ఎన్నికల సమయంలో అధికార పార్టీకి రాజీనామా చేసి స్థానిక ప్రజాప్రతినిధులు మరొక పార్టీలో చేరడంతో ఓటింగ్‌పై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. అంతేకాకుండా వీరితో పాటు మరికొంతమంది సర్పంచులు, ఎంపీటీసీలు కూడా అదే బాటలో నడవనున్నారనే సమాచారం అధికారపార్టీ నాయకులను ఒకింత కలవరానికి గురిచేస్తుంది. ఇకనైనా పార్టీ అధిష్టానం మునుగోడు నియోజకవర్గంపై దృష్టి సారించి అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు చేజారి పోకుండా చర్యలు చేపడతారో లేదో వేచి చూడాల్సిందే.

Next Story

Most Viewed