హాథ్​ సే హాథ్​ యాత్రకు నిధుల కొరత.. అయోమయంలో కాంగ్రెస్ నేతలు

by Disha Web Desk 12 |
హాథ్​ సే హాథ్​ యాత్రకు నిధుల కొరత.. అయోమయంలో కాంగ్రెస్ నేతలు
X

దిశ, తుంగతుర్తి: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా జరగాల్సిన హాథ్ సే హాథ్​ కార్యక్రమానికి ఆర్థిక సమస్యలు వచ్చి పడ్డాయి. వాటిని భరించడం నేతలకు కష్టతరంగా మారింది.ఫలితంగా భవిష్యతక పరంగా ఏం చేద్దాం..? ఎలా ముందుకు పోదాం..? అంటూ ఆ పార్టీ నేతలు అయోమయంలో ఉన్నారు. ఫలితంగా 15 రోజులైనా యాత్ర పునఃప్రారంభం పై స్పష్టమైన నిర్ణయాలను ఆ పార్టీ నేతలు తీసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా 9 ఏండ్లుగా అధికారం లేక ప్రతిపక్షంలో ఉంటూ ఉన్న ఆస్తులను కరగదీస్తూ పార్టీ క్యాడర్ ను కాపాడుతున్నామంటూ వారంతా లోలోన మదన పడుతూ మరోవైపు మింగలేక కక్కలేక అనే రీతిలో సంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే ప్రస్తుతం హాథక సే హాథ్​ కార్యక్రమాన్ని నిర్వహించడం పెద్ద సవాల్ గా మారిందనే బాధను దిగమింగుతున్నారు. దీన్ని భరించడం ఎలా ? అనే తరహాలో ఆ పార్టీ నేతలు మదప పడుతున్నారు.

ముఖ్యంగా ఈనెల 6న తుంగతుర్తిలో యాత్ర అట్టసంగా ప్రారంభమైంది. దీనికి నియోజకవర్గంలోని 9 మండలాల నుండి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆరోజు జరిగిన ఖర్చులను పలువురు నేతలు అతికష్టం మీద భరించాల్సి వచ్చింది. ప్రస్తుతం మున్ముందు వచ్చే ఖర్చులను భరించడం ఎలా..? అంటూ వారంతా లోలోన మదన పడుతున్నట్లు తెలిసింది. ముఖ్యంగా నియోజకవర్గంలోని 9 మండలాలలో కార్యక్రమాన్ని చేపట్టాలంటే భారీ ఖర్చుతో కూడుకున్న పని.

ఈ సందర్భంగా ఈనెల 6న ఆర్భాటంగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తే పెద్ద ఎత్తున ఖర్చు అయిన పరిస్థితులు నాయకులు నెమరేసుకుంటున్నారు. మోత్కూరు, అడ్డ గూడూరు, శాలిగౌరారం, తిరుమలగిరి, నాగారం, అర్వపల్లి, తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్ మండలాల్లో యాత్ర నిర్వహణతో ఖర్చులు భారీ ఎత్తున పెరిగే అవకాశం ఉందంటూ లెక్కలు కడుతున్నారు.

150 గ్రామాలకు పైగా సాగేదెలా...?

భువనగిరి యాదాద్రి,నల్లగొండ,సూర్యాపేట జిల్లాలలో తుంగతుర్తి నియోజకవర్గం విస్తరించి ఉంది. నియోజకవర్గంలోని 9 మండలాలలో చిన్నా చితక కలిపి 150 పైగా గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలలో పర్యటించాలంటే సమయంతో పాటు ఖర్చు కూడా భారీగానే ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో 9 మండలాలలో ఉన్న ప్రతి గ్రామాన్ని పర్యటించాలా..? లేక ముఖ్యమైన వాటిని చుట్టి ముట్టి వెళ్దామా..? అనే ప్రశ్నలపై కూడా చర్చ జరుగుతున్నట్లు తెలిసింది. ముఖ్యంగా మోత్కూరు, అడ్డగూడూరు, శాలిగౌరారం,నూతనకల్ మండలాల పరిధి చాలా పెద్దదిగా ఉండడం కూడా నాయకులకు సమస్యగా మారింది.

ఎడ-పెడ ముఖంలో.. టికెట్ ఎవరిది ?

నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తిలో ఈనెల 6న హాథ్ సే హాథ యాత్ర ప్రారంభమైనప్పటికీ మొదటినుండి వర్గ విభేదాలతో కొనసాగుతున్న నాయకులంతా ఎడ ముఖం..పెడ ముఖంగానే ఉండిపోయారు. ముఖ్యంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసే వారి సంఖ్య ఆరడజనుకు పైగానే ఉంటుంది. ఇందులో హాథ్​ సే హాథ్​ కార్యక్రమానికి అడ్డొచ్చే ఆర్థిక సమస్యలు తీర్చడానికి కొంతమంది ఉన్నారు. కానీ ఖర్చులు భరించే వారికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించకపోతే పరిస్థితి ఏంటి ? అనే అంశం కూడా పార్టీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే మొదట్లో 6వ తేదీన తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ప్రారంభమైన యాత్ర సూర్యాపేటలో జరిగే లింగమంతుల స్వామి జాతర పరిణామాల దృష్ట్యా అది (జాతర) ముగిసే వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా యాత్రను తిరిగి ఎప్పుడు ప్రారంభించే విషయాల్ని కూడా ప్రకటిస్తామని నిర్వాహకులు చెప్పుకొచ్చారు. అయితే జాతర ముగియడంతో పాటు ప్రకటన చేసి 15 రోజులు అవుతున్నప్పటికీ యాత్ర ప్రారంభంపై స్పష్టమైన ప్రకటన నేటికీ వెలువడ లేదు. ప్రధానంగా ఆర్థిక సమస్యలే యాత్ర ప్రారంభ జాప్యానికి ప్రధాన కారణంగా మారింది.

Next Story

Most Viewed