జోరుగా అక్రమంగా మట్టి తరలింపు.. నంబర్ ప్లేట్ లేని వాహనాలతో రవాణా

by Disha Web Desk 9 |
జోరుగా అక్రమంగా మట్టి తరలింపు.. నంబర్ ప్లేట్ లేని వాహనాలతో రవాణా
X

దిశ , నల్లగొండ బ్యూరో: సూర్యాపేట పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్లో కొందరు అక్రమార్కులు మట్టిని తవ్వి అమ్ముకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. దీనిపై అధికారులు సరైన నిఘా పెట్టక పోవడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇంత బహిరంగంగా మట్టి రవాణా సాగుతుంటే అధికారులకు తెలియకుండా ఉంటుందా అనే ప్రశ్నలు ప్రజల్లో మొదలుతున్నాయి. ఈ మట్టి రవాణా గతంలో మున్సిపల్ పరిధితో పాటు సూర్యాపేట, చివ్వేంల,పెన్ పహాడ్ మండలాల్లో సాగినప్పటికీ తాజాగా జిల్లాలోని ఆత్మకూర్ (ఎస్) మండలం ముక్కుడు దేవులపల్లి పిల్లబోయిన కుంటలో గత పది రోజులుగా జేసీబీ ట్రాక్టర్లతో కొందరు అక్రమార్కులు మట్టిని తవ్వి ఇటుక బట్టీలలతో ఇతర అవసరాల కోసం ఉపయోగించే వ్యాపారులకు ఒక్కొక్క ట్రాక్టర్‌కు వేలల్లో అమ్ముకుంటున్నారు. దీనిపై అధికారుల నోరు మెదపకపోవడంతో ఇదంతా వారి సహకారంతోనే జరుగుతూనే ఉంటుందనే అనుమానం గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులకు ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

నంబర్ ప్లేట్ లేని వాహనాలతో దందా..

ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలో సాగుతున్న అక్రమ దందాల్లో ఎక్కువగా నెంబర్ ప్లేట్ లేని వాహనాల ద్వారానే సాగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జేసీబీలు, ట్రాక్టర్లు, టిప్పర్‌లతో అక్రమంగా ఇసుకతో పాటు మట్టిని కూడా దందాలు చేస్తూ రోడ్లపై దర్జాగా తిరుగుతూ ప్రభుత్వ ధనాన్ని స్వాహా చేస్తున్నారు. రోజు కూలీ పని చేసుకొనేందుకు వచ్చే కూలీల వాహనాలు రోడ్డుపై కనిపిస్తే చాలనులు వేసే సంబంధిత శాఖ అధికారులకు నంబర్ ప్లేట్ లేని వాహనాలు కనిపించడం లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆ మండలంలోని ఏపూర్, ముక్కుడు దేవులపల్లి, రామన్న గూడెం, గ్రామాల నుంచి సుమారు 40 ట్రాక్టర్ల తో గత రెండు నెలలుగా ఇసుక అక్రమ రవాణాకి కొందరు అక్రమార్కులు ట్రిప్పుకు 4 నుంచి 5 వేల రూపాయలకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉద్యోగ రీత్యా పోలీసులు, రెవెన్యూ అధికారులు అరకొరగా తనిఖీలు చేస్తున్నప్పటికీ కొందరు బడా నాయకుల నుంచి ఫోన్ లు రావడంతో చేసేదేమీ లేక తనకేమి తెలియనట్లు వదిలేస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.

Next Story

Most Viewed