తీరుతున్న గిరిజనుల చిరకాల స్వప్నం

by Disha Web Desk 12 |
తీరుతున్న గిరిజనుల చిరకాల స్వప్నం
X

దిశ, తుంగతుర్తి: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గిరిజన ప్రజానీకానికి మంచి రోజులు వచ్చాయి. అంతేకాదు.. ఎన్నాళ్ళ నుండో పెట్టుకున్న ఆశలన్నీ తీరబోతున్నాయి. తమ సామాజిక వర్గానికి అత్యంత అనుకూలంగా మారిన బంజారా భవనం నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ కృషితో రాష్ట్ర ప్రభుత్వం రూ.రెండు కోట్ల నిధులను సోమవారం మంజూరు చేసింది.ఈ మేరకు ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి.నియోజకవర్గంలో 9 మండలాలు ఉండగా ఇందులో అత్యధికంగా గిరిజనుల సంఖ్య తుంగతుర్తి మండలంలోని ఉంది.ఈ మేరకు ప్రత్యేకంగా 11 గ్రామపంచాయతీలు కూడా ఏర్పడ్డాయి. అనంతరం నూతనకల్, తిరుమలగిరి, మద్దిరాల, అర్వపల్లి, నాగారం మండలాలలో గిరిజనుల సంఖ్య ఉంటుంది.

అయితే గత కొంత కాలంగా తమ ఆరాధ్యుడైన సంతు సేవాలాల్ పేరుతో జరిగే పలు కార్యక్రమాలు పురస్కరించుకొని గిరిజనులంతా నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తిలో బంజారా భవనం ఏర్పాటు చేయాలనే డిమాండ్ వారి నుండి ప్రధానంగా వస్తుంది.దీనికి స్థానిక శాసనసభ్యులు కిషోర్ కూడా గిరిజనుల కోరిక మేరకు తుంగతుర్తిలో దీన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.ముఖ్యంగా తుంగతుర్తి-నాగారం గ్రామ ప్రధాన రహదారిపై ఉన్న ఒక ఎకరం ప్రభుత్వ స్థలంలో ఇప్పటికే ఒక కోటి రూపాయల వ్యయంతో అంబేద్కర్ భవన నిర్మాణం కొనసాగుతుండగా దీని పక్కనే ప్రస్తుతం మంజూరైన రూ.రెండు కోట్ల నిధుల వ్యయంతో బంజారా భవనాన్ని ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.ఈ సందర్భంగా సోమవారం రాత్రి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ “దిశ”తో మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం సమాన గౌరవం కల్పిస్తూ వారి ఆత్మ గౌరవ భవనాలను నిర్మిస్తోందని పేర్కొన్నారు.రాష్ట్రం ఏర్పడిన తర్వాత గిరిజనులకు తగిన గౌరవం ఏర్పడిందని ఈ మేరకు గిరిజన తండాలను నూతన గ్రామ పంచాయతీలుగా చేసి వారి నిధులు వాళ్లకే కేటాయించి తండాల రూపురేఖలు మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని అన్నారు. అంతేకాకుండా గిరిజనులకు 6 నుంచి 10 శాతం రిజర్వేషన్ పెంచడంతో పాటు, భవిష్యత్తులో భూమి లేనటువంటి గిరిజనులకు గిరిజన బంధు ప్రవేశపెడతామంటూ హామీ ఇచ్చారని అన్నారు. తుంగతుర్తిలో గిరిజన భవనాన నిర్మాణానికి రెండు కోట్ల నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రులు సత్యవతి రాథోడ్,గుంటకండ్ల జగదీష్ రెడ్డి లకు కిషోర్ కృతజ్ఞతలు తెలిపారు.

Next Story

Most Viewed