గంజాయి తరలింపు ముఠా అరెస్ట్..

by Disha Web Desk 20 |
గంజాయి తరలింపు ముఠా అరెస్ట్..
X

దిశ, చౌటుప్పల్ టౌన్ : అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఐదుగురు ముఠాసభ్యులు గల నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ విషయాన్ని భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి వివరాలు వెల్లడించారు. డీసీపీ వెల్లడించిన వివరాల ప్రకారం మహారాష్ట్ర సోలాపూర్ జిల్లాకు చెందిన బజరంగ్ శ్రీరంగ కరాడే, సాగర్ శివాజీ మస్తుడ్, సుయాస్ రాందాస్ సర్దే అనే ముగ్గురు స్నేహితులు. గంజాయి స్మగ్లింగ్ ద్వారా త్వరగా డబ్బులు సంపాదించాలనే ఆశతో ఒడిస్సా రాష్ట్రానికి చెందిన శుక్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాంబాబులతో స్నేహం కుదుర్చుకున్నారు. ఈ ఐదుగురు ఒక ముఠాగా ఏర్పడి గంజాయి స్మగ్లింగ్ ను ఒక వ్యాపారంగా మార్చుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నుంచి తెలంగాణ మీదుగా హైదరాబాద్, ముంబై, షోలాపూర్ తదితర ప్రాంతాలకు గంజాయి సరఫరా చేస్తున్నారు. ఇందులో భాగంగా తమబొలెరో వాహనంలో భద్రాచలం, చిత్తూరు జిల్లాలకు వెళ్లి 232 కిలోల గంజాయి కొనుగోలు చేశారు. తొర్రూరు, వలిగొండ మీదుగా సోలాపూర్ కు గంజాయిని తరలిస్తున్నారు. పక్కాసమాచారం అందుకున్న రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అడ్డగూడూరు, చౌటుప్పల్ సబ్ డివిజన్, భువనగిరి జోన్ పోలీసులు సంయుక్తంగా చౌలరామారం వద్ద వాహనాల తనిఖీలు చేపట్టగా ఈ ముఠా గుట్టు రట్టయింది. గంజాయి ముఠాను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను ఈ సందర్భంగా డీసీపీ రాజేష్ చంద్ర అభినందించారు. ఈ విలేకరుల సమావేశంలో చౌటుప్పల్ ఏసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, రామన్నపేట సిఐ మోతి రావు, అడ్డగూడూరు ఎస్సై ఉదయ్ కిరణ్, మోత్కూర్ ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, చౌటుప్పల్ క్రైమ్ ఎస్సై అనిల్ పాల్గొన్నారు.



Next Story

Most Viewed