ఈ నేలపై విషం చిమ్మకండి.. వీటికి సమాధానాలు చెప్పండి.. ప్రధాని మోడీకి కేటీఆర్ ప్రశ్నలు

by Disha Web Desk 13 |
ఈ నేలపై విషం చిమ్మకండి.. వీటికి సమాధానాలు చెప్పండి.. ప్రధాని మోడీకి కేటీఆర్ ప్రశ్నలు
X

దిశ, డైనమిక్ బ్యూరో:బీజేపీ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేతలు రాష్ట్రంలో వరుసగా పర్యటిస్తుండగా రేపు ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తెలంగాణకు రాబోతున్నారు. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఆయన పర్యటిచనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఉదయం ట్వీట్ చేసిన కేటీఆర్ దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మవద్దని మోడీని ఉద్దేశించి అన్నారు. దశాబ్ధాలకాలంలో ఏం చేశారనే విషయాన్ని ప్రజలకు వివరించి ఓట్లు అడగాలన్నారు. ఈ సందర్భంగా మోడీకి యావత్ తెలంగాణ సమాజం పక్షాన కొన్ని ప్రశ్నలను కేటీఆర్ సంధించారు.

వీటికి సమాధానాలు చెప్పండి:

“పిరమైన’ ప్రధాని గారు.. ప్రధానిగా పదేళ్లు గడిచినా.. తెలంగాణ ప్రధాన హామీలను ఎందుకు మరిచారు? ఒక్క తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుకు ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదు? మా యువతకు ఉపాధినిచ్చే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ఎందుకు పాతరేశారు? మా ఏజెన్సీ బిడ్డలకు బతుకు దెరువునిచ్చే బయ్యారం స్టీలు ఫ్యాక్టరీని ఎందుకు బొందపెట్టారు అని కేటీఆర్ ప్రశ్నించారు. మా నవతరానికి కొండంత భరోసానిచ్చే ఐటీఐఆర్, హైదరాబాద్ ప్రాజెక్టును ఎందుకు ఆగం చేశారు? తమ పిల్లల బంగారు భవితపై ఆశలు పెట్టుకున్న లక్షలాది తల్లిదండ్రుల ఆశయంపై ఎందుకు నీళ్లు జల్లారని ప్రశ్నించారు. తెలంగాణకు ఒక్కటంటే ఒక్క నవోదయ, మెడికల్ కాలేజీ.. నర్సింగ్ కళాశాల, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ.. ఐఐఎం, ఐసర్, ఎన్.ఐ.డీ ఎందుకు ఇవ్వలేదు? సాగునీటి ప్రాజెక్టులను కేంద్రం గుప్పిట్లో పెట్టుకుని మా రైతులపై ఎందుకు పెత్తనం చేస్తున్నారు? లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండినా 200కు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నా కాంగ్రెస్ సర్కారు పాపానికి నేతన్నలు బలైపోతున్నా తెలంగాణ వైపు ఎందుకు కన్నెత్తి చూడలేదని ప్రశ్నించారు. చేనేత రంగంపై జీఎస్టీ వేసి మగ్గానికి ఎందుకు మరణశాసనం రాశారో చెప్పండి? తెలంగాణకు కష్టపడి తెచ్చుకున్న పరిశ్రమలను బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎందుకు తన్నుకుపోతున్నారు? మండిపోతున్న నిత్యవసర ధరలను ఎందుకు అదుపు చేయలేకపోయారు? ముడి చమురు ధరలు తగ్గినా మోడీ హయాంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు తగ్గలేదో చెప్పాలన్నారు. భావోద్వేగాలు రెచ్చగొట్టడం కాదు.. మీరిచ్చిన 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందో చెప్పాలన్నారు. సబ్ కా సాత్, అచ్చే దిన్ లాంటి నినాదాలు ఎందుకు విధానాలుగా మారలేదు? మీ పాలనలో పదేళ్లు గడిచినా ఇంకా ఉచిత రేషన్ పథకం కింద 80 కోట్ల పేదలు ఎలా ఉన్నారో చెప్పాలన్నారు.

డివిజన్ కాదు విజన్ ఉంటే చెప్పండి:

అవినీతిపరులకు మీ పార్టీలో ఆశ్రయమిచ్చి రాజకీయ ప్రత్యర్థులపై దర్యాప్తు సంస్థలను ఎందుకు ప్రయోగిస్తున్నారని ప్రశ్నించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగంపై ప్రజల సాక్షిగా ప్రమాణం చేసి అదే రాజ్యాంగాన్ని అందరి కళ్లముందే కాలరాయకండి అంటూ సూచించారు. దేశ ప్రధాన మంత్రిగా ప్రధాన సమస్యలను పరిష్కరించకుండా ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నాలు చేయవద్దని, దేశం కోసం ఏదైనా “విజన్” ఉంటే చెప్పండి కానీ దయచేసి సమాజంలో “డివిజన్” మాత్రం సృష్టించవద్దన్నారు. రెచ్చగొట్టే రాజకీయాలకు ఇక్కడ ఓట్లు పడవని ఇది తెలంగాణ గడ్డ.. ప్రజా చైతన్యానికి అడ్డ అని ట్వీట్ లో పేర్కొన్నారు.

Next Story

Most Viewed