వెంకట్ రెడ్డి పిచ్చి మాటలు మానుకో.. కుంభం అనిల్ కుమార్ రెడ్డి

by Disha Web Desk 20 |
వెంకట్ రెడ్డి పిచ్చి మాటలు మానుకో.. కుంభం అనిల్ కుమార్ రెడ్డి
X

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పిచ్చి మాటలు మానుకోవాలని.. కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గం స్థాయి సమావేశంలో తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం భువనగిరిలో రహదారి బంగ్లాలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీసీకి టికెట్ ఇప్పించి గెలిపించుకోగలవా అని ప్రశ్నించారు. సొంత ఊర్లో సర్పంచ్, సొంత మండలంలో జడ్పీటీసీని గెలిపించుకోలేని కోమటిరెడ్డి భువనగిరిలో బీసీ అభ్యర్థిని గెలిపిస్తాననడం హాస్యాస్పదమన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం తప్పా..? బతకడానికి పనిచేసుకోవడం కూడా తప్పు అని మాట్లాడడం సరికాదన్నారు. గతంలో వెంకటరెడ్డి కూడా సిద్దిపేటలో ట్రాన్స్ఫార్మర్లు రిపేరు చేసుకున్నది నిజం కాదా అన్నారు. మేము కన్స్ట్రక్షన్ వ్యాపారం చేస్తూ వందల మందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. బీసీ అయిన చెరుకు సుధాకర్ ను చంపుతానని బెదిరించినప్పుడు నీ బీసీ నినాదం ఏమైందన్నారు.

కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీని అడ్డుపెట్టుకొని అన్న తమ్ముళ్లు ఇద్దరు వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని విమర్శించారు. పార్టీని వీడిన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కోసం బీజేపీకి ఓటు వేయమని చెప్పిన దుర్మార్గుడు వెంకట్ రెడ్డి అని అన్నారు. కేసీఆర్ జనరంజకమైన పాలనను చూసి పార్టీలో చేరానన్నారు. సూర్యాపేటలో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. జిల్లాలో కాలుష్య రహిత మూసీనీరు అందించాలని కేటీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలిపారు. భువనగిరి ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఆయన వెంట భువనగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కృష్ణయ్య, ఎడ్ల రాజేందర్ రెడ్డి, నోముల పరమేశ్వర్ రెడ్డి, నూతి రమేష్ తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed