వచ్చే ఎన్నికల్లో పైళ్ళ శేఖర్ రెడ్డి ఓటమి ఖాయం: గూడూరు

by Dishanational1 |
వచ్చే ఎన్నికల్లో పైళ్ళ శేఖర్ రెడ్డి ఓటమి ఖాయం: గూడూరు
X

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి ఓటమి ఖాయమని బీజేపీ సీనియర్ నేత గూడూరు నారాయణ రెడ్డి అన్నారు. ప్రజా గోస బీజేపీ భరోసా శక్తి కేంద్ర స్ట్రీట్ కార్నర్ సమావేశాన్ని భువనగిరి మండలం వడాయి గూడెం గ్రామంలో బుధవారం ఏర్పాటు చేశారు. కాగా ముఖ్య అతిథిగా నారాయణరెడ్డి హాజరై మాట్లాడారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పుల కుప్పగా తయారైందని, రాష్ట్రంలో 40 లక్షల విద్యాధికులైన నిరుద్యోగులున్నారని మండిపడ్డారు. నిరుద్యోగ యువకులు ప్రతి ఒక్కరికీ రూ. లక్ష అరవై వేలు కేసీఆర్ బాకీ పడ్డారని విమర్శలు చేశారు. రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల జాడే లేదని, దళితులు, గిరిజనులకు ఇస్తానన్న మూడెకరాల జాడే లేదని నారాయణ రెడ్డి ధ్వజమెత్తారు.

రైతులకు ఏకకాలంలో రుణమాఫి చేస్తానని ఇప్పటివరకు చేయలేదని, కొత్త రేషన్ కార్డులు ఇస్తానన్న జాడే లేదని మండిపడ్డారు. భువనగిరి అసెంబ్లీ నియోజవర్గాన్ని ఎలాంటి అభివృద్ధి చేసింది లేదని, ఎమ్మెల్యే ఏమి చేతకాని దద్దమ్మలా మారిపోయాడని ఘాటుగా స్పందించారు. అడుగడుగునా ఎమ్మెల్యేకు ప్రజల్లో నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీయే అని, వచ్చే ఎన్నికల్లో భువనగిరి ఖిల్లాపై కాషాయం జండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వడాయిగూడెం శక్తి కేంద్ర ఇంఛార్జి భోనగిరి అరవింద్, బీజేపీ మండల అధ్యక్షుడు నల్లమాస శేఖర్ గౌడ్, బూత్ అధ్యక్షుడు బబ్బురి సురేష్, ఎంకర్ల రవి, బుగ్గ దేవేందర్, మాటురి ఉపేందర్, మండల కార్యదర్శి మటూరి అనిల్, బాబ్బురి శంకర్, ముద్దగాని రాజు, కార్యదర్శి రామ్, యువ మోర్చా అధ్యక్షుడు నోముల భాను, సీనియర్ నాయకులు జిట్ట స్వామి, వల్లాల స్వామి తదితరులు పాల్గొన్నారు.


Next Story