మునుగోడులో ఎమ్మెల్యే Vs మున్సిపల్ చైర్మన్.. కేడర్‌లో తీవ్ర ఆందోళన

by Disha Web Desk 4 |
మునుగోడులో ఎమ్మెల్యే Vs మున్సిపల్ చైర్మన్.. కేడర్‌లో తీవ్ర ఆందోళన
X

దిశ, చౌటుప్పల్ టౌన్ : విడవమంటే పాముకు కోపం... కరవమంటే కప్పకు కోపం ఎవరి మాట వింటే ఎవరికి కోపం వస్తుందో తెలియని అయోమయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న దుస్థితి అక్కడి కార్యకర్తలది. ఎమ్మెల్యే వర్సెస్... మున్సిపల్ చైర్మన్.. వీరిద్దరూ అధికార పార్టీ నేతలే. ఇద్దరి మధ్య ఎక్కడ తేడలొచ్చాయో తెలియదు గానీ... గత ఏడాది కాలంగా వీరి ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు ముదిరిపోయాయి. ఎమ్మెల్యే మాట వినాలా... మున్సిపల్ చైర్మన్ చెప్పింది చేయాలో తెలియని డైలమాలో అధికారులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇదీ మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధి చౌటుప్పల్‌లో ఏర్పడిన దుస్థితి. తెలంగాణ మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిల మధ్య నడుస్తున్న ప్రచ్ఛన్న యుద్ధం నిత్యకృత్యంగా మారింది.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై సొంత పార్టీలోనే రోజు రోజుకు అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతోంది. చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ల మధ్య గత ఏడాది కాలంగా విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. ప్రభుత్వ నిధులతో చేపడుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్మన్‌ను ఆహ్వానించకుండా ఎమ్మెల్యే ఒక్కడే తన అనుచరులతో వెళ్లి శంకుస్థాపనలు చేయడం... మున్సిపల్ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు చైర్మన్ సైతం ఎమ్మెల్యేను ఆహ్వానించకపోవడం వంటి ఘటనలతో ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. గతంలో చౌటుప్పల్ మార్కెట్ యార్డులో నిర్వహించిన సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో వీరిద్దరి మధ్య మాటల యుద్ధమే జరిగింది. కార్యకర్తల ఎదుటే వీరు తీవ్ర స్థాయిలో వాదనలకు దిగి మనస్పర్థలు మరింత పెంచుకున్నారు.

ఎమ్మెల్యే టికెట్టు కోసం ప్రయత్నించడంతో..

ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందు మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది అధిష్ఠానం నిర్ణయించకముందు ఈ స్థానంలో పార్టీ టికెట్టు కోసం ప్రయత్నించిన ఆశావహుల్లో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు ఒకరు. కూసుకుంట్లను వ్యతిరేకించే ముఖ్య నాయకులతో చైర్మన్ వెన్ రెడ్డి రాజు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రహస్య సమావేశాలు నిర్వహించినట్టు భోగట్టా. ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మళ్లీ టికెట్ ఇస్తే మునుగోడులో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం ఖాయమనే సంకేతాలు చైర్మన్ అధిష్టానానికి పంపినట్టు సమాచారం.

దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి స్థానిక మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజుపై అక్కసు పెంచుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ మున్సిపల్ ఛాంబర్ చైర్మన్‌గా వెన్ రెడ్డి రాజును ఎన్నుకోవడాన్ని కూడా ఎమ్మెల్యే కూసుకుంట్ల జీర్ణించకోలేకపోయారని సమాచారం. మున్సిపల్ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బ్రేకులు వేయాలని చూస్తే.. ఎమ్మెల్యే ప్రతిపాదించే పనులకు మున్సిపల్ చైర్మన్ బ్రేకులు వేస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య ఏ క్షణాన ఏ గొడవ వచ్చి పడుతుందో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఎన్నికలు సమీపిస్తున్నా పట్టింపు ఏదీ?

రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం తమ అభ్యర్థలకు బీ ఫారాలు అందజేసి అభ్యర్థులను ప్రచారం ముమ్మరంగా చేయాలని ఆదేశించింది.. అన్ని పార్టీల నాయకులు తమ అసమ్మతి వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసంతృప్తులు, వ్యతిరేక భావంతో దూరంగా ఉంటున్న వారిని చేరదేయడంలో ఎమ్మెల్యే ఘోరంగా విఫలమవుతున్నారని పార్టీ క్యాడర్‌లో నిరాశా నిస్పృహలు నెలకొంటున్నాయి. చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్‌తో, పార్టీ సీనియర్లతో ఎమ్మెల్యే విభేదించడం వల్ల నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

Next Story

Most Viewed