ఎమ్మార్వో డిజిటల్ సంతకం ​ఫోర్జరీ.. ధరణి మాడ్యూళ్లలో అనేక వింతలు

by Disha Web Desk 4 |
ఎమ్మార్వో డిజిటల్ సంతకం ​ఫోర్జరీ.. ధరణి మాడ్యూళ్లలో అనేక వింతలు
X

ధరణితో భూ సమస్యల పరిష్కారం మాటేమిటోగానీ, కొత్త పంచాయితీలు పుట్టుకొస్తున్నాయి. ఇన్నాళ్లు రైతులకే చుక్కలు చూపించిన ధరణి.. ఇప్పుడు తహశీల్దార్లనూ ఓ రేంజ్‌లో వణికిస్తున్నది. ధరణిలో ఏ టు జడ్​కలెక్టర్లదే బాధ్యత అని ప్రభుత్వం ఢంకా బజాయించి చెబుతున్నా.. కలెక్టర్లు జారీ చేస్తున్న పట్టా పాసుపుస్తకాలపై మాత్రం తహశీల్దార్ల సంతకాలు ఉంటున్నాయి. ఎవరైతే ఫైల్​అప్రూవ్​చేస్తారో వారి సంతకమే ఉండాల్సి ఉండగా.. ధరణిలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతున్నది.

అప్రూవల్ కలెక్టర్ ఇస్తున్నా.. సంతకం మాత్రం తహశీల్దార్లది ఉంటున్నది. రేపేమైనా కోర్టు చిక్కులు వస్తే.. ఏ పాపం ఎరగని తహశీల్దార్లు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. అసలు అన్ని పనులు కలెక్టర్లు చేయాలన్న ఆలోచనే అసంబద్ధమైనదని రెవెన్యూ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఏదిఏమైనా రెండున్నరేండ్లుగా లక్షలాది పట్టాదార్​పాస్‌పుస్తకాలపై కలెక్టర్లు యథేచ్ఛగా తహశీల్దార్ల డిజిటల్ సంతకాలు పెడుతుండటం రెవెన్యూ అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది.

బ్యూటీ ఆఫ్ ధరణి పోర్టల్

* తహశీల్దార్లు తిరస్కరించిన ఫైళ్లను కలెక్టర్ ​అప్రూవల్ ​చేస్తే సమస్య ఎవరికి? ఎవరు బాధ్యులు?

* సంతకాలు తహశీల్దార్లవే ఉన్నప్పుడు కోర్టు చిక్కులు ఎదుర్కోవాల్సింది వారే కదా!

* నిజానికి అన్ని పనులు కలెక్టర్లతోనే చేయించాలన్న ఆలోచనే అసంబద్ధం.

* ధరణిలో తహశీల్దార్ల నుంచి రిపోర్టు తెప్పించుకోవాలని లేకున్నా.. ఆ పని చేయిస్తున్న కలెక్లర్లు.

దిశ, తెలంగాణ బ్యూరో : ధరణి పోర్టల్​ వింతలు.. భూమి మీద ఎక్కడా ఉండవేమో!! సహజంగా ఒకరి సంతకం మరొకరు పెట్టడం ఫోర్జరీ అయితే.. ధరణిలో మాత్రం అది డ్యూటీ అవుతుంది. అది కూడా మామూలు అధికారులు కాదు.. ఏకంగా కలెక్టర్లే ఈ పని చేస్తున్నారు. తహశీల్దార్ల డిజిటల్ సంతకాలతో పాస్​ పుస్తకాలకు అప్రూవల్స్​ ఇస్తున్నారు. అదీ ఒకటీ, అరా అనుకుంటే పొరపాటే.. ధరణి మాడ్యూళ్లు ఇచ్చిన విశేషాధికారాలతో కలెక్టర్లు.. లక్షలాది పట్టదారు పాస్​ పుస్తకాల్లో తాసిల్దార్ల సంతకాలు పెట్టేశారు. రెండున్నరేండ్లుగా ఈ తంతు కొనసాగుతున్నా.. సీసీఎల్​ఏ అధికారులు గానీ, సర్కారు గానీ ఈ విషయాన్ని గుర్తించకపోవడం గమనార్హం. ఇది ముమ్మాటికీ ఫోర్జరీనే అని రెవెన్యూ ఉద్యోగులు, అధికారులంతా గుర్తించినప్పటికీ బయటికి చెప్పలేకపోతున్నారు.

ఇది ఫోర్జరీ కాదా?

కలెక్టర్ల ఆమోదించే ఫైళ్లపైన ఆయన సంతకానికి బదులుగా తహశీల్దార్ల సంతకాలే ఎందుకు పెట్టాలి? కలెక్టర్ సంతకం ఎందుకు పెట్టడం లేదు? ధరణి మాడ్యూళ్ల ప్రకారం రిపోర్టులు మాత్రమే తయారు చేయాలి. వారి నివేదికల ఆధారంగా కలెక్టర్ ఆమోదించొచ్చు.. తిరస్కరించొచ్చు. అలాగే ఏదైనా సమస్య పరిష్కారంలో తహశీల్దార్ నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చినా కలెక్టర్ ఆమోదించే అవకాశం ఉన్నది. అలాంటి సందర్భాల్లోనూ తహశీల్దార్ల సంతకాలతో కలెక్టర్లు ఆమోదిస్తుంటే ఫోర్జరీ అనకపోతే ఏం అంటారని రెవెన్యూ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

తమకు తెలియకుండానే కలెక్టరేట్లలోని ఔట్ సోర్సింగ్ సిబ్బంది తహశీల్దార్ల డిజిటల్ సంతకాలతో పట్టాదారు పాసు పుస్తకాలు.. ఇతర ఫైళ్లను క్లియర్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది సరైంది కాదని కలెక్టర్లకూ తెలుసు. కానీ, తన సంతకానికి బదులుగా మండల స్థాయి అధికారి సంతకంతో ఫైళ్ల క్లియరెన్స్ చేస్తున్నామని గుర్తించినా ప్రభుత్వానికి మాత్రం నివేదించడానికి జంకుతున్నారు. ధరణి పోర్టల్ లో ఆప్షన్ల మార్పుతో ఈ ఫోర్జరీ బాగోతానికి తెర పడుతుంది. కానీ, రానున్న రోజుల్లో ఏవైనా కేసులు ఎదుర్కోవాల్సి వస్తే తప్పు చేయని తహశీల్దార్లే బాధ్యులవుతారని రెవెన్యూ శాఖలో పెద్ద చర్చనే నడుస్తున్నది.

అంతా కలెక్టర్ల చేతిలోనే

భూ సంబంధ సమస్యలన్నీ కలెక్టర్లు పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది. వీఆర్వో స్థాయి నుంచి కలెక్టర్​ వరకు చేసే పనులన్నీ వారే నిర్వర్తించాల్సి వస్తున్నది. అప్పుడేమో ఇది కష్టమని, అసాధ్యమని ఏ కలెక్టర్ ​చెప్పే సాహసం చేయలేదు. ఇప్పుడేమో తహశీల్దార్లు ఇచ్చిన నివేదికల ఆధారంగా చేసుకుని బయోమెట్రిక్​తో వారి డిజిటల్​సంతకాలనే పెట్టేస్తున్నారు. తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల చట్టం 2020 ప్రకారం పట్టాదారు పాసు పుస్తకాల జారీ తహశీల్దార్లకే ఉంది.

అయితే తహశీల్దార్లు తిరస్కరించిన ఫైళ్లను కూడా కలెక్టర్​అప్రూవల్​చేస్తే సమస్య ఎవరికి? ఎవరు బాధ్యులు? తహశీల్దార్లు చేయొద్దన్న పనులు కూడా కలెక్టర్లు పూర్తి చేస్తే ఇక్కట్లే కదా! నిజానికి అన్ని పనులు కలెక్టర్లతోనే చేయించాలన్న ఆలోచనే అసంబద్ధమని రెవెన్యూ వర్గాలు విమర్శిస్తున్నాయి. నిజానికి తహశీల్దార్లు పంపిన నివేదికను ఆమోదించి పని పూర్తి చేసే బాధ్యతను డివిజన్​ స్థాయి వాళ్లకు అప్పగించొచ్చు. కానీ అధికారమంతా కలెక్టర్ల చేతిలోనే ఉంచుకోవాలనుకోవడంలోనే కుట్ర దాగి ఉన్నదన్న అనుమానాలు కలుగుతున్నాయి. కొందరు పెద్దల భూములను క్లియర్ చేయించుకునేందుకు కలెక్టర్ స్థాయిలోనైతే పనులు చకచకా అవుతాయి. అందుకే వాళ్ల సంతకాలతో కలెక్టర్లు పూర్తి చేస్తున్నారేమోనని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తహశీల్దార్ సంతకంతో కలెక్టర్ అప్రూవల్

ధరణి పోర్టల్​ద్వారా స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు కలెక్టర్ ​బయోమెట్రిక్​తో పరిష్కరిస్తే తహశీల్దార్ల సంతకాలే వస్తున్నాయి. ఎవరు ఫైనల్​చేస్తే వారి సంతకంతో కూడిన పత్రాలు, పాసు పుస్తకాలు రావడం కరెక్ట్. కానీ తెలంగాణలో మాత్రం కింది స్థాయి అధికారి డిజిటల్​సంతకం వచ్చేటట్లుగా ధరణి పోర్టల్‌ను రూపొందించారు. దీనినే బ్యూటీ ఆఫ్​ధరణి పోర్టల్​అని తహశీల్దార్లు ఎద్దేవా చేస్తున్నారు. తహశీల్దార్లకు​బయోమెట్రిక్, డిజిటల్​కీ ఇవ్వకపోయినా వారి సంతకం వచ్చేలా చేయడం ధరణి పోర్టల్​లోని అతి పెద్ద పొరపాటుగా చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఇంకేమైనా చేయడానికి ఆస్కారం లేదని ఉన్నతాధికారులేమైనా గ్యారంటీ ఇస్తారా? అని వారు ప్రశ్నిస్తున్నారు.

తిరస్కరించినా కలెక్టర్ ​ఆమోదం

పెండింగ్ మ్యుటేషన్ విషయంలో ఓ తహశీల్దార్​చెక్​లిస్టులో "not recommended as the seller is not the pattadar" రిమార్కుతో పంపారు. కానీ అది అప్రూవ్ అయ్యింది. ఇదే విషయమై కలెక్టరేట్‌లోని ధరణి కోఆర్డినేటర్‌ను ప్రశ్నిస్తే ఓవర్​లుక్ అయ్యిందని సమాధానమిచ్చినట్లు తెలిసింది. అప్రూవల్ పొందిన వ్యక్తి స్లాట్ బుక్ చేసుకుని వచ్చి రిజిస్ట్రేషన్ చేయమన్నాడు. ఇప్పుడు గుర్తించకుండానే రిజిస్ట్రేషన్ చేసేస్తే చేతులు మారే ప్రమాదం ఉన్నది. ఇలాగే కొన్ని జిల్లాల్లో తహశీల్దార్లు రికమండ్ చేసినా కలెక్టర్లు పెండింగులో ఉంచుతున్నారని తెలిసింది.

లేదంటే కొన్ని సర్వే నంబర్లు అప్రూవ్​చేయడం, మరికొన్నింటిని పెండింగు పెట్టడమో చేస్తూ గందరగోళాన్ని సృష్టిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖరీదైన భూములు, రియల్​ఎస్టేట్​ విస్తృతంగా సాగే ప్రాంతాల్లో తహశీల్దార్లు ఆమోదించిన ఫైళ్లు కూడా కలెక్టరేట్​లో పెండింగులో ఉంచుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి ధరణి పోర్టల్​ద్వారా అందిన దరఖాస్తులను పరిష్కరించేందుకు పూర్తి బాధ్యతను కలెక్టర్లదే. వీటి కోసం తహశీల్దార్లు రిపోర్టు ఇవ్వాలని ఎక్కడా లేదు. అయినా ఈ తతంగం కొనసాగుతూనే ఉన్నది.



Next Story

Most Viewed