బ్రేకింగ్: టీడీపీ, బీజేపీ పొత్తుపై MP బండి సంజయ్ క్లారిటీ

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: టీడీపీ, బీజేపీ పొత్తుపై MP బండి సంజయ్ క్లారిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీ పొత్తుకు సిద్ధమైందని వచ్చిన వార్తలు ఊహాగానాలేనని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను చంద్రబాబు కలిస్తే తప్పేముందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కొట్టిపారేశారు. రాష్ట్రాల అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడినే కాదని, గతంలో మమతా బెనర్జీ, స్టాలిన్, నితీష్ కుమార్ వంటి ప్రతిపక్ష నేతలను కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడీ, అమిత్ షా కలిసిన విషయాన్ని గుర్తు చేశారు.

దేశాభివృద్దే బీజేపీ లక్ష్యమన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నేతలతో బండి సంజయ్ ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగావ వారికి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. టీడీపీతో.., బీజేపీ పొత్తుకు సిద్దమైనట్లుగా మీడియాలో వచ్చిన వార్తలను పలువురు నేతలు బండి సంజయ్ వద్ద ప్రస్తావించగా అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు.

అలాంటి వార్తలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. కేసీఆర్ మాదిరిగా ప్రజలను, ప్రతిపక్ష పార్టీలను కలవకుండా ప్రగతి భవన్‌కే పరిమితమై తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టే నైజం బీజేపీది కాదని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబుతో పొత్తు గురించి చర్చించారనడం ఊహాజనితమేనని ఆయన స్పష్టంచేశారు. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందని, పార్టీని దెబ్బతీసేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ సహా మరికొన్ని శక్తులు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, కమ్యూనిస్టు పార్టీలంతా కలిసే పోటీ చేయబోతున్నాయని బండి తెలిపారు.

తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పాలనపై విసిగిపోయారని, బీజేపీవైపు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమని ఆయన హెచ్చరించారు. ఇదిలా ఉండగా ప్రధాని మోడీ తొమ్మిదేండ్ల పాలనపై ఈ నెలాఖరు వరకు నిర్వహిస్తున్న ‘మహజన్ సంపర్క్ అభియాన్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన శ్రేణులను కోరారు. గడపగడపకూ బీజేపీ పేరుతో కేంద్ర ప్రభుత్వ ఫలాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అందుకోసం కార్యక్రమాలను మరింత ఉధృతం చేయాలని దిశానిర్దేశం చేశారు.



Next Story

Most Viewed