ప్రభుత్వ స్థలంలో మొరం వ్యాపారుల దందా..

by Disha Web Desk 4 |
ప్రభుత్వ స్థలంలో మొరం వ్యాపారుల దందా..
X

దిశ, ఆర్మూర్: ఆర్మూర్ మండలం ఫతేపూర్ గ్రామంలో గల గుట్ట నుంచి మొరం వ్యాపారులు మొరం తరలించడాన్ని గురడి రెడ్డి సంఘం సభ్యులు గురువారం అడ్డుకున్నారు. గ్రామంలోని గుట్ట వద్ద నుంచి మొరం వ్యాపారులు ప్రోక్రెయిన్‌లు పెట్టి టిప్పర్లు, డంపర్ల ద్వారా మొరంను తరలిస్తున్నారని పెద్ద సంఖ్యలో తరలివచ్చి అడ్డుకున్నారు. ప్రభుత్వానికి చెందిన స్థలంలో వేలాది టేకు మొక్కలను నరికివేసి మొరంను తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ శాఖ అధికారుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండా టేకు మొక్కలను ఏ విధంగా తొలగిస్తారని వారు ప్రశ్నించారు.

మొరంను తీస్తున్న ప్రోక్లైన్లు, టిప్పర్లను గురడి రెడ్డి సంఘం సభ్యులు గ్రామంలోని చౌరస్తాకు తరలించారు. విషయం తెలుసుకున్న వడ్డెర కులస్తులు గుట్ట వద్దకు మహిళలతో తరలివచ్చి గురడి రెడ్డి సభ్యులతో వాగ్వాదానికి దిగారు. తమకు పట్టాలతో పాటు 40 సంవత్సరాల నుంచి గుట్ట స్థలంలో కబ్జాలో ఉన్నట్టు వారు తెలిపారు. పేదవారమైన తాము రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకొని గుట్ట మొరంను తొలగించి చదును చేస్తున్నట్లు వివరించారు. రెవెన్యూ అధికారులు వే బిల్లులు ఇచ్చారని పేర్కొన్నారు. అక్రమంగా తాము మొర్రాన్ని తీయించడం లేదని, అధికారుల దృష్టికి తెచ్చి చదును చేస్తున్నట్లు తెలిపారు.

అనంతరం గ్రామంలోని గురడి రెడ్డి సంఘంలో పెట్టిన టిప్పర్, ప్రోక్లేయిన్లను ఇవ్వాలని కోరుకుంటూ వడ్డెర కులస్తులు, మహిళలు తరలివచ్చి వాటిని తీసుకెళ్లారు. గుడి రెడ్డి సంఘం సభ్యులు మాట్లాడుతూ గతంలో గుట్ట మొర్రాన్ని తీయవద్దని చేసుకున్న ఒప్పందాన్ని వడ్డెర కులస్తులు ఉల్లంఘించారని చెప్పారు. గుట్టపై ఉన్న పచ్చటి టేకు మొక్కల్ని తొలగించి పర్యావరణానికి హాని చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుట్ట మొర్రం తరలించే విషయంలో ఇరు కులస్తులకు వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.



Next Story

Most Viewed