టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌పై వ్యక్తిగతంగా.. రాజకీయ పాలసీతో మాట్లాడొద్దు : ఎమ్మెల్సీ పల్లా

by Disha Web Desk 13 |
టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌పై వ్యక్తిగతంగా.. రాజకీయ పాలసీతో మాట్లాడొద్దు : ఎమ్మెల్సీ పల్లా
X

దిశ, తెలంగాణ బ్యూరో: పేపర్ లీకేజీపై టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిపై వ్యక్తిగతంగా, రాజకీయ పాలసీతో మాట్లాడొద్దని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి హితవు పలికారు. పేపర్ లీక్ ఘటనపై సూచించారు. సోమవారం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చదువు రాని ప్రతిపక్ష నేతలు ఏదేదో మాట్లాడుతున్నారు.. చదువుకున్న బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్ వారి లాగే మాట్లాడటం దురదృష్టకరం అన్నారు. ప్రవీణ్ కుమార్ గురుకులాల కార్యదర్శిగా ఉన్నపుడు మా ప్రజాప్రత్రినిధులు గానీ, ఎమ్మెల్యేలు గానీ, సీఎం గానీ ఉద్యోగాల కోసం రికమెండ్ చేశారా..? చెప్పాలని డిమాండ్ చేశారు.

ఏవైనా సలహాలుంటే ఇవ్వాలి.. బురద జల్లొద్దని సూచించారు. సిట్ పై నమ్మకం లేదని ప్రతిపక్షాలు మాట్లాడడంలో అర్థం లేదన్నారు. సిటీపై, రాష్ట్ర పోలీసు వ్యవస్థ పై నమ్మకం ఉందని.. కేంద్ర సంస్థలు సైతం తెలంగాణ పోలీసులను కేసుల విచారణ సమయంలో సాయం తీసుకుంటున్నారన్నారు. సిట్ విచారణను కించపరిచేలా ఎవరూ మాట్లాడినా సరికాదని, ఈ విచారణతో నిజాలు బయటకు వస్తాయన్నారు.

గత మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో పంట నష్ట పోవడం దురదృష్టకరం అన్నారు. 80 వేల మంది రైతులకు సంబంధించి లక్షన్నర ఎకరాల్లో పంట నష్టం జరిగిందని జిల్లా కలెక్టర్లు ఆదివారం వరకు ప్రాథమిక నివేదికలు ఇచ్చారన్నారు. రాష్ట్రంలో 2603 వ్యవసాయ క్లస్టర్లు రాష్ట్రంలో ఉన్నాయని, క్లస్టర్ల వారీగా నివేదికలు రూపొందిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా పంట నష్టంను పరిశీలించేందుకు బృందాలు పంపాలని.. గతంలో 7 వేల కోట్ల రూపాయల పంట నష్టం జరిగితే రూ.250 కోట్లు సాయం చేసి కేంద్రం చేతులు దులుపుకుందని ఆరోపించారు. కేంద్రానికి తెలంగాణ ప్రజలంటే కోపమని, అందుకే సరిగా స్పందించడం లేదని మండిపడ్డారు.

తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు అండగా ఉన్నందునే బీజేపీ ప్రభుత్వం కక్ష గట్టిందని ఆరోపించారు. కేంద్ర ఫసల్ బీమా పథకంలోప భూయిష్టంగా ఉందని.. అది బీమా కంపెనీలకు ఉపయోగపడేలా ఉంది తప్ప రైతులకు ఉపయోగంగా లేదన్నారు. తక్షణమే కేంద్రం కొత్త పథకం తేవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు నిరుద్యోగులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణలో ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా జరుగుతున్నాయన్నారు. ఇద్దరు వ్యక్తులతో టీఎస్పీఎస్సీ పేపర్లు లీక్ అయ్యాయని, మొత్తం వ్యవస్థనే అవమాన పరిచేలా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. నిరుద్యోగులు మనో స్థైర్యాన్ని కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు.

ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ.. పేపర్ లీకేజీ ఘటనపై ప్రతిపక్షాల తీరు సరిగా లేదని మండిపడ్డారు. బండి సంజయ్ కేటీఆర్ కు వస్తున్న జాతీయ అంతర్జాతీయ గుర్తింపును ఓర్చుకోలేక పిచ్చి విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బండి సంజయ్ ఓ రాజకీయ అజ్ఞానిలా మాట్లాడుతున్నారని, బీజేపీ స్వార్థ రాజకీయాల కోసమే కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. సిరిసిల్లలో నవీన్ మృతి పై అబద్దాలు ప్రచారం చేసిన బీజేపీ నేత వివేక్ వెంకట స్వామి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు దుష్ప్రచారం మానక పోతే లీగల్ నోటీసులు ఇస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మెల్యే లు గండ్ర వెంకట రమణ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు.


Next Story

Most Viewed