కాంగ్రెస్‌కు ఇద్దరు ఎంపీలు గుడ్‌బై.. స్పందించిన MLA జగ్గారెడ్డి

by Disha Web Desk 2 |
కాంగ్రెస్‌కు ఇద్దరు ఎంపీలు గుడ్‌బై.. స్పందించిన MLA జగ్గారెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించేసరికి ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్‌ను వీడుతారని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రియాక్ట్ అయ్యారు. ఇద్దరు ఎంపీలు పార్టీ మారతారని కేటీఆర్ చెప్పడం దుర్మార్గమని ఫైర్ అయ్యారు. తమ పార్టీలో ఉన్నదే ముగ్గురు ఎంపీలని అందులో ఒక ఎంపీ పీసీసీ అయితే మరొకరు మాజీ పీసీసీ అన్నారు. మరో ఎంపీ పీసీసీ కావాలని అనుకుంటున్నారని అలాంటప్పుడు ఎవరు పార్టీ మారతారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ పుట్టుకతోనే కింగ్ అని కేటీఆర్ మిడిల్ ఏజ్ కింగ్ అని ఎద్దేవా చేశారు. నిజానికి కేటీఆర్ మాటలకు విలువ పెంచిందే కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకపోతే కేటీఆర్‌కు ఈ హోదాలు ఎక్కడివని ప్రశ్నించారు. కాగా, శుక్రవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన కేటీఆర్ పలు అంశాలపై స్పందించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వదిలేసి కాంగ్రెస్ జోడో యాత్ర చేపట్టాలని సూచించారు.

యాత్ర తెలంగాణలోకి చేరే సరికి ఆ పార్టీకి రాష్ట్రంలో ఉన్న ఒకరిద్దరు ఎంపీలు పార్టీ మారుతారని, అయితే పార్టీ మారబోయేది ఎవరనేది తాను చెప్పబోనని అన్నారు. అది తనకున్న సమాచారం అని చెప్పారు. ఈ వ్యాఖ్యలు టీ-కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సోదరుడు మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడిన నాటి నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే తాను తన పార్లమెంట్ నియోజకవర్గం వరకే పరిమితంగా పర్యటనలు కొనసాగిస్తున్నా పార్టీని వీడబోయేది లేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టిస్తోంది. కేటీఆర్ మాటలను బట్టి పదవిలో ఉన్న ఎంపీలే పార్టీ మారుతారా? లేక మాజీ నేతలు, ఇతర ప్రముఖులు పార్టీ మారే యోచనలో ఉన్నారా? అనేది సస్పెన్స్‌గా మారింది. ఇటీవల టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు తిరిగి గులాబీ గూటికి చేరారు. ఈ ఆపరేషన్ ఘర్ వాపస్ సీక్రెట్‌గా జరిగిపోయింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలోని ఇతర నేతలు ఎవరైనా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారా అందులో భాగంగానే కేటీఆర్ వ్యాఖ్యలు చేసి ఉంటారా అనేది ఉత్కంఠ రేపుతున్నాయి.



Next Story

Most Viewed