తెలంగాణలో ఆ రెండు పార్టీల పొత్తు కన్ఫామ్: ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
తెలంగాణలో ఆ రెండు పార్టీల పొత్తు కన్ఫామ్: ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ నుంచి రూ.25 కోట్లు ముట్టాయని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. తాను చెప్పింది అబద్ధమని గుండెలపై చేయి వేసుకుని చెప్పమనండని ఈటల వ్యాఖ్యానించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు.

మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ డబ్బులు పంపించిందనేది వందకు వంద శాతం సత్యమని ఆయన పేర్కొన్నారు. దానికి లెక్క పత్రాలుంటాయా? అని ఎవిడెన్స్ చూపించగలమా అంటూ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఏమైనా చిన్న ఇబ్బంది కలిగినా మొదటగా స్పందించేది సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆరేనని ఈటల చురకలంటించారు.

ఎన్నికల ముందో, తర్వాతో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడం కన్ఫామని జోస్యం చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాణేనికి బొమ్మ, బొడుసులని ఈటల విమర్శలు గుప్పించారు. తానెవరినీ కించపరిచేందుకు ఈ ఆరోపణలు చేయడంలేదని స్పష్టంచేశారు. మునుగోడు, హుజూరాబాద్ ఎన్నికల్లో డబ్బుల పంపిణీ పరాకాష్టకు చేరిందని ఆయన ధ్వజమెత్తారు.

తమకు డబ్బులిస్తే కానీ ఓటు వేసేదిలేదని బహిరంగంగా ప్రజలు అడిగే దుస్థితికి తీసుకొచ్చారని ఈటల మండిపడ్డారు. ఇది మునుగోడు, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నిరూపితమైందని ఆయన తెలిపారు. ఈ బైపోల్‌లో వందల కోట్లు ఖర్చు పెట్టినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఈటల ఆగ్రహం వ్యక్తంచేశారు.



Next Story

Most Viewed