రేవంత్ రెడ్డి ఏడవడానికి అసలు కారణం అదే: ఈటల సెటైర్లు

by Disha Web Desk 19 |
రేవంత్ రెడ్డి ఏడవడానికి అసలు కారణం అదే: ఈటల సెటైర్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కన్నీళ్లలో కూడా సంస్కారహీనంగా మాట్లాడారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఘాటు విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మునుగోడు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ.. కాంగ్రెస్‌కు రూ.25 కోట్లు అందించిందనే తాను చెప్పానని, అందులో ఎక్కడా రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించలేదన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పార్లమెంట్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ చెట్టాపట్టాలేసుకుని స్ట్రైక్ చేశాయన్నారు. రేవంత్ రెడ్డి సమస్యలపై కొట్లాడుతాడనుకున్నానని, కానీ ఏడుస్తాడనుకోలేదని ఈటల ఎద్దేవా చేశారు. ధీరుడు ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకోడని చురకలంటించారు. కన్నీళ్ళ కల్చర్ మంచిది కాదన్నారు.

రేవంత్ రెడ్డి.. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లారు తప్పా ప్రజల కోసం కాదని పేర్కొన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమం సమయంలో చంద్రబాబు పక్కన ఉండి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని వ్యతిరేకించారని విమర్శలు గుప్పించారు. తాను ఒక్క కాంట్రాక్టర్‌ను బెదిరించానని తేలినా ముక్కు నేలకు రాస్తానని ఈటల పేర్కొన్నారు. ఇన్నేండ్లలో తాను ఒక్క ఆర్టీఐ కూడా వేయలేదని, అదే రేవంత్ రెడ్డి ఆర్టీఐలు వేసి చేసిన బాగోతం అందరికీ తెలుసని ఆయన ఆరోపించారు. రేవంత్ పిచ్చి మాటలను తెలంగాణ సమాజం గమనిస్తోందని, తనకు తనపై పూర్తి విశ్వాసం ఉందని ఈటల స్పష్టంచేశారు. తనది ఒట్లు వేసే కల్చర్ కాదని రేవంత్‌కు చురకలంటించారు.

కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టించింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని, ఆయనతో కాంగ్రెస్ జతకట్టబోతోందని ఆయన విమర్శలు గుప్పించారు. రేవంత్ ఢిల్లీ లిక్కర్ స్కాంపై ఎందుకు మాట్లాడలేదో సమాధానం చెప్పాలన్నారు. రాత్రి పూట ఫోన్లు చేసి తిట్టించే చిల్లర సంస్కృతి మంచిది కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ తనను తిరగనివ్వకుండా అడ్డుకుంటామంటున్నాడని, అలా చేస్తే తామెలా ఉరుకుంటామని, ఆయనెలా తిరుగుతాడో చూస్తానని హెచ్చరించారు.

చార్మినార్ భాగ్యక్ష్మి అమ్మవారి వద్దకు వెళ్తున్న రేవంత్‌ను పోలీసులు అడ్డుకోకపోవడం వెనుకున్న మతలబటేంటని ఆయన ప్రశ్నించారు. తమ పోరాటం సీఎం కేసీఆర్‌తోనేనని రాజేందర్ స్పష్టంచేశారు. మునుగోడులో కాంగ్రెస్‌కు ఓట్లు రాకుంటే రాజగోపాల్ రెడ్డి గెలిచేవారని తెలిపారు. రాజగోపాల్‌ను ఓడించేందుకే బీఆర్ఎస్.. కాంగ్రెస్‌కు సపోర్ట్ చేసిందన్నారు. సీనియర్ల సపోర్ట్ లేదనేది రేవంత్ ఏడుపునకు కారణమని అంతేతప్పా.. తాను చేసిన వ్యాఖ్యలు ఇందుకు కారణం కాదని రాజేందర్ తెలిపారు.

కాంగ్రెస్‌లో కోవర్టులున్నారని చెప్పిన రేవంత్ వారి పేర్లను ఎందుకు బయటపెట్టడంలేదని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఒక మెంటల్ అని ఈటల ఘాటు విమర్శలు చేశారు. 2018లో కేసీఆర్ తన సొంత పార్టీకి చెందిన 12 మందిని ఓడగొట్టాలని ప్రయత్నంచేశారని ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు పెద్దపల్లి, రామగుండం, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు ఓడించేందుకు డబ్బులు పంపించారన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఒక పోలింగ్ ఆఫీసరర్ రూ.2 కోట్లు పట్టుకెళ్లారని వ్యాఖ్యానించారు. ఇక ఎంఐఎం, సీపీఐ, సీపీఎం పార్టీలు బీఆర్ఎస్ తోనే ఉన్నాయని ఈటల పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టంచేశారు.



Next Story

Most Viewed