యాదాద్రిలో మంత్రుల పర్యటన.. వాళ్లు తెల్లవారుజామునే అరెస్ట్!

by Disha Web Desk 2 |
యాదాద్రిలో మంత్రుల పర్యటన.. వాళ్లు తెల్లవారుజామునే అరెస్ట్!
X

దిశ, భువనగిరి రూరల్/యాదాద్రి కలెక్టరేట్: రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి పలు కార్యక్రమాల్లో భాగంగా యాదాద్రి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పోలీసులు ఆర్ఆర్ఆర్ బాధితులను, కాంగ్రెస్ టీపీసీసీ సభ్యులు తంగళ్లపల్లి రవికుమార్ ముందస్తు అరెస్ట్ చేశారు. దీనిపై యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకవైపు తమ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుందని చెబుతూనే మరోవైపు యాదాద్రి జిల్లా రాయగిరి గ్రామంలో ఆర్ఆర్ఆర్ పేరుతో పేదల వ్యవసాయ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు ప్రకటించిన గెజిట్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్, అధికార పార్టీకి చెందిన బడా నాయకుల భూములు కోల్పోయే అవకాశం ఉండటంతో రాయగిరి నుంచి అలైన్మెంట్ ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాయగిరి ప్రజలు మంత్రులను అడ్డుకుంటామని ఎటువంటి ప్రకటన చేయలేదని, అయినా పోలీసులు అన్యాయంగా ఆర్ఆర్ఆర్ బాధితులను మంత్రుల పర్యటన నేపథ్యంలో తెల్లవారుజామున ముందస్తు అరెస్టులు చేయడం అన్యాయమని అన్నారు. ప్రజల దగ్గరకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకోవాల్సిన మంత్రులు బాధితుల బాధలు వినకుండా ముందస్తు అరెస్టులు చేయడం సరైన వైఖరి కాదన్నారు. స్థానికంగా ఉన్న ఎమ్యెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి సైతం ఈ విషయంపై ఇప్పటి వరకు నోరు మెదపలేదని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలు గమనిస్తున్నారని రాబోయే కాలంలో తగిన బుద్ధి చెబుతారని అన్నారు. అరెస్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ బాధితులను బేషరతుగా విడుదల చేయాలని లేకపోతే భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.


Next Story