మంత్రి మల్లారెడ్డి అనాధికార పీఏ అత్యుత్సాహం.. అర్హత లేకున్నా సీఎస్ సమీక్షకు హాజరు

by Disha Web Desk 11 |
మంత్రి మల్లారెడ్డి అనాధికార పీఏ అత్యుత్సాహం.. అర్హత లేకున్నా సీఎస్ సమీక్షకు హాజరు
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ తో పాటు జిల్లా అధికారులతో కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అనాధికారిక పీఏ మందపాక సాయికుమార్ అర్హత లేకున్నా పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమైన సమావేశాలలో కొన్ని ఆప్ ద రికార్డుగా చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని, ఇలాంటి సమావేశాల్లో మంత్రి అనాధికారిక పీఏ పాల్గొనడం ఏమిటనీ పలువురు జిల్లా అధికారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను వైభవంగా నిర్వహిస్తాం: కలెక్టర్ అమోయ్ కుమార్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మేడ్చల్ జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు. దశాబ్ది ఉత్సవాలపై సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లతో వీడియో ద్వారా సమీక్షించగా, మేడ్చల్ జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో సమావేశమైన కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ.. జూన్ 2వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించే ఉత్సవాలలో రాష్ట్ర ప్రగతి కనిపించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామాలలో చేపట్టే పెద్ద కార్యక్రమాలైన రైతు దినోత్సవం, ఊరూరా చెరువులు పండుగలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి సాధించిన ప్రగతిపై నియోజకవర్గం, మండల, గ్రామాల వారీగా నాడు-నేడు అభివృద్ధిపై అద్దంపట్టేలా ప్లెక్సీలు ఏర్పాటు చేయాలని, పలు శాఖలు సాధించిన విజయాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేయాలని కోరారు.

జిల్లాలోని ప్రధాన కార్యాలయాలు, దేవాలయాలు, చర్చీలు, ప్రార్థన మందిరాలను 21 రోజుల పాటు పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించాలని ఆదేశించారు. మున్సిపాలిటీలు, జిల్లా ప్రవేశం, ముగింపు ప్రాంతాలు, జంక్షన్లలో ఆర్చీలు, ప్లెక్సీలు, హోర్డింగ్ లు ఏర్పాటు చేయాలన్నారు. దశాబ్ది ఉత్సవాలపై డాక్యుమెంటేషన్ తోపాటు వీడియో చిత్రీకరణ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య, డీసీపీ సందీప్, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యా నాయక్, జిల్లా పరిషత్ సీఈవో దేవసహాయం, సీపీవో మోహన్ రావు , డీఆర్డీవో పద్మజా రాణీ, జిల్లావైద్య అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి రమణ మూర్తి, వ్యవసాయ శాఖ అధికారి మేరీరేఖ, డీసీవో శ్రీనివాస్, జిల్లా అటవీ శాఖ అధికారి జానకీరామ్, జిల్లా ఉద్యానవన శాఖ నీరజ గాంధీ, ఆర్డీవోలు మల్లయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed