నేడు ఐటీ ముందుకు మల్లారెడ్డి ఫ్యామిలీ.. విద్యా సంస్థల డైరెక్టర్లు, స్టాఫ్ కూడా!!

by Disha Web Desk 2 |
నేడు ఐటీ ముందుకు మల్లారెడ్డి ఫ్యామిలీ.. విద్యా సంస్థల డైరెక్టర్లు, స్టాఫ్ కూడా!!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర మంత్రి మల్లారెడ్డికి, కుటుంబానికి చెందిన విద్యా సంస్థలు, వ్యాపార కంపెనీలపై రెండున్నర రోజుల పాటు ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేసిన అనంతరం సోమవారం కొద్దిమందిని ప్రశ్నించారు. మొత్తం 16 మందికి నోటీసులు జారీచేయగా తొలి రోజున 12 మంది విచారణకు హాజరయ్యారు. మరికొద్దిమంది మంగళవారం హాజరుకానున్నారు. మంత్రి మల్లారెడ్డి మాత్రం గైర్హాజరై తన తరఫున ఆడిటర్‌ను పంపిస్తున్నట్లు ఐటీ అధికారులకు తెలిపారు. మంత్రి కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి, మరికొద్దిమంది బంధువులు, కుటుంబ సభ్యులు విచారణకు హాజరయ్యారు. విచారణకు పూర్తిగా సహకరిస్తామని అల్లుడు, కుమారుడు మీడియాకు వివరించారు.

ఐటీ సోదాల్లో స్వాధీనం చేసుకున్న నగదు, విలువైన డాక్యుమెంట్లు, బ్యాంకు ఖాతాల్లోని ఆర్థిక లావాదేవీల అనంతరం వాటికి సంబంధించిన అంశాలపై ప్రశ్నించడానికి అధికారులు నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రకారం మొత్తం 16 మందిలో పన్నెండు మంది సోమవారం నగరంలోని ఆయకర్ భవన్‌లో విచారణకు హాజరయ్యారు. మర్రి లక్ష్మారెడ్డికి చెందిన కాలేజీ చైర్మన్ లక్ష్మారెడ్డితో పాటు మల్లారెడ్డికి చెందిన విద్యా సంస్థల తరఫున శివకుమార్ రెడ్డి, త్రిశూల్ రెడ్డి, నరసింహారెడ్డి, మెడికల్ కళాశాల డైరెక్టర్ రామస్వామిరెడ్డి తదితరులతో పాటు కాలేజీ ప్రిన్సిపాల్ మాధవి, అకౌంటెంట్, మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్, మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ గ్రూపునకు చెందిన మరో ఇద్దరు అకౌంటెంట్లు ఈ విచారణకు హాజరయ్యారు.

సుమారు ఆరు గంటల పాటు వీరిని ఐటీ అధికారులు విచారించారు. బ్యాంకు ఖాతాల్లోని ఆర్థిక లావాదేవీలతో పాటు సోదాల సందర్భంగా దొరికిన నగదుకు సంబంధించిన వివరాలను రాబట్టినట్లు సమాచారం. మంత్రి మల్లారెడ్డికి, బంధువులకు చెందిన వివిధ విద్యా సంస్థలకు సంబంధించిన ఆర్థిక అంశాలపై, విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజుల్లోని అవకతవకలపై గుమాస్తా స్థాయి నుంచి అకౌంటెంట్, డైరెక్టర్ల వరకు విచారణ సందర్భంగా అధికారులు లోతుగా ప్రశ్నించారు. ఈ వివరాలను రాబట్టడం కోసమే నోటీసులు ఇవ్వాల్సి వచ్చిందన్నది ఐటీ అధికారుల వాదన.

విచారణ అనంతరం బైటకు వచ్చిన మంత్రి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పామని, వారి సందేహాలను నివృత్తి చేశామని, వారు సంతృప్తి చెందారనే అభిప్రాయమే తమకు కలిగిందని వివరించారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని చెప్పారే తప్ప మంగళవారం హాజరు కావాల్సిందిగా నిర్దిష్టంగా తననేనీ కోరలేదన్నారు. తన ఇంట్లో దొరికిన నగదుకు సంబంధించి ఏమీ ప్రశ్నించలేదని, కానీ సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న ఆస్తి పత్రాలపై విచారించారని తెలిపారు. ఇంజినీరింగ్ కళాశాలలో సీట్ల కేటాయింపులపై ప్రశ్నించారని తెలిపారు.

మంత్రి కుమారుడు భద్రారెడ్డి మాట్లాడుతూ, ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పానన్నారు. తనతో పాటు కళాశాలల ప్రిన్సిపాళ్ళు, సిబ్బందిని కూడా విచారించారని తెలిపారు. తన నుంచి ఐటీ ఆఫీసర్లు స్టేట్‌మెంట్ తీసుకున్నారని, కళాశాలల సిబ్బంది నుంచి కూడా మెంట్లు రికార్డు చేశారని తెలిపారు. అవసరమని భావిస్తే మరోసారి విచారణకు పిలుస్తామని తెలిపారన్నారు. అధికారులు అడిగిన ఫార్మాట్లోనే అన్ని వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తాము చెప్పిన సమాధానాలతో అధికారులు సంతృప్తి చెందారనే భావిస్తున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు.

మర్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన తననేమీ అడగలేదన్నారు. విద్యా సంస్థలకు తాను ఛైర్మన్‌గా మాత్రమే ఉన్నానని, డబ్బుల వ్యవహారంతో తనకు సంబంధం లేదని అధికారులకు వివరించానని, అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలతో పాటు విద్యార్థుల ఫిట్‌నెస్, స్పోర్ట్స్ లాంటి అంశాలకే పరిమితమైనట్లు వివరించానన్నారు. మరోసారి విచారణకు హాజరు కావాలని కూడా తనను ఆదేశించలేదన్నారు. మంత్రికి బంధువులుగా, సన్నిహితులుగా ఉన్నవారిని కూడా ఐటీ అధికారులు ప్రశ్నించారు. నరసింహారెడ్డి, త్రిశూల్‌రెడ్డిలు కూడా నోటీసులకు అనుగుణంగా విచారణకు హాజరయ్యామని, వారు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చామని, ఈ నెల 30న మరోసారి రావాల్సిందిగా కోరారని, తప్పకుండా హాజరవుతామన్నారు.

మంత్రి మల్లారెడ్డి సోదరుడు గోపాల్‌రెడ్డిని సైతం ఐటీ అధికారులు ప్రశ్నించారు. మరికొద్దిమందిని కూడా ప్రశ్నించాలని భావిస్తున్న ఐటీ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. వచ్చే నెల 5వ తేదీ వరకు ఈ విచారణ కొనసాగుతుందని ఐటీ అధికారుల సమాచారం.

ఇవి కూడా చదవండి : కేటీఆర్‌కు భారీ షాక్... సిరిసిల్లలో...

Next Story

Most Viewed