భూ సమస్యలకు దశల వారీగా నివేదికలు.. ధరణి కమిటీ తొలి భేటీలో నిర్ణయం

by Disha Web Desk 2 |
భూ సమస్యలకు దశల వారీగా నివేదికలు.. ధరణి కమిటీ తొలి భేటీలో నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పేరుకుపోయిన భూ సమస్యల పరిష్కారానికి గంపగుత్త నిర్ణయాలను తీసుకునే అవకాశం లేదు. అందుకే దశల వారీగా నివేదికలు సమర్పించాలని ధరణి సమస్యల పరిష్కారానికి నియమించిన కమిటీ నిర్ణయించింది. గురువారం సచివాలయంలో సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో సభ్యులు ప్రొ.ఎం.సునీల్ కుమార్, ఎం.కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ రేమండ్ పీటర్, మధుసూదన్ రెడ్డిలు సమావేశమయ్యారు. తొలి సమావేశంలో కమిటీ టైం ఫ్రేమ్, కార్యాచరణ ఖరారు, వచ్చే సమావేశం నాటికి అవసరమైన సమాచారంపైన దృష్టి పెట్టారు. ఈ సందర్భంగా కమిటీ సీసీఎల్ఏ కార్యాలయం వేదికగానే పని చేయాలని నిర్ణయించారు. ధరణి పోర్టల్ రీ కన్ స్ట్రక్షన్ చేసి భూమాతగా మార్చేందుకు ఎవరైనా అవసరమైన సూచనలు ఇచ్చేందుకు, కమిటీని కలిసేందుకు వెసులుబాటుగా ఉంటుంది.

తీవ్రమైన సమస్యల నేపథ్యంలో కమిటీ ఒకేసారి నివేదిక సమర్పించడానికి అవకాశం లేదు. అందుకే ఇప్పటికిప్పుడు చేయాల్సిన పనులేమిటి? పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? అన్న విషయాలపై దృష్టి సారించాలని సభ్యులు చర్చించారు. అవసరమైన మేరకు జిల్లాల పర్యటన ఉంటుంది. కమిటీ కార్యాచరణ, ప్రోగ్రాం షెడ్యూల్ ని సీసీఎల్ఏ తరపున సీఎమ్మార్వో ప్రాజెక్టు డైరెక్టర్ వి.లచ్చిరెడ్డి పర్యవేక్షించనున్నారు. ధరణిలో పోర్టల్ పునర్నిర్మాణానికి కమిటీ ఏం చేయాలి? అవసరమైన సమాచారం ఏమిటి? ఎవరిని కలవాలి? ఎవరి సూచనలు తీసుకోవాలి? కార్యాచరణ ఏమిటి? కాల పరిమితి ఎంత? అనే అంశాలపైనే సభ్యులు చర్చించారు. ఈ క్రమంలోనే కలెక్టర్ల నుంచి ఆయా జిల్లాల నుంచి తగిన సమాచారాన్ని సేకరించాలని నిర్ణయించారు. రైతు ప్రతినిధులు, నిపుణుల నుంచి కూడా సూచనలను స్వీకరించనున్నారు. ఈ నెల 17న రెండో సమావేశం జరగనున్నది.

కమిటీ కార్యాచరణ

– ధరణి సమస్యలపై అధ్యయనం, ల్యాండ్ రికార్డుల నిర్వహణ, ధరణి పోర్టల్ డేటా, బెటర్ పాలసీ కోసం స్టడీ వంటి అంశాలపై కమిటీ పని చేయనున్నది.

– అన్నింటినీ ఒకేసారి కాకుండా దశల వారీగా చేపడుతుంది. తొలుత పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన చర్యలు, ఇప్పటికిప్పుడు రైతులకు అవసరమైన అంశాలేమిటన్న దానిపైనే ఫోకస్ పెట్టనున్నది.

– వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న భూ పరిపాలన విధానంపై స్టడీ. వాటిలో బెస్ట్ పాలసీని తెలంగాణలో అమలు చేయగలిగేటట్లుగా రూపకల్పన. డిజిటల్ విధానంలోనే రైతులకు సత్వర సేవలందించేందుకు అవసరమైన చర్యలు.

– కలెక్టర్ల నుంచి జిల్లాల వారీగా అవసరమైన సమాచార సేకరణ

– త్వరలో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది.

– రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించరు.

– సూచనలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. మెయిల్ ద్వారా పంపేందుకు చర్యలు తీసుకోనున్నారు.

– అత్యధిక సమస్యలు కలిగిన ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తారు.

అనేక సమస్యలు ఉన్నాయి: ఎం.సునీల్ కుమార్

మొదటి సమావేశంలో టైం ఫ్రేమ్ పైనే చర్చించాం. ధరణిలో అనే సమస్యలు ఉన్నాయి. వాటిపై అధ్యయనం చేసి పరిష్కార మార్గాలను వెతకడానికే కమిటీ వేసింది. విధి విధానాలను రూపొందించి ప్రజలకు భరోసా కల్పిస్తాం. ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి వేగంగా సలహాలు ఇస్తాం. సీసీఎల్ఏ కార్యాలయం వేదికగా కమిటీ పని చేస్తుంది. రైతులు వారి సమస్యలకు సంబంధించి మాకు ఫిర్యాదులు ఇవ్వొద్దు. వాటిని స్వీకరించి మేం ఏం చేయలేం. కేవలం మెరుగైన సేవలందించేందుకు అవసరమైన సూచనలు ఇస్తే స్వీకరిస్తాం. దశల వారీగా నివేదికలు అందజేస్తాం. ఇప్పటికిప్పుడు రైతులకు ఏం కావాలన్న అంశాలకే తొలి ప్రాధాన్యం ఇస్తాం. అందరితోనూ చర్చించి రిపోర్టులు సమర్పిస్తాం. వారం రోజుల్లో కమిటీ మళ్ళీ సమావేశం అవుతుంది.

ధరణితో ఎంతో ఇబ్బంది: ఎం.కోదండరెడ్డి

రాష్ట్ర ప్రజలు, రైతాంగం ధరణి పోర్టల్ ద్వారా చాలా ఇబ్బంది పడ్డారు. ఆన్లైన్ లో చాలా భూములు ఎక్కలేదు. ప్రభుత్వ సాయం అందలేదు. సన్నకారు చిన్నకారు రైతులు గుంట భూమి అమ్మడానికి ఇబ్బంది పడ్డారు. లక్షలాది మంది రైతుల కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి. ధరణి మీద అధ్యయనం కూడా చేసినం. ధరణిలో మార్పులు చేర్పులు చేస్తామని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. వేగంగా సమస్యల పరిష్కారం కోసం కమిటీ వేశారు. గతంలో చోటు చేసుకున్న తప్పులు పునరావృతం కాకుండా అడుగులు వేస్తాం.

Next Story