దేశానికి దిక్సూచిగా టీఎస్‌ బీ పాస్‌: మంత్రి మల్లారెడ్డి

by Kalyani |
దేశానికి దిక్సూచిగా టీఎస్‌ బీ పాస్‌: మంత్రి మల్లారెడ్డి
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: జాప్యానికి చోటు ఉండదు.. అవినీతి, ఆలస్యం అనే మాటే వినపడదు.. భవన నిర్మాణ.. లే అవుట్‌ అనుమతుల్లో సరళీకృత, ఏకీకృత విధానమైన టీఎస్‌ బీ పాస్‌ దేశానికి దిక్సూచిగా నిలుస్తోందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లాలోని ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులతో టీఎస్ బీ పాసు పై అవగాహన, సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. టీఎస్‌ బీ పాస్‌ ఈ నూతన విధానం ద్వారా నిర్దేశించిన గడువులోగా ఆన్‌లైన్‌లో ఇండ్ల అనుమతులు పొందవచ్చని పేర్కొన్నారు. టీఎస్ బీ పాస్ వల్ల గ్రామీణ ప్రాంతాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభతరంగా ఉన్న చోట నుంచే ఆన్ లైన్ లో నమోదు చేసుకోవడంతో ఎంతో సౌలభ్యం కలిగిందని చెప్పారు.

గ్రామాల్లో ఇంటి నిర్మాణాలు చేపట్టాలంటే జిల్లా, మండల కేంద్రాలకు వచ్చి సంబంధిత ఇంజనీర్లతో ప్లాన్ తీసుకొని వాటిని తీసుకెళ్ళి గ్రామపంచాయతీలో నమోదు చేసుకొనేందుకు చాలా సమయం పట్టేదని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఇబ్బందులను తీర్చడానికి గ్రామీణ ప్రాంతాలలో సైతం మంచి ఇళ్ళు నిర్మించుకోవాలనే సదుద్దేశంతో టీఎస్–బీపాస్ ద్వారా ఆన్ లైన్ లోనే సంబంధిత వివరాలను నమోదు చేయడంతో పాటు అప్పటికప్పుడు ఎంత రుసుము చెల్లించాలో ఆ చెల్లింపులు కూడా ఎలాంటి మధ్యవర్తి జోక్యం లేకుండా ఇంటి యాజమాని నేరుగా చెల్లించేందుకు అవకాశం కల్పించిందని, ఇది ఎంతో మంచి పరిణామమని మంత్రి వివరించారు.

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 61 గ్రామపంచాయతీలు ఉండగా ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో నెంబర్) 131,- 135 వల్ల పంచాయతీలకు ఆదాయం సమకూరుతుందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో గ్రామాలు అభివృద్ధి విషయంలో పోటీ పడుతున్నాయని ప్రతి గ్రామం ఆర్థికంగా ఉన్న ధనిక గ్రామమని పట్టణాలకు ధీటుగా పల్లెల్లో అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని మరింత అభివృద్ధిపరచి పల్లెల రూపురేఖలు మార్చి అన్ని సౌకర్యాలు సమకూర్చడం జరుగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదలకు ఇళ్ళను ఇవ్వటానికి కృషి చేస్తోందని, దీనికి గాను 60 గజాల స్థలం మొదలుకొని 120 గజాల స్థలాల్లో ఇల్లు కట్టుకొనే వారికి ప్రభుత్వం నుంచి గృహలక్ష్మి పథకం ద్వారా రూ.3 లక్షలు మంజూరు చేస్తుందని చెప్పారు. ఈ విషయంలో ప్రస్తుతం మేడ్చల్ నియోజకవర్గంలో ఇప్పటికే మూడు వేల మందికి అనుమతులు వచ్చాయని అన్నారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్ – బీపాస్ గూర్చి గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేయాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ పర్మిషన్ల వల్ల గ్రామాలలో పన్నులు (ట్యాక్సులు) వస్తాయని తద్వారా ప్రభుత్వానికి గ్రామాలలో ఆదాయం పెరుగుతుందని తెలిపారు. ప్రతి గ్రామంలో సర్పంచులు, సెక్రటరీలు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పారు. అలాగే రెండోవిడత దళితబంధు కోసం గ్రామాలలో కమిటీ వేసి మేడ్చల్ నియోజకవర్గంలో 1,100 మంది లబ్ధిదారులకు దళితబంధు పథకాన్ని అందచేయడం జరుగుతుందని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ వెంకటేష్, జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తి, ఆయా గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed