Minister Malla Reddy: మరో షాక్.. హైకోర్టులో టీఆర్ఎస్ కౌన్సిలర్ రిట్ పిటిషన్..

by Dishanational4 |
Minister Malla Reddy:  మరో షాక్.. హైకోర్టులో టీఆర్ఎస్ కౌన్సిలర్ రిట్ పిటిషన్..
X

దిశ ప్రతినిధి,మేడ్చల్ : మంత్రి మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. మల్లారెడ్డిపై ఐటీ దాడుల వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తన నియోజకవర్గానికి చెందిన సొంత టీఆర్ఎస్ పార్టీకి చెందిన మహిళ కౌన్సిలర్ మంత్రిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోర్టుకెక్కడం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ఐటీ విచారణ.. మరోవైపు ఈడీ రూపంలో పొంచి ఉన్న ప్రమాదంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న మంత్రి మల్లారెడ్డిపై ఘట్ కేసర్ మున్సిపల్ కౌన్సిలర్ బొక్క సంగీత రెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం కలకలం సృష్టిస్తోంది.

బఫర్ జోన్ వివాదం..

మేడ్చల్ జిల్లా, ఘట్ కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 238లో 2000 సంవత్సరంలో గ్రామ పంచాయతీ అనుమతితో పరమేశ్వర్ వెంచర్ పేరిట లే అవుట్ వేశారు. ఈ లే అవుట్‌లో 200 మంది ప్లాట్లు కొనుగోలు చేయగా.. ఇప్పటికే దాదాపు 150 మంది వరకు ఇండ్లను నిర్మించుకున్నారు. ప్రస్తుతం ఈ లే అవుట్ స్థలం పరిధి బపర్ జోన్‌లో ఉన్నందున మున్సిపాలిటీ అనుమతులను నిలిపివేసింది. కాగా, గత జూలైలో ఓ వ్యక్తి అనుమతి లేకుండా ఇంటి నిర్మాణం చేపడుతుండగా.. స్థానిక కౌన్సిలర్ బొక్క సంగీత రెడ్డి భర్త ప్రభాకర్ అడ్డుకున్నారు. అదేవిధంగా బపర్ జోన్‌లో అక్రమ నిర్మాణాన్ని అపించాలని మున్సిపల్ కమీషనర్‌కు కౌన్సిలర్ సంగీత రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో కాలనీవాసులు కౌన్సిలర్ సంగీత రెడ్డితోపాటు ఆమె భర్త ప్రభాకర్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. తాము ఇండ్లను నిర్మించుకుంటే డబ్బులు ఇవ్వాలని ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాడని, లేదంటే మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నాడని వాపోయారు. దీంతో మంత్రి మల్లారెడ్డి సెప్టెంబర్ 27న పరమేశ్వర్ వెంచర్‌ను సందర్శించిన క్రమంలోనే ప్రభాకర్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఎన్నో ఏళ్లుగా ప్రజలు సొంత ఇళ్లను కట్టుకుని నివాసం ఉంటున్నారని, ఒక మీదట ఇండ్లను కట్టుకుంటారని, ఎవరైనా అడ్డుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. ఘటన స్థలం నుంచి మున్సిపల్, నీటి పారుదల, రెవెన్యూ అధికారులకు ఫోన్‌లు చేసి, పరమేశ్వర్ వెంచర్ గురించి ఎవరు ఫిర్యాదు చేసిన పట్టించుకోవద్దని, ఇండ్లను నిర్మించుకున్నా.. అపోద్దని ఆదేశాలు జారీ చేశారు. ప్రభాకర్ రెడ్డి డబ్బులు డిమాండ్ చేస్తే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, పీడీ యాక్టు బుక్ చేయించి, జైలుకు పంపిస్తానని మంత్రి హెచ్చరించారు. అదే విధంగా కౌన్సిలర్ పదవిని కూడా తీయిస్తానని స్పష్టం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘట్ కేసర్ పోలీసులు బొక్క ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.

అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారంటూ..

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను దిక్కరిస్తూ మంత్రి మల్లారెడ్డి బపర్ జోన్‌లో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని, అధికార బలంతో అధికారులను బేధిరిస్తూ.. అక్రమ నిర్మాణ దారులకు మంత్రి అండగా నిలుస్తున్నారని, ఆయనపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఘట్ కేసర్ కౌన్సిలర్ సంగీత రెడ్డి హైకోర్టులో రిట్ వేశారు. బపర్ జోన్‌లో అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని ఆమె కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఒకవైపు చెరువు శిఖం భూములను పరిరక్షించాలని, అక్రమ నిర్మాణాలను నిరోధించాలని చెబుతుంటే.. వారి ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్న మాపై మల్లారెడ్డి జులుం ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. బపర్ జోన్‌లో అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), స్థానిక మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని సంగీత రెడ్డి పేర్కొన్నారు. తన నియోజకవర్గానికి చెందిన మంత్రి మల్లారెడ్డిపై కౌన్సిలర్ హైకోర్టులో రిట్ వేయడం సంచలనంగా మారింది.



Next Story

Most Viewed