25 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు

by Disha Web Desk 23 |
25 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు
X

దిశ, మేడ్చల్ బ్యూరో : ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్, పదో తరగతి వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 25వ తేదీ గురువారం నుంచి ప్రారంభం కానున్న..పరీక్షలు మే 2వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ పరీక్షల నిర్వహణ కోసం మేడ్చల్ జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు విద్యాశాఖ అధికారి విజయకుమారి తెలిపారు. హాల్ టికెట్లను అధ్యయన కేంద్రాల నుంచి లేదా www.telanganopensckool.org వెబ్ సైట్ ద్వారా పొందవచ్చని తెలిపారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు మే 3 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

3805 మంది విద్యార్థులు, 15 కేంద్రాలు..

మేడ్చల్ జిల్లాలో 3805 మంది విద్యార్థుల పరీక్షలు రాయనున్నారు. వారిలో టెన్త్ పరీక్షల కోసం 1610 మంది, ఇంటర్ పరీక్షలు కోసం 2195 మంది హాజరు కానున్నారు.ఏప్రిల్ 25 వ తేదీ నుంచి మే 2వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించగా వీటికోసం జిల్లాలో 15 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.పరీక్షల తేదీల షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్ లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇకపోతే మే 3 నుంచి 10 వరకు ఇంటర్ జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణ కోసం 200 మంది ఇన్విజిలేటర్లకు శిక్షణ పూర్తి చేశారు. అన్ని పరీక్షల కేంద్రాల వద్ద సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. 15 కేంద్రాల కోసం 3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దించనున్నారు.

ఇలా హాజరు కావాలి..

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్, పరీక్ష ప్యాడ్, పెన్, పెన్సిల్ మాత్రమే తీసుకొని రావాలి. ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు. పరీక్షల కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలని అధికారులు సూచించారు. నిర్ణీత సమయం తర్వాత 5 నిమిషాల వరకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు.



Next Story

Most Viewed