తెలంగాణ పాలిటిక్స్‌లో ‘గాడిద గుడ్డు’ రచ్చ

by Disha Web Desk 4 |
తెలంగాణ పాలిటిక్స్‌లో ‘గాడిద గుడ్డు’ రచ్చ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల ప్రచారంలో ‘గాడిద గుడ్డు’ సెంటర్ పాయింట్‌గా మారింది. దీని చుట్టూనే కాంగ్రెస్, బీజేపీ లీడర్ల ప్రసంగాలు, ప్రకటనలు, సవాళ్ల పర్వం నడుస్తోంది. కాంగ్రెస్ వెరైటీగా గాడిద గుడ్డు నమూనాలను తన ఎన్నికల ప్రచారంలో ప్రదర్శిస్తున్నది. పదేళ్ల మోడీ పాలనలో రాష్ట్రానికి జరిగిన ప్రయోజనం గాడిద గుడ్డు అంటూ సెటైర్లు విసురుతున్నది. దీన్ని తిప్పికొట్టడానికి బీజేపీ లీడర్లు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అసలు గాడిద గుడ్డు పెడుతుందా? కాంగ్రెస్ లీడర్లకు ఆ విషయం తెలియదా? 6 గ్యారంటీలను అమలు చేసే శక్తిలేకనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.

వెరైటీ ప్రచారంలో కాంగ్రెస్ సక్సెస్..

ఊహాజనితమైన గాడిద గుడ్డు నమూనాలను కాంగ్రెస్ తన ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ప్రదర్శిస్తున్నది. సభలు, ర్యాలీల్లో బ్యానర్లు ఏర్పాటు చేసి, బీజేపీని ఎటాక్ చేస్తున్నది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ పాలనలో రాష్ట్రానికి జరిగిన ప్రయోజనం గాడిద గుడ్డుతో సమానం అని సెటైర్లు వేసి, ఆ నమూనాను ప్రజలకు చూపిస్తున్నారు. దీనితో గాడిద గుడ్డు సెంటర్ పాయింట్‌గా మారింది.

6 గ్యారెంటీల అమలు ఎప్పుడు?

కాంగ్రెస్ లీడర్ల విమర్శలను తిప్పికొట్టేందుకు బీజేపీ లీడర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నిజామాబాద్ అభ్యర్థి అరవింద్ మాట్లాడుతూ ‘సీఎం హోదాలో ఉన్న వ్యక్తికి నైతిక విషయాలు తెలియవా? హుందాగా మాట్లాడం రాదా? అసలు గాడిదలు గుడ్లు పెడుతాయా’ అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు పూర్తయింది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఆ విషయాన్ని పక్కన పెట్టిందని బీజేపీ ఆరోపిస్తున్నది. అందుకే ప్రజలను దృష్టిని మరల్చేందుకు గాడిద గుడ్డు అనే అంశాన్ని తెరమీదికి తెచ్చిందని చేవేళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు.

Next Story

Most Viewed