మంత్రి మల్లారెడ్డికి ఎదురుగాలి.. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదా..?

by Disha Web Desk 12 |
మంత్రి మల్లారెడ్డికి ఎదురుగాలి.. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదా..?
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : వేదిక ఏదైనా కానీ.. కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తన మార్కు మాస్ కామెడీతో అందరినీ నవ్విస్తుంటారు. పంచ్ డైలాగులు విసురుతూ ఆకట్టుకుంటుంటారు. తన ఇలాకాలో మాత్రం మంత్రి మల్లారెడ్డికి రాజకీయంగా ఎదురు గాలి వీస్తోంది ? ప్రజా సమస్యలు పట్టవు ? గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తుంటారు ? సొంత పార్టీ నేతలే వచ్చే ఎన్నికల్లో మంత్రిని ఓడించేందుకు పావులు కదుపుతున్నారు..? వంటి అంశాలపై ప్రస్తుతం మేడ్చల్ సెగ్మెంట్‌లో సీరియస్‌గా చర్చ నడుస్తోంది. మంత్రిపై జనాల్లోనూ, సొంత పార్టీలోనూ తీవ్ర వ్యతిరేకత వస్తుంది.

వివాదాలకు కేరాఫ్

మంత్రిపై భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే భూ వివాదాలపై రెండు కేసులు నమోదు అయ్యాయి. ప్రజా సమస్యలపై కలిసేందుకు వెళ్తే పట్టించుకోరనే అపవాదు ఉంది. భూ వివాదాల సెటిల్ మెంట్లు, తక్కువ రేటుకే స్థలాల కొనుగోలు వంటి వాటిపై దృష్టి పెడుతూ.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని ప్రచారంలో ఉంది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయకపోవడం, అర్హులకు ఆసరా పింఛన్లను ఇప్పించకపోవడం.. కండ్లకోయ లో గేట్ వే ఐటీ టవర్ నిర్మాణం ప్రారంభించకపోవడం. డిగ్రీ కాలేజ్, మేడ్చల్, ఘట్ కేసర్, జవహర్ నగర్ లో వంద పడకల ఆస్పత్రులు నిర్మాణం చేయకపోవడం వంటివాటితో మంత్రికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.

మంత్రి ఓటమే లక్ష్యంగా పావులు

పీర్జాదిగూడ, ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీలపై మంత్రికి పట్టు లేదని పార్టీ శ్రేణులు టాక్. జవహర్ నగర్ మేయర్, మేడ్చల్, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో చైర్మన్లపై సొంత పార్టీ నేతలే అవిశ్వాస తీర్మానం పెట్టాలని డిమాండ్ చేస్తూ నోటీసులు ఇచ్చారు. మంత్రి కలగజేసుకొని వారించినా జవహర్ నగర్ కార్పొరేటర్లతో సహ మేడ్చల్, దమ్మాయిగూడ కౌన్సిలర్లు పట్టించుకోలేదు. జవహర్ నగర్ కార్పొరేటర్లు ఆంధ్రాలో క్యాంపులు సైతం నిర్వహించారు.

గ్రామాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు వ్యతిరేకంగా మరో వర్గాన్ని మంత్రి ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉండగా... మెజారిటీ గ్రామాల్లో బీఆర్ఎస్‌లో గ్రూపు రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డితో కూడా మంత్రికి పొసగడం లేదు. పార్టీ ఆదేశానుసారం అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు ఆత్మీయ సభలకు ఆ ఇద్దరిని మంత్రి పిలవకపోవడం చర్చనీయాంశమైంది. దీంతో వారు వచ్చే ఎన్నికల్లో మంత్రి ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది.

ఎమ్మెల్యేల గుర్రు

కొన్నాళ్ల కిందట మంత్రికి వ్యతిరేకంగా మేడ్చల్‌ జిల్లాలోని శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, ఉప్పల్‌ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, ఆరెకపూడి గాంధీ, కేపీ వివేకానంద్‌, మాధవరం కృష్ణారావు, భేతి సుభాష్‌రెడ్డి రహస్యంగా భేటీ అయ్యారు. మంత్రి తీరును ఎండగడుతూ మూకుమ్మడిగా విమర్శలకు దిగారు. మేడ్చల్‌ సెగ్మెంట్ కు మాత్రమే మంత్రిగా వ్యవహరిస్తున్నారని, పదవులన్నీ తన సొంతవారికే ఇచ్చుకుంటున్నారంటూ తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఇది అప్పట్లో బీఆర్‌ఎస్‌ అధిష్టానంలోనూ కలకలం రేపింది.

వరుస వివాదాలు..

ఇటీవల మంత్రి వ్యవహారశైలి వరుస వివాదాలకు దారి తీస్తుంది. ఘట్‌కేసర్‌లో రెడ్డి సంఘం సభలో మాట్లాడిన తీరు, రాంపల్లి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహావిష్కరణలో వ్యవహారశైలి, ఐటీ రెయిడ్స్‌ సమయంలో అధికారులతో ప్రవర్తించిన తీరు, మెడికల్‌ కాలేజీలో జరిగిన ప్రోగ్రామ్ లో రెడ్డి అమ్మాయిలపై చేసిన వ్యాఖ్యలు, బీఆర్‌ఎస్‌ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఐటీ కట్టాల్సిన అవసరం లేదనడం, టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై తొడగొడుతూ సవాల్‌ చేయడం వంటి చేష్టలతో మల్లారెడ్డి వరుస వివాదాలకు కేరాఫ్ గా మారిపోయారు.

ఆ ఎమ్మెల్సీ నజర్..?

వచ్చే ఎన్నికల్లో మేడ్చల్ అసెంబ్లీ బరిలో నిలిచేందుకు సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన ఓ ఎమ్మెల్సీ ప్రయత్నిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. మేడ్చల్ పై కన్నేసిన సదరు ఎమ్మెల్సీ, మల్లారెడ్డి వ్యతిరేక వర్గంతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఇలా మంత్రికి తీవ్ర వ్యతిరేకత ఉంది. వచ్చే ఎన్నికల్లో ఆయన గెలిచే ఛాన్స్ ఉందా..? అని కూడా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. దీనికి తోడు మంత్రిపై అసంతృప్తిగా ఉన్న నేతలతో వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ వస్తుందని, మీరంతా నారాజ్ కావద్దని, తాను ఎమ్మెల్యే అయిన తర్వాత అన్ని చూసుకుంటానని భరోసా ఇస్తున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా మంత్రి మల్లారెడ్డి పై అటు పబ్లిక్ లో.. ఇటు పార్టీ శ్రేణుల్లోనూ వ్యతిరేకత ఉండగా.? అధిగమిస్తారో.. వేచి చూడాలి.



Next Story

Most Viewed