కాంగ్రెస్‌కు ఊహించని షాక్.. బీజేపీలోకి మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ..?

by Disha Web Desk 19 |
కాంగ్రెస్‌కు ఊహించని షాక్.. బీజేపీలోకి మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ..?
X

దిశ, మేడ్చల్ బ్యూరో: కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కాంగ్రెస్ నుంచి కమలం గూటికి వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తున్నది. గత కొన్ని రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన ఆయన.. బీజేపీ అగ్ర నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిన శ్రీ గణేశ్ నారాయణన్ ఇటీవల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో సర్వే సత్యనారాయణ కంటోన్మెంట్ బీజేపీ టికెట్ ఆశిస్తూ హస్తినాలో పైరవీలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు అప్పటి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, వివేక్ సర్వే ఇంటికి వెళ్లారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించగా.. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ప్రాధాన్యత దక్కడం లేదని..

కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా గెలుపొందిన సర్వే సత్యనారాయణ కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు మల్కాజిగిరి, వరంగల్ లోక్ సభ స్థానాల్లో ఏదో ఒక టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు. అయితే మల్కాజిగిరి టికెట్‌ను పట్నం సునీత మహేందర్ రెడ్డికి కేటాయించారు. వరంగల్ టికెట్ దోమ్మాటి సాంబయ్య, సింగపురం ఇందిరాలలో ఎవరికో ఒకరికి ఇస్తారనే ప్రచారం జరుగుతున్నది.

సోనియా గాంధీకి సన్నిహితుడనే పేరున్నప్పటికీ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కడం లేదని సర్వే అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. ఇటీవల ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీని సైతం సర్వే కలిశారు. అయినా ఆశించిన ప్రాధాన్యత లభించకపోవడంతో బీజేపీలోకి వెళ్లేందుకు కేంద్ర మాజీ మంత్రి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. సర్వే బీజేపీలోకి వెళ్తే మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఆ పార్టీకి మరింత బలం చేకూరే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కంటోన్మెంట్‌తో అనుబంధం..

సర్వే సత్యనారాయణ కంటోన్మెంట్ నివాసి. 1985లో కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో సిద్దిపేట ఎంపీగా, 2009లో మల్కాజిగిరి నుంచి గెలుపొందారు. అప్పుడు కేంద్ర మంత్రి అయ్యారు. 2018లో కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి సాయన్న చేతిలో ఓటమి పాలయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీలో చేరి కంటోన్మెంట్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.


Next Story