కిరాణా షాపుల్లో కావాల్సిన బ్రాండ్లు.. గ్రామల్లో 'బెల్టు' జోరు..

by Disha Web Desk 20 |
కిరాణా షాపుల్లో కావాల్సిన బ్రాండ్లు.. గ్రామల్లో బెల్టు జోరు..
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: మంచినీళ్లు దొరకని ఊళ్లు ఉంటాయో గానీ.. మద్యం దొరకని పల్లెలు లేవు అని తెలంగాణలో ఓ సామెత ఉంది. తాగినోళ్లకు తాగినంత మన రాష్ట్రంలో మద్యం దొరుకుతుంది.. ఏ బ్రాండ్లు కావాలన్నా... మద్యం షాపులకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే గ్రామాల్లోని బెల్టు షాపుల్లో ఇట్టే దొరికిపోతుంది. ఏ ఊరెళ్లినా.. పొద్దు మాపు తేడా లేకుండా బెల్టు షాపులు దర్శనమిస్తుంటాయి. కిరాణా షాపులు, టీ కోట్టులు, చికెన్ సెంటర్లలో కూడా బెల్టు షాపులు పుట్ట గొడుగుల్లెక్క వెలుస్తున్నాయ్..మద్యంతో జనం తిప్పలు పడుతున్నా.. రాష్ట్ర సర్కారు ఆదాయాన్ని పెంచుకునేందుకు బెల్టు షాపులను ప్రోత్సహిస్తుందనే ఆరోపణ ఉంది. ఇదీ జగమెరిగిన సత్యం..కానీ తెలంగాణ పల్లెల్లో బెల్టు షాపులు ఉన్నాయా...? లేదా..? తెలుసుకునేందుకు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ సమాచార హక్కు చట్టం ద్వారా ఎక్సైజ్ శాఖను ప్రశ్నించింది. దీనికి ఎక్సైజ్ శాఖ ఇచ్చిన సమాచారంతో విస్తుపోవాల్సిన పరిస్థితి ఉంది.

బెల్టు షాపులే లేవంట...

తెలంగాణ రాష్ట్రంలో బెల్టు షాపులు ఉన్నాయా..?, లేవా..? ఒకవేళ బెల్టు షాపులు ఉంటే ఏఏ జిల్లాలలో ఎన్ని షాపులు ఉన్నాయి. ఇప్పటివరకు అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న ఎన్ని మద్యం షాపులపై రాష్ట్రవ్యాప్తంగా జరిమానా విధించారు. ఎన్ని షాపులను సీజ్ చేశారని ఆర్టీఐ ద్వారా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర దరఖాస్తు చేశారు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ అడిగిన ప్రశ్నకు ప్రతి జిల్లా ఎక్సైజ్ అధికారి సమాచారం పంపారు. రాష్ట్రంలోని పెద్దపల్లి, మహబూబ్ నగర్, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లా, నాగర్ కర్నూల్, నిజామాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, సూర్యాపేట, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, నిర్మల్, లక్ష్యెట్టిపేట, మంచిర్యాల, వరంగల్ రూరల్, బెల్లంపల్లి, అదిలాబాద్, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల ఎక్సైజ్ అధికారులు తమ ప్రాంతంలో బెల్టులు నిర్వహించడం లేదని సమాధానం ఇచ్చారు. ఎక్కడైనా బెల్టులు షాపులు ఉన్నాయని సమాచారం వస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎక్సైజ్ అధికారులు సమాచారం ఇచ్చారు.

గ్రామాల్లో ‘బెల్టు’ జోరు..

అబ్కారీ శాఖ అధికారులు సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన వివరాలకు క్షేత్ర స్థాయిలో నడుస్తున్న బెల్టు షాపులకు ఏ మాత్రం పొంతన లేదు. బెల్టు షాపులు లేవని అధికారికంగా వివరాలు ఇచ్చినా.. అనధికారికంగా రాష్ట్రంలో లక్షకు పైగా బెల్టు షాపులు నడుస్తున్నాయి. సర్కారు పెట్టిన టార్గెట్లు అందుకునేందుకు ఎక్సైజ్ శాఖ గల్లీ గల్లీలో బెల్టు షాపులను ప్రోత్సహిస్తుంది. రాష్ట్రంలో 3 వేలకు పైగా మద్యం దుకాణాలుండగా.. ఒక్కో వైన్ షాపు పరిధిలో పదుల సంఖ్యలో బెల్టు షాపులు నడుస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో బార్ అండ్ రెస్టారెంట్లను ధీటుగా పోటా పోటీగా బెల్టు షాపులను నిర్వహిస్తున్నారు. కిరాణా షాపుల్లోనూ కావాల్సిన లిక్కర్ బ్రాండ్లు అందుబాటులో ఉంటున్నాయి. కొన్నిచోట్ల మద్యం ప్రియులు ఫోన్ చేస్తే బెల్టుషాపుల నుంచి డోర్ డెలీవరీలు అందుతున్నాయి.పలు గ్రామాల్లో బెల్టు షాపుల నిర్వహణకు బహిరంగా వేలం పాటలు నిర్వహించగా.. రూ. లక్షల్లో పలుకుతున్నాయి.

టార్గెట్ కోసం అడ్డదారులు..

తెలంగాణ వచ్చిన లిక్కర్ ఆదాయం పెంపుపై సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టింది. కల్తీ లిక్కర్ ను అరికట్టడం, మద్య నియంత్రణకు కృషి చేయాల్సిన ‘స్టేట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్ మెంట్‘విధులనే మార్చేసింది. అబ్కారీ ఆఫీసర్ల విధులను పూర్తిగా మార్చేసి సేల్స్ టార్గెట్ ను పెంచాలని ఒత్తిడి తేస్తోంది. ప్రతి ఏటా 10 నుంచి 20 శాతం మద్యం అమ్మకాలను పెంచాలని టార్గెట్లు పెట్టడంతో.. తాగుడు మాన్పించేందుకు అవగాహన కార్యక్రమాలను చేపట్టని ఎక్సైజ్ ఆఫీసర్లు..సేల్స్ పెంచేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. షాపుల వారీగా ప్రతి నెల 10 నుంచి 20 శాతం ఎక్కువగా అమ్మాలని జిల్లా అబ్కారీ శాఖకు పై నుంచి ఆర్డర్లు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ టార్గెట్ రీచ్ కాకుంటే అక్కడి అధికారులు, సిబ్బందిని బదిలీ చేస్తున్నారని, లేదంటే డీ గ్రేడ్ చేస్తున్నారని పలువురు అధికారులు వాపోతున్నారు.అదేవిధంగా టార్గెట్లు రీచ్ అయిన వారికి ప్రమోషన్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో ఉన్నతాధికారుల ఒత్తిళ్లు తట్టుకోలేక జిల్లా అధికారులు సేల్స్ పెంచాలని వైన్ షాపులపై పడుతున్నారు. మీ పరిధిలో ఎన్ని బెల్టుషాపుల పెట్టుకున్నా టార్గెట్ రీచ్ కావాల్సిందేనని గట్టిగా చెబుతున్నట్లు వైన్ షాపు యాజమానులు పేర్కొంటున్నారు.

Next Story

Most Viewed