హమీలు ఇస్తాడు.. కానీ అమలు చేయడు.. రేవంత్ రెడ్డిపై ఈటల ఫైర్

by Disha Web Desk 23 |
హమీలు ఇస్తాడు.. కానీ అమలు చేయడు.. రేవంత్ రెడ్డిపై ఈటల ఫైర్
X

దిశ,మేడ్చల్ బ్యూరో : అసెంబ్లీ ఎన్నికల్లో దొడ్డిదారిన గద్దెనెక్కేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇచ్చారని మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. ఆ ఎన్నికల్లో వచ్చేది లేదు, ఇచ్చేది లేదు అని అన్నారు.కానీ ,అధికారంలోకి వచ్చాక లంకె బిందెలు ఉన్నాయని వస్తే ఖాళీ బిందెలు ఉన్నాయని ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఈ ముఖ్యమంత్రి బుకాయిస్తున్నారని ఈటల ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం రాత్రి నాగోల్ లోని శుభమ్ కన్వెన్షన్ లో ఉప్పల్, ఎల్.బి.నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల విశ్వ కర్మల ఆత్మీయ సమ్మేళనంలో ఈటల పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చదన్నారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ అంటున్నాడు..కానీ ఇంపాజిబుల్ అని నేను అంటున్న.. అమ్మతోడు నన్ను నమ్మండి అని రేవంత్ అంటున్నారు… నమ్ముతాం సరే.. నువ్వే కదా లంకెబిందెలు ఉన్నాయని వస్తే ఖాళీ బిందెలు ఉన్నాయన్నది మరి ఎలా చేస్తావని నేను ప్రశ్నిస్తున్నా.? అని ఈటల అన్నారు. మహిళలకు రూ.2500, పెన్షన్ రూ. 4 వేలు ,ఆటో డ్రైవర్ల, కూలీలకు రూ. 12 వేలు,పంటలకు రూ.500 బోనస్ ఎలా ఇస్తావని ఈటల నిలదీశారు.అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే.. పంటలు ఎండిపోయాయి. క్వాలిటీ కరెంటు ఇవ్వడంలేదు.ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో కమిషన్ ఇస్తే తప్ప బిల్లులు రావడం లేదని ధ్వజమెత్తారు.

మోడీకే ఎందుకు ఓటేయ్యాలంటే..

మోడీకి ఎందుకు ఓటు వేయాలని కాంగ్రెసోళ్లు అడుగుతున్నారని, అమెరికా సెనేట్ లో జై మోడీ అని జేజేలు కొట్టించుకున్నుందుకు అని, యుద్ధం ఆపి ఉక్రెయిన్ నుండి మన పిల్లలను తెప్పించినందుకని, కాశ్మీర్ లో బుల్లెట్ల గాయాలు లేనందుకని, లాల్ చౌక్ లో త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగురుతున్నందుకు మోడికి ఓటేయాలని ఈటల పేర్కొన్నారు. 17 వృత్తులు చేసేవారికి విశ్వకర్మల కోసం ఒక స్కీం తీసుకువచ్చిన ఘనత మోడికే దక్కిందన్నారు. బంగారానికి మెరుగు పట్టే సైనేడ్ మింగి చనిపోయిన విశ్వకర్మలు ఎంతో మందని ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వారి కన్నీళ్లు తుడవడానికే విశ్వకర్మ పథకాన్ని ప్రధాని తీసుకువచ్చారని తెలిపారు. . జైశ్రీరాం అన్నం పెదతాదా..’ అని అవమానంగా మాట్లాడుతున్నారు.

జైశ్రీరాం ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని రాజేందర్ స్పష్టం చేశారు.మేదాసంపత్తికి, త్యాగానికి మారుపేరు విశ్వకర్మలని వారి సేవలను కొనియాడారు.మోడి అండదండలతో మల్కాజిగిరిని సమగ్ర అభివృద్ధి చేస్తా అని హామీ ఇచ్చారు.వ్యాపారం చేసుకోవడానికో, రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి అయితే రాజకీయాలు అవసరం లేదన్నారు.. ప్రజాసేవకే రాజకీయం చేయాలని హితవు పలికారు. ఢిల్లీలో ఉన్న బీజేపీని ఇక్కడ కూడా గెలిపించుకుంటే ఐటీ హబ్, ఉద్యోగావకాశాలు, అభివృద్ధి జరుగుతుందని ఈటల తెలిపారు.కార్యక్రమంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రంగా రెడ్డి జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి ,విశ్వకర్మ ప్రతినిధులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed