చేతులు తడిపితే గాని ఫైల్ కదలదు..అధికారి చేతివాటం..

by Disha Web Desk 23 |
చేతులు తడిపితే గాని ఫైల్ కదలదు..అధికారి చేతివాటం..
X

దిశ,ఘట్కేసర్ : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, ఘట్కేసర్ మండల రెవెన్యూ కార్యాలయంలో ఓ అధికారి లంచావతారం ఎత్తినట్లు విమర్శలు వస్తున్నాయి. ప్రతి పనికి ఓ రేట్ ఫిక్స్ చేసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇతగాడి తీరుపై తోటి సిబ్బంది కూడా విసుగు చెందుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తన సెక్షన్లో ఏ ఫైల్ రెడీ కావాలన్నా... ఏ ఫైల్ బయటికి వెళ్లాలన్నా అంతా తన ఇష్టపూర్వకంగా జరగాలని నిబంధనలు ఫిక్స్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మండల రెవెన్యూ కార్యాలయానికి వివిధ అవసరాల నిమిత్తం వచ్చే ప్రజలతో దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు సమాచారం. ఇటీవల నంగారా బేరి లంబాడి హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ధరావత్ గణేష్ నాయక్ సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరితే సకాలంలో సమాచారం ఇవ్వాల్సిన ఆ అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా దురుసుగా సమాధానం ఇచ్చినట్లు తెలిపాడు. సదరు అవినీతి అధికారి తీరుపై గణేష్ నాయక్ మేడ్చల్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానన్నారు.

నెలలు గడిచినా సమాచారం ఇవ్వడం లేదు.. : బాధితుడు గణేష్ నాయక్

ఘట్కేసర్ మండలం రెవెన్యూ పరిధిలో వెంకటాపూర్ గ్రామం సర్వేనెంబర్ 835, 840 లలోని రెండు ఎకరాల 32 గుంటల ప్రభుత్వ భూమిలో అనురాగ్ యూనివర్సిటీ యజమాని, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, జనగామ నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్రమ నిర్మాణాలు చేపట్టాడని, ప్రత్యేక జీఓ 150 కింద అతనికి సీలింగ్ భూమిని రెగ్యులరైజేషన్ చేశారని అందుకు సంబంధించిన సమాచారం కావాలని ఆర్టిఐ(సమాచార హక్కు చట్టం) కింద దరఖాస్తు చేయగా... ఆ సమాచారం ఇవ్వడానికి రెవెన్యూ అధికారులు, సిబ్బంది కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఇదే విషయంపై మండల రెవెన్యూ అధికారిని వివరణ కోరగా...

మెమో జారీ చేస్తాం.. : తాసీల్దార్ డి.ఎస్. రజిని

మండల రెవెన్యూ కార్యాలయంలో సిబ్బంది అవినీతిపై విషయం తన దృష్టికి రాలేదని తాసిల్దార్ తెలిపారు. నాక్కూడా మీడియా ప్రతినిధుల ద్వారా ఇప్పుడే విషయం తెలిసిందని, అలాంటి అధికారులకు మెమో జారీ చేస్తామని చెప్పారు.


Next Story