కాలనీ పార్క్ స్థలం కబ్జా చేస్తున్నారు.. అధికార పార్టీ నాయకులే కబ్జాకు యత్నిస్తున్నారని ఆరోపణ

by Disha Web Desk 23 |
కాలనీ పార్క్ స్థలం కబ్జా చేస్తున్నారు.. అధికార పార్టీ నాయకులే కబ్జాకు యత్నిస్తున్నారని ఆరోపణ
X

దిశ, పేట్ బషీరాబాద్: వివాదాస్పద పార్క్ స్థలంలో చేపట్టిన కట్టడాలను గతంలో టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. అయినప్పటికీ సుదీర్ఘ విరామం అనంతరం తిరిగి అదే పార్క్ స్థలంలో కంచె వేసే ప్రయత్నం చేయడంతో కాలనీవాసులు తిరగబడ్డారు. దీంతో ఆస్థానం మాదే అంటూ వచ్చిన వారికి కాలనీ అసోసియేషన్ వారికి జరిగిన వివాదంలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. కుత్బుల్లాపూర్ పరిధిలో సూరారం సిద్ధి వినాయక నగర్ కాలనీలో ఉన్న పార్క్ స్థల వివాదం మరోసారి ఘర్షణకు దారితీసింది.

సంవత్సరం క్రితం కూల్చివేతలు..

సూరారం కాలనీ సర్వేనెంబర్ 105 లో 1978 సంవత్సరంలో సిద్ధి వినాయక నగర్ లేఅవుట్ రూపొందించడం జరిగింది. ఇందులో ప్రజా అవసరాల కోసం వెయ్యి 80 గజాల స్థలాన్ని విడిచిపెట్టారు. అయితే విపరీతంగా భూ విలువ పెరిగిపోవడంతో ఈ పార్కు స్థలం పై కొందరు కన్నేశారు. 2016 లో ఇక్కడ ఓ నిర్మాణం చేస్తుండగా జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చి వేశారు. తదనంతరం 2023 ఫిబ్రవరి 11న ఇదే స్థలంలో కంచె వేయడానికి ప్రయత్నించడంతో తిరిగి టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చి వేయడం జరిగింది. అయినప్పటికీ తాజాగా శుక్రవారం నాడు కొందరు వ్యక్తులు మంది మార్బలంతో వచ్చి పార్కు స్థలంగా చెబుతున్న భూమిలో మరోసారి కంచి వేసే ప్రయత్నం చేయగా జరిగిన వివాదం ఘర్షణకు దారితీసింది.

కాలనీ వర్కింగ్ ప్రెసిడెంట్ పై దాడి

కాగా కోర్టు వివాదంలో ఉన్న పార్కు స్థలంలో ఏ విధంగా నిర్మాణం పనులు చేపడతారని కాలనీవాసులు పనులు చేపట్టడానికి వచ్చిన వారిని నిలదీశారు. దీంతో వారికి కాలనీ అసోసియేషన్ వారికి మధ్య పెద్ద వివాదం జరిగింది. అనంతరం ఈ వాదం కాస్త ఘర్షణకు దారి తీయడంతో కాలనీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన శ్రీనివాస గౌడ్ కు గాయాలయ్యాయని, తీవ్ర దుర్భాషలాడుతూ ఎవరికి ఫిర్యాదు చేసుకుంటారో చేసుకోండి అంటూ వచ్చిన వారి బెదిరించారని వాపోతున్నారు కాలనీవాసులు. గాయాలు అయిన వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్ ను చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

పోలీసు ఫిర్యాదుకు వెనకడుగు..?

కాగా శుక్రవారం జరిగిన ఘర్షణ పై ఫిర్యాదు చేసేందుకు కాలనీవాసులు భయపడుతున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 11 2023 న ఇదే తరహాలో ఘర్షణ జరగడం కాలనీ వాసులందరూ కలిసి దుండిగల్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే పోలీసులు ఆ కాలనీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు దారం సాయికుమార్ లను స్టేషన్కు తరలించారు. దీంతో అప్పుడు కాలనీవాసులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా కూడా చేశారు. తాజాగా జరిగిన ఘర్షణ పై ఫిర్యాదు చేస్తే తిరిగి వారిపైనే చర్యలు తీసుకోవడంతో ఈసారి ఫిర్యాదు చేయడానికి వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తుంది. అధికార పార్టీకి చెందిన కొందరు ఈ దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.

కోర్టు వివాదంలో పార్కు స్థలం

కాగా సదరు పార్కు స్థలం వివాదం ప్రస్తుతానికి కోర్టు పరిధిలో ఉన్నది. 2017 నుంచి కోర్టు పరిధిలో ఉన్నది. అది పరిష్కారం కాకుండానే మళ్లీ మళ్లీ పార్క్ స్థలంలో నిర్మాణాలు చేపట్టేందుకు రావడం పై కాలనీవాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ కేసు విషయంపై కోర్టు వాయిదా ఉన్నదని ఇంతలోనే పార్క్ స్థలంలో పనులు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.


Next Story