సీఎం కేసీఆర్ పాలనలో దేశానికే దిక్సూచిగా తెలంగాణ : మంత్రి హరీష్ రావు

by Disha Web Desk 1 |
సీఎం కేసీఆర్ పాలనలో దేశానికే దిక్సూచిగా తెలంగాణ : మంత్రి హరీష్ రావు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: సీఎం కేసీఆర్ పాలనలో దేశానికే దిక్సూచిగా తెలంగాణ మారిందని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అచరిస్తుంటే.. ఆ విధానాలను దేశం అనుసరిస్తోందని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బైరి అంజయ్య గార్డెన్ లో పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో రెండో విడత గొర్రెల పంపిణీపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ... గొల్ల కుర్మల కోసం తెలంగాణలో అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ పథకంను కర్ణాటక కాంగ్రెస్ నేత రవన్న మొచ్చుకొని సీఎం కేసీఆర్ ను సన్మానించారని తెలిపారు. తమిళనాడు సూపర్ స్టార్ రజనీ కాంత్ హైదరాబాద్ పట్టణం అమెరికా లాగా అభివృద్ధి చెందిందని మెచ్చుకుంటుంటే కాంగ్రెస్, బీజేపీ గజనీలకు అర్ధం కావడం లేదని ఎద్దేవా చేశారు. దేశ జనాభాలో తెలంగాణ జనాభా 2.8 శాతం ఉండగా.. 38 శాతం అవార్డులు రాష్ట్రానికే దక్కడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు.

కేంద్రంలోని బీజేపీ నాయకులు ఢిల్లీలో మెచ్చుకుంటూ.. గల్లీలో తిడుతున్నారని అన్నారు. కళ్యాణ లక్ష్మి పథకం అమలుతో బాల్య వివాహాలనే సామాజిక రుగ్మతను రూపు మాపిన నేత సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఒక్కప్పుడు ప్రజలు బతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితి నుంచి నేడు ఇతర రాష్ట్రాలకు జీవనోపాధి కల్పించే స్థితికి తెలంగాణ చేరకుందంటే అది సీఎం కేసీఆర్ పనితీరుకు నిదర్శనమన్నారు. మల్లన్న దేవుడి దయతో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకొవడంతో చెరువులు, కుంటలు, వాగులు జలకళ సంతరించుకున్నాయని తెలిపారు.

గొల్ల కుర్మల నైపుణ్యాన్ని, గొప్పదనాన్ని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా కొనియాడారని గుర్తు చేశారు. గ్రామీణ అర్ధిక వ్యవస్థ బలోపేతం చేయడమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ గొర్రెల పంపిణీ కార్యక్రమం అమలు చేసి గొల్లకుర్మల అభ్యన్నతికి సహకారం అందించారని స్పష్టం చేశారు. జిల్లాలో రెండవ విడతలో 17వేల మందికి గొర్రెల యూనిట్లను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. లంచాలు, రీసైక్లింగ్ కు తావులేకుండా, ఒత్తిడి లేకుండా లబ్దిదారులు నచ్చిన గొర్లను కొనుగోలు చేసుకోవాలని సూచించారు.

గొల్ల కుర్మల అభ్యన్నతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. హైదరాబాద్ నడి ఓడ్డున దొడ్డి కొమురయ్య విగ్రహం ఏర్పాటు తో పాటుగా జయంతిని అధికారికంగా నిర్వహించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. దీనికి తోడు రాష్ట్ర రాజధానిలో గొల్ల, కుర్మల ఆత్మ గౌరవ భవనాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్ సారధ్యంలోని ప్రభుత్వానికి అండగా నిలువాలని పిలుపునిచ్చారు.

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రాలకు రావల్సిన హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే ఆ రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం కూలదోచే ప్రయత్నం చేస్తోందని అరోపించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అడిషనల్ కలెక్టర్ ముజామ్బిల్ ఖాన్, ఎఫ్ డీ సీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, గొల్ల కుర్మ సహకార సంఘం జిల్లా చైర్మన్ పోచబోయిన శ్రీహరి యాదవ్, మాజీ మున్సిపాల్ చైర్మన్ రాజనర్సు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, ఎంపీపీలు, జడ్జీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed