మరికొన్ని గంటల్లో తీరనున్న 'చిరకాల వాంఛ'

by Disha Web Desk 18 |
మరికొన్ని గంటల్లో తీరనున్న చిరకాల వాంఛ
X

దిశ, మెదక్: మెతుకు సీమ ప్రజల చిరకాల వాంఛ... రైలు కూత.. మెదక్ అక్కన్న పేట రైల్వే లైన్ నిర్మాణం కోసం ఏళ్లుగా సాగిన ఉద్యమానికి ఫలితం దక్కింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటుతో మెదక్ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. ఇటీవలే ర్యాక్ పాయింట్ ను రాష్ట్ర మంత్రులు ప్రారంభించగా... ప్యాసింజర్ రైల్ ను కేంద్రమంత్రి మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం జెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం జాతికి అంకితం చేస్తారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.


మెదక్ రైల్వే ఆకాంక్ష 1982 లో మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన ఇందిరా గాంధీ హామీతో ఇక్కడి ప్రజల్లో రైల్వేపై ఆశ పెరింగింది. మెదక్ నుంచి ఎంపీగా గెలిచి భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన ఇందిరా గాంధీ రైలు ఇవ్వడం పెద్ద కష్టం కాదు. తప్పక రైలు వస్తుందన్న నమ్మకం ప్రజల్లో పెరిగింది. కానీ తరవాత హామీ మరుగున పడిపోయింది. ఆ తరవాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బాగరెడ్డి, మాణిక్య రెడ్డిలు కూడా ఎన్నికల్లో రైల్ తెస్తామని హామీ ఇచ్చారు. కానీ కార్యరూపం దాల్చలేదు. ప్రతి ఎన్నికల్లో రైల్ ఒక ప్రచార అస్త్రంగా మరిందే తప్ప ఎక్కడా రైల్ ఏర్పాటు ప్రక్రియ సాగలేదు. 1997, 99 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన అలే నరేంద్ర బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళారు.. తాను గెలిస్తే రైలెక్కి వస్తా అనే ప్రచారం కూడా చేశారు. కానీ అప్పుడు కూడా కార్యరూపం దాల్చలేదు. కానీ మెదక్ అక్కన్నపేట, మిర్జపల్లి, మెదక్ పటాన్ చెరువు రైల్వే నిర్మాణం ప్రతిపాదన తీసుకువచ్చారు. ఆ తర్వాత పార్టీలకు అతీతంగా 2003లో రైల్వే సాధన సమితి ఏర్పాటై పలు దఫాలుగా ఉద్యమాలు చేసింది. 2008లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు అప్పటి ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి ద్వారా కలిసి రాష్ట్ర వాటా 50 శాతం ఇవ్వడానికి వైఎస్ అంగీకరించడం ప్రతిపాదనలు పంపడం జరిగింది. కానీ మళ్ళీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు మారిన సమయంలో అప్పటి ఎంపీ విజయశాంతి రైల్వే మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పించడంతో 2014లో శంకుస్థాపన, 2014లో బీజేపీ అధికారంలో వచ్చిన తరవాత ఓట్ ఆన్ బడ్జెట్ లో రూ. 5 కోట్లు, 2015లో రూ. 15 కోట్లు మంజూరు చేయడంతో రైలు పనులు పట్టాలెక్కాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా 50 శాతం ఇవ్వడంతోపాటు భూసేకరణ చేసి ఇచ్చింది. దీంతో మెదక్ అక్కన్నపేట రైల్ వే నిర్మాణం పనులు పూర్తయ్యాయి.
17.2 కిలో మీటర్ల రైల్వే లైన్ నిర్మాణం...

మెదక్ - అక్కన్నపేట రైల్వే 17. 2 కిలో మీటర్ల నిర్మాణం చేపట్టారు. రైల్వే నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 131.14 హెక్టార్ల భూమిని సేకరించింది. ఇందులో లక్ష్మాపుర్, శమ్నాపూర్, మెదక్ మూడు స్టేషన్ ల నిర్మాణం చేశారు. రూ. 194 కోట్ల వ్యయం నిర్మాణం కోసం ఖర్చు చేశారు. మెదక్ లో మూడు లైన్ ల స్టేషన్ గా ఉంటుంది. ఒకటి సరుకుల కోసం, మరొకటి ప్రయాణికుల కోసం నిర్మించారు. ఇక్కడ టెర్మినల్ కూడా నిర్మించారు.

నేడు 4 గంటలకు ప్రారంభించనున్న కేంద్ర మంత్రి

మెదక్ లో ప్యాసింజర్ రైల్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం సాయంత్రం 4 గంటలకు జెండా ఊపి ప్రారంభిస్తారు. అంతకుముందు మెదక్ అక్కన్నపేట మధ్య నూతన రైల్వే లైన్ ను జాతికి అంకితం చేస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, జెడ్పీ చైర్ పర్సన్ హేమలతా శేఖర్ గౌడ్, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ తదితరులు పాల్గొననున్నారు.

Next Story