హర హర మహాదేవ... శంభో శంకర

by Dishanational1 |
హర హర మహాదేవ... శంభో శంకర
X

దిశ, ఝరాసంగం: మహాశివరాత్రి ఉత్సవాలకు జిల్లాలోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. అష్ట తీర్థాల సంగమం, తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలలో ప్రసిద్ధిగాంచిన ఝరాసంగం శ్రీ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి దేవాలయంలో నవాహ్నిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. రహదారులలో రంగురంగుల దీపాలను, తోరణాలను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుండి వచ్చే భక్తుల కోసం తాత్కాలిక రోడ్ల మరమ్మతు చేశారు. కలెక్టర్ శరత్ పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే పలు దఫాల అధికారులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం మంచినీటి సౌకర్యం, చలువ పందిళ్లు, ప్రత్యేక స్నానపు గదులు, మొబైల్ టాయిలెట్స్, ప్రత్యేక సీసీ కెమెరాలతో పాటు భద్రత, ఆలయ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాట్లు చేశారు. కాగా స్వామివారి గర్భాలయాన్ని బంగారు పూతతో మకర తోరణం చేయించారు.


సంగమేశ్వర స్వామి స్థల పురాణం:

ఝరాసంగ క్షేత్రంలో శివ లింగాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడు ప్రతిష్టించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది. కృత యుగంలో సూర్య వంశానికి చెందిన కుపేంద్ర అనే రాజు చర్మ వ్యాధితో బాధ పడుతూ ఉండేవాడు. తన వ్యాధి నివారణకు రాజు చేసిన ప్రయత్నం విఫలమయ్యింది. ఒకానొకప్పుడు రాజు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడున్న కేతకీ వనంలో ఉన్న నీటి గుండంలో స్నానం చేసినప్పుడు అతనికి పూర్తిగా స్వస్థత చేకూరిందట. అదేరోజు రాత్రి రాజుకి సంగమేశ్వర స్వామి కలలో కనిపించి తానక్కడ ఉన్నానని, దానిని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడట. పరమేశ్వరుని ఆదేశం మేరకు రాజు స్వామికి ఆలయాన్ని కట్టించాడట. అక్కడున్న నీటి కుండాన్ని పుష్కరిణిగా మార్చి దానికి అష్ట తీర్ధమని, అమృత కుండంగా పేరు పెట్టినట్లు ఇక్కడి ఆదారాల ద్వారా అవగతమవుతోంది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి వారి దివ్య మంగళ లింగ రూపాన్ని దర్శించిన భక్తులు అపూర్వమైన ఆధ్యాత్మికానందానికి లోనవుతారు.

మంజీర నదీతీరంలో వెలసిన ఈ స్వామిని సంగమేశ్వర స్వామి అని పిలుస్తారు. కేతకీ సంగమేశ్వర స్వామిగా పూజలందుకుంటున్న ఈ స్వామిని మొదట బ్రహ్మదేవుడు కేతకీ పుష్పాలతో కేతకి అంటే మొగలి పువ్వులతో పూజించాడట. అందుకనే ఈ స్వామిని కేతకీ సంగమేశ్వర స్వామి అని కొలుస్తున్నారు భక్తులు అని శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది.

స్వామివారి కార్యక్రమాలు ఇలా ఉన్నాయి

శుక్రవారం శేష వాహన సేవ నిర్వహించనున్నారు.

శనివారం మహాశివరాత్రి సందర్భంగా రాత్రి 12 గంటల నుండి స్వామివారికి లింగోద్భవ సమయమున స్వామివారికి మహన్యాస రుద్రాభిషేకము.

ఆదివారం మహా రుద్రాభిషేకం, నంది వాహన సేవ,

సోమవారం ఉదయం తెల్లవారుజామున అగ్నిగుండ ప్రవేశం, సాయంత్రం శివపార్వతుల కళ్యాణోత్సవం, రాత్రి 10 గంటలకు రథోత్సవం. తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

మహాశివరాత్రికి ఏర్పాట్లు పూర్తి: ఆలయ ఈవో శశిధర్

కేతకి ఆలయ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈవో శశిధర్ పేర్కొన్నారు. గతంలో కంటే అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంటుందని అందుకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. భక్తుల సహకారంతో బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్నారు. రేపటి మహాశివరాత్రి జాగరణ కోసం ఇప్పటికే పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు.



Next Story

Most Viewed