సిద్దిపేట యువత చెంతన ఐటీ ఉద్యోగాలు

by Disha Web Desk 1 |
సిద్దిపేట యువత చెంతన ఐటీ ఉద్యోగాలు
X

జూన్ 2న మంత్రి చేతుల మీదుగా ఐటీ టవర్ ప్రారంభం

ఐటీ కంపెనీల ప్రతినిధులతో మంత్రి హరీష్ రావు సమీక్ష

దిశ సిద్దిపేట ప్రతినిధి : ద్వితీయ శ్రేణి నగరాల్లోని యువతకు ఐటీ ఉద్యోగాల కల్పించేలా నిర్మించిన ఐటీ టవర్ జూన్ 2న మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించనున్నారు. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో నెట్ విజన్, జోలాన్ టెక్, విసన్ టెక్, అమిడాయ్ ఎడ్యుటెక్, ఫిక్సిటీ టెక్నాలజీస్, ఇన్నోసోల్ ఐటీ కంపెనీల ప్రతినిధులతో మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశంలో కరీంనగర్ ఖమ్మం వరంగల్ పట్టణాల్లో ఐటీ టవర్ల ద్వారా నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేటలో 718 కెపాసిటీతో నిర్మించిన ఐటీ టవర్ లో ప్రముఖ ఐటీ కంపెనీలు భాగస్వామ్యం అయ్యేందుకు ముందుకు రావడం హర్షనీయమన్నారు.

ఆయా కంపెనీల ద్వారా 300 మంది నిరుద్యోగులకు ఐటీ రంగంలో ఉద్యోగాలు దక్కనున్నాయన్నారు. ఐటీ టవర్ లో స్థానిక యువతకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. సిద్దిపేట ఐటీ టవర్ లో కంపెనీలు నెలకొల్పేందుకు వచ్చిన ఐటీ కంపెనీలకు రెండేళ్ల పాటు ఉచితంగా నిర్వహణ, అద్దె విద్యుత్, ఇంటర్నెట్ బిల్లులు భారం లేకుండా చూస్తామని మంత్రి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఐటీ కంపెనీల ప్రతినిధులు మాట్లాడుతూ.. ఐటీ టవర్ లో పనిచేసే విద్యార్థులకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఆధ్వర్యంలో ఆయా కంపెనీల అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇస్తామన్నారు. ఈ సమావేశంలో ఐటీ కంపెనీల ప్రతినిధులు విజయ్ రంగినేని, అలుగు ముత్యం, శ్రీకాంత్, శేఖర్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed