కాద్లూర్‌ సర్పంచ్‌కు షోకాజ్‌ నోటీసులు

by Disha Web Desk 1 |
కాద్లూర్‌ సర్పంచ్‌కు షోకాజ్‌ నోటీసులు
X

ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా గ్రామస్థులతో ఆందోళన చేయించాడనే నోటీసులు

దిశ, అందోల్‌ : దశాబ్ధి ఉత్సవాలను నిర్వహించడంలో, పారిశుధ్య నిర్వహణ, మంచినీటి సరఫరాలో నిర్లక్ష్యం చేసినందుకు గాను మెదక్‌ జిల్లా టేక్మాల్‌ మండలం కాద్లూర్‌ సర్పంచ్‌ యాదయ్యకు అధికారులు షోకాజ్‌ నోటీసులను జారీ చేశారు. జూన్‌ 2 నుంచి 22 వరకు ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను నిర్వహించేందుకు మార్గదర్శకాలను నిర్దేశించింది. ఈ ఉత్సవాల్లో భాగంగా 3న కాద్లూర్‌లో నిర్వహించిన రైతు దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ హజరవుతారన్న తెలుసుకున్న గ్రామస్థులు రోడ్డుకు అడ్డంగా బైఠాయించారు.

మా గ్రామానికి ఎమ్మెల్యే రావొద్దంటూ... గ్రామానికి వేళ్లే రోడ్డుపై ముళ్లకంచెను వేశారు. గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని మహిళలు ఖాళీ బిందేలతో బైఠాయించారు. సీఎంకు, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మా గ్రామంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, మా సమస్యలు తీరిస్తేనే గ్రామంలోకి రావాలంటూ అందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న మండల పార్టీ అధ్యక్షుడు భక్తుల వీరప్ప, మరికొందరు బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు గ్రామానికి చేరుకుని వారికి నచ్చజేప్పారు. అందోళన విరమించిన తర్వాత ఎమ్మెల్యే గ్రామానికి చేరుకుని రైతు కార్యక్రమంలో పాల్గొన్నారు.

గ్రామంలో నెలకొన్న సమస్యలన్నీంటిని తీరుస్తానని హామీ ఇచ్చారు. అయితే గ్రామస్థులు చేసిన అందోళనకు కారణం సర్పంచ్‌ యాదగిరేనని, ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయుటలో నిర్లక్ష్యం చేసినందుకు, ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించినందుకు, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సమస్యను పరిష్కరించడంలో విఫలమైనందున పంచాయతీ రాజ్‌ చట్టం–2018 ప్రకారం ఎందుకు చర్యలు తీసుకొకూడదో మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని షోకాజ్‌ నోటీను అధికారులు అందజేశారు.

నిరంతరం గ్రామాభివృద్ది కోసమే పనిచేస్తున్నా: యాదగిరి, సర్పంచ్‌

అధికార పార్టీకి చెందిన సర్పంచ్‌ గా ఉన్న తాను ప్రభుత్వ కార్యక్రమాన్ని ఏలా అడ్డుకుంటానని, ప్రజలను తానేందుకు ఊసిగొల్పుతానని కాద్లూర్‌ సర్పంచ్‌ యాదగిరి అన్నారు. షోకాజ్‌ నోటీసుపై ఆయన స్పందించారు. గ్రామంలో దశాబ్ధి ఉత్సవాలను, ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉన్నాం. గ్రామంలో అక్కడక్కడ సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నానన్నారు.

ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ గ్రామానికి వస్తున్నారని తెలుసుకుని కొందరు కావాలనే అందోళనకు దిగారు. వారిని పోలీసుల సహకారంతో నచ్చజేప్పాం. అందోళన విరమించిన తర్వాత ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ తో కలిసి రైతు దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నాను. రైతు దినోత్సవ వేడుకల సందర్భంగా డప్పు చప్పుళ్లతో ఎడ్లబండ్ల ఊరేగింపును కూడా నిర్వహించామని, ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తనవద్ద ఉన్నాయంటూ షోకాజ్‌ నోటీసు విషయంలో సర్పంచ్‌ పై విధంగా స్పందించారు.


Next Story