ప్రజల భాగస్వామ్యంతో చెత్త సమస్యకు శ్వాశ్వత పరిష్కారం: మంత్రి హరీష్ రావు

by Disha Web Desk 11 |
ప్రజల భాగస్వామ్యంతో చెత్త సమస్యకు శ్వాశ్వత పరిష్కారం: మంత్రి హరీష్ రావు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో ఒక్కటైన చెత్త సమస్యకు, సిద్దిపేటలో ప్రజల భాగస్వామ్యంతో శ్వాశ్వత పరిష్కారం చూపామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలో ఇంటింటా సేకరించిన తడి చెత్తతో తయారు చేసిన భూ మిత్ర జీవ సంపన్న సేంద్రియ ఎరువుల గోదాంను సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డ్ లో మంగళవారం మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేట పట్టణంలోని 41,322 ఇండ్ల నుంచి ప్రతి నెల 34,32,000 మెట్రిక్ టన్నుల చెత్త వెలువడుతుందన్నారు. అందులో తడి చెత్తతో సేంద్రియ ఎరువులు, గ్యాస్, పొడి చెత్తను రీసైక్లింగ్, హానికర చెత్తను వేర్వేరుగా విక్రయిస్తూ చెత్త నుంచి ప్రతినెల రూ.21 లక్షల అదాయం సమకూర్చుకుంటున్నట్లు వెల్లడించారు.

అలాగేఅతిపెద్ద సమస్య అయిన చెత్త సమస్యకు సిద్దిపేటలో శాశ్వత పరిష్కారం చూపినట్లు పేర్కొన్నారు. వ్యవసాయానికి రసాయన ఎరువుల వినియోగంతో ప్రజలకు కరోనా వ్యాప్తి చెందిన మాదిరి కాన్సర్ విస్తరిస్తుందన్నారు. సేంద్రియ ఎరువుల వినియోగం తో భూపరిరక్షణతో పాటుగా మనల్ని మనం రక్షించుకున్న వారమవుతామన్నారు. అంతకు ముందు సేంద్రియ ఎరువులను వినియోగిస్తున్న రైతుల అభిప్రాయాలు సభవేదికగా పంచుకున్నారు. అలాగే మున్సిపాలిటీలో చెత్త సేకరణ మొదలు సేంద్రియ ఎరువుల తయారీ విధానం గురించి డా. శాంతి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు తన వ్యవసాయ క్షేత్రంలో వినియోగానికి 125 బ్యాగుల జీవ సంపన్న సేంద్రియ ఎరువు కొనుగోలు చేశారు.

మరికొంత మంది నాయకులు సేంద్రియ ఎరువుల బ్యాగులను కొనుగోలు చేశారు. అనంతరం కోహెడ మండల సమాఖ్యకు వ్యవసాయ డ్రోన్ స్ప్రేయర్ ను హరీశ్ రావు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వేలేటి రోజా రాధకృష్ణ శర్మ, మున్సిపాల్ చైర్ పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్సు, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ మచ్చ విజిత వేణుగోపాల్ రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed