జర్నలిస్టులతో ఉద్యమ అనుబంధం.. వారి సంక్షేమమే మా లక్ష్యం: మంత్రి హరీష్‌రావు

by Disha Web Desk 1 |
జర్నలిస్టులతో ఉద్యమ అనుబంధం.. వారి సంక్షేమమే మా లక్ష్యం: మంత్రి హరీష్‌రావు
X

దిశ, అందోల్: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులతో బీఆర్‌ఎస్‌ పార్టీకి ఉద్యమ అనుబంధం ఉందని, ఫ్రెండ్లీ జర్నలిస్టుల పాలనను ప్రభుత్వం అందిస్తుందని రాష్ట్ర అర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. బుధవారం నియోజకవర్గంలోని నాలుగు మండలాల జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలను పంపిణీ కార్యక్రమాన్ని సంగుపేట జర్నలిస్టు కాలనీలో ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌తో కలిసి ఎంపిక చేసిన జర్నలిస్టులందరికీ ఇళ్ల పట్టాలను ఆయన చేతుల మీదుగా అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ చొరవతో నియోజకవర్గంలోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. సమాజహితం కోసం కృషి చేసే వృత్తి జర్నలిజం ఒక్కటేనన్నారు. జర్నలిస్టులు నిత్య విద్యార్థులనీ, ప్రతిరోజూ ఏదోక అంశంపై అధ్యయనం చేసుకొవాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలో 12 వేల అక్రిడేషన్‌ కార్డులుంటే, ప్రత్యేక రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాలో 21,295 అక్రిడేషన్‌ కార్డులను అందించిన ఘనత బీఆర్‌ఎస్‌ భుత్వానిదేనన్నారు.

జర్నలిస్టుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం నిబద్ధతతో ఉందని, వారి సంక్షేమానికి రూ.100 కోట్ల నిధిని కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమం పాటుపడుతున్నామన్నారు. రూ.15 కోట్లతో మీడియా భవన్‌ నిర్మాణం దాదాపు పూర్తి కావస్తుందన్నారు. ప్రజలకు వాస్తవాలను చెప్పే భాద్యత జర్నలిస్టులదేనని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది, సంక్షేమం గూర్చి ప్రజలకు తెలియజేయాలన్నారు.

కర్ణాటకలోని బీజేపీ పాలన, మన రాష్ట్రంలో కొనసాగుతున్న పాలనలో ఎంత వ్యత్యాసం ఉన్నదో పత్రికలు, మీడియా ద్వారా ప్రజలకు చూపించాలన్నారు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ మన పాలనలో ఏ విషయంలో పోటీకి వస్తుందని ఆయన ఎద్దేవా చేశారు.అనంతరం జాతీయ రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేసి, జోగిపేటలోని అంబేద్కర్‌ విగ్రహాన్ని అవిష్కరించారు.

స్థానిక బహదూర్ ఖాన్ ఫంక్షన్ హాల్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, జడ్పీ చైర్‌ పర్సన్‌ మంజుశ్రీజైపాల్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ శరత్‌ కుమార్, టీయూడబ్లూయజే ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, డీసీసీబీ మాజీ వైస్‌ చైర్మన్‌ పి.జైపాల్‌రెడ్డి, మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ జగన్మోహన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు రాహుల్‌ కిరణ్, మఠం భిక్షపతి, మున్సిపల్‌ చైర్మన్‌ మల్లయ్య, వైస్‌ చైర్మన్‌ డేవిడ్, ఎంపీపీ బాలయ్య, వైస్‌ ఎంపీపీ మహేశ్వర్‌రెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్టులకు అండగా మీడియా అకాడమీ: అల్లం నారాయణ

జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ నిలుస్తుందని ప్రెస్‌ ఆకాడమీ చైర్మన్‌ అల్లంనారాయణ అన్నారు. మంత్రి హరీష్‌రావు సహకారంతో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇవ్వడం సాధ్యమైందన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.100కోట్ల నిధిని కేటాయించిందన్నారు. ప్రస్తుతం ఈ నిధిలో రూ.42కోట్లు ఉన్నాయన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది జర్నలిస్టులు చనిపోతే, వారి కుటుంబాలకు పింఛన్‌ను అందిస్తున్నామన్నారు. కరోనా సమయంలో 4వేల మంది జర్నలిస్టులకు ఒక్కోక్కరికి రూ.10 నుంచి రూ.20 వేల వరకు మొత్తం రూ.7 కోట్ల వరకు అందించామన్నారు. ఇళ్ల స్థలాలను అందించడంలో నిబంధనలు అడ్డంకులున్నా, వాటిని అధిగమిస్తూ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలను ఇప్పిస్తున్నామన్నారు.

ప్రభుత్వం రూ.15 కోట్లతో మీడియా అకాడమీ భవనాన్ని నిర్మిస్తుందన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, కానీ కొందరు కావాలని తప్పుదోవ పట్టిస్తూ, ఆకాడమీపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని, వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.

Next Story

Most Viewed