సమాచారం ఇచ్చారు.. నజరానా పొందారు

by Disha Web Desk 12 |
సమాచారం ఇచ్చారు.. నజరానా పొందారు
X

దిశ, పటాన్ చెరు: ఐలా‌పూర్ అక్రమ నిర్మాణాల విషయంలో ఒక అధికారి పెద్దలకు సహకరించినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కూల్చివేతల ముందు ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారులు చాలా సీక్రెట్ గా ఉంచినప్పటికీ అక్రమ బహుళ అంతస్థుల నిర్మాణదారులకు ఒక అధికారి ముందుగానే ఉప్పందించారన్న విషయం చర్చనీయాంశమవుతోంది. బడాబాబుల నిర్మాణాలను కూల్చివేతల నుంచి కాపాడాలన్న విషయంలో సదరు అధికారి సలహా ఇచ్చి మరి కోర్టును ఆశ్రయించాలని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ అధికారి సలహా మేరకు నిర్మాణదారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి తాత్కాలిక ఉత్తర్వులు తెచ్చుకున్నట్లు సమాచారం. ఈ సమాచారాన్ని ఇచ్చిన అధికారికి భారీ ఎత్తున తాయిలాల నజరానా సమర్పించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేదలను దండించి పెద్దల నిర్మాణాలకు సహకరించిన ఆ అధికారి ఎవరన్న విషయం విచారణ జరిపి తేల్చాల్సిందిగా డిమాండ్లు వినిపిస్తున్నాయి.

కోర్టు ఉత్తర్వుల్లో ఉన్నదేంటి..?

అక్రమ నిర్మాణదారులు కోర్టును ఆశ్రయించి తెచ్చుకున్న ఉత్తర్వుల్లో ఉన్న విషయాన్ని ఒక్కొక అధికారిది ఒక్కొక మాటగా ఉంది. కోర్టు ఆదేశాల ప్రకారం నిర్మాణాల కూల్చివేతలకు మినహాయింపు ఇవ్వలేదని పలువురు వెల్లడిస్తున్నారు. పంచాయతీ రాజ్ చట్టం నిబంధనల ప్రకారం పకడ్బందీగా నోటీసులిచ్చి చర్యలు తీసుకోవాలని కోర్టు ఉత్తర్వులతో ఉందని ఒక అధికారి "దిశ" కు తెలిపారు. కిష్టారెడ్డి పేట సర్వే నెంబర్ తో అక్రమార్కులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఉత్తర్వులు తెచ్చుకున్నప్పటికీ సదరు నిర్మాణాలు మొత్తం ఐలాపూర్ వివాదాస్పద భూముల్లో ఉండటం గమనార్హం. అయితే ఈ వివరాలన్నీ అధికారులకు తెలిసిన సదరు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల అలసత్వంతో వ్యవహరించడం బడాబాబులపై స్వామి భక్తి కారణమా..? లేకపోతే పెద్దల ఒత్తిళ్లు కారణమా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

కోర్టు ఉత్తర్వులను రద్దు చూపించేదెవరు..?

అధికారుల సహకారం, వ్యవస్థలోని లోపాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఉత్తర్వులు తెచ్చుకున్న అక్రమార్కులు తాత్కాలిక ఉపశమనం పొందారు. అయితే సదరు వ్యక్తులు కోర్టుని తప్పుదోవ పట్టించి ఐలాపూర్ గ్రామ పరిధిలో నిర్మాణాలు ఉంటే కిష్టారెడ్డిపేట పేరుతో కోర్టు ఉత్తర్వులు తెచ్చున్నారని తెలుస్తుంది. ఐలాపూర్ సర్వే నెంబర్ 208 లో రెవెన్యూ లెక్కల ప్రకారం 10 కి పైగా నిర్మాణాలు ఉన్నట్లు పలువురు చెబుతున్నారు. అయితే కేవలం నాలుగు నిర్మాణాలకు మాత్రమే, అది కిష్టారెడ్డిపేట సర్వే నెంబర్‌తో కోర్ట్ ద్వారా ఉత్తర్వులు తెచ్చుకున్నట్లు సమాచారం. అయితే మిగతా నిర్మాణాలు సైతం పేరున్న బడా బాబులవి కావడంతో కూల్చివేతల విషయంలో అధికారులు వారికి మినహాయింపు ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. పేదల విషయంలో చాలా దారుణంగా వ్యవహరించిన అధికార యంత్రాంగం పెద్దల విషయంలోకి వచ్చేసరికి డీలా పడడంతో మతలబు ఏముందనే ప్రశ్నలను కొందరు సంధిస్తున్నారు.

అక్రమమని తెలిసిన ఆగని నిర్మాణాలు..

ఐలాపూర్ సర్వేనెంబర్ 208 లో నిర్మాణాలు అక్రమమని అధికారులు నెత్తి నోరు బాదుకుని చెప్తున్న నిర్మాణదారులు మాత్రం అధికారుల ఆదేశాలను పెడచెవిన పెట్టి బరి తెగించి నిర్మాణాలను కొనసాగిస్తున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం అక్కడ నిర్మాణాలను కొనసాగించడానికి వీలు లేకపోయినా యధేచ్చగా ఇప్పటికి బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం కొనసాగుతోంది. అర్ధరాత్రి విద్యుత్ దీపాల వెలుగుల మధ్యలో ఇష్టారీతిగా నిర్మాణాలను కొనసాగిస్తున్నారు. ఇదే విషయమై "దిశ" దిన పత్రిక "అర్ధరాత్రి ఆగమేఘాల మీద" కథనంతో అక్రమంగా జరుగుతున్న నిర్మాణాల విషయాన్ని అధికారులు, ప్రజల దృష్టికి తీసుకుని వచ్చింది.

ఇంతా జరుగుతున్న అక్రమ నిర్మాణాలను ఆపకపోవడం విడ్డూరమనే చెప్పాలి. ఇప్పటికైనా ప్రభుత్వం ఐలాపూర్ అక్రమ నిర్మాణాల విషయంలో విచారణ జరిపి లీకువీరుల సంగతి తేల్చడంతో పాటు కోర్టును ఆశ్రయించి పెద్దల అక్రమ నిర్మాణాలపై కొరడా ఝులిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అందరికీ ఒకటే న్యాయం అన్నట్లుగా బడా నిర్మాణాలపై చర్యలు తీసుకుంటారా? లేక పేదల పైనే మా చర్యలు అంటూ సరిపెట్టుకుంటారా...

Next Story

Most Viewed