గజ్వేల్ లో 'డబుల్' లొల్లి: అర్హులకు ఇళ్లు రాలేదంటూ లబ్ధిదారుల నిరసన

by Disha Web Desk 1 |
గజ్వేల్ లో డబుల్ లొల్లి: అర్హులకు ఇళ్లు రాలేదంటూ లబ్ధిదారుల నిరసన
X

యువకుడి ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న పోలీసులు

దిశ, ప్రజ్ఞాపూర్: సొంతింటి కల గజ్వేల్ నిరుపేదలను మరోసారి ఆందోళన గురి చేసింది. డబుల్ బెడ్ రూం కేటాయింపు లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడంతో ఇల్లు రాని నిరుపేదలు ఆందోళనకు దిగారు. గత రెండు దశాబ్దాలుగా సొంత ఇంటి కలలు కంటున్నా గజ్వేల్ పట్టణ పేదల్లో పలువురికి నిరాశే మిగిలింది. అర్హుల జాబితా పెంచడం లబ్ధిదారుల ను లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం పలువురు పేదలకు అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం అవుతోంది. అధికారులు సర్వే నిర్వహించి అనర్హులను పక్కకు పెట్టవలసింది పోయి లాటరీ పద్ధతి నిర్వహించి చేతులు దులుపుకున్నారు.

దీంతో వల్ల నిజమైన పేదలు, అర్హులకు అన్యాయం చేసినట్లే అవుతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. సీఎం కేసీఆర్ గజ్వేల్ పట్టణ నిరుపేదల కోసం సొంత ఇంటి కల నిజం చేయడానికి 1,250 డబుల్ బెడ్ రూం ఇళ్లను మంజూరు చేశారు. అప్పట్లో రాష్ట్రంలో ఇంత పెద్ద సంఖ్యలో ఇళ్ల కేటాయింపు చర్చమైంది. ఐదారేళ్లుగా ఇళ్ల కేటాయింపు జరగకుండా నాన్చడంతో మున్సిపాలిటీ ఏర్పడడం విలీన గ్రామాలతో పరిధి పెరగడంతో పేదల సంఖ్య పెరిగి ఇళ్ల కేటాయింపు అధికారులకు తలనొప్పిగా పరిణమించింది.

గతంలో ఇచ్చిన పట్టాలను రద్దుచేసి కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేయడానికి అధికారులు చేపట్టిన ఎంపిక ప్రక్రియ కొత్త వివాదానికి దారి తీసింది. గతంలో 1,100 మందిని లబ్ధిదారులను ఎంపిక చేస్తూ ప్రాథమిక జాబితాను మున్సిపల్ అధికారులు విడుదల చేశారు. దీనిపై అభ్యంతరాలు చెబుతూ బాధితులు ఆందోళన కు దిగారు. తర్వాత రీసర్వే చేస్తామని అర్హులు, నిరుపేదలు తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు.

దీంతో మరికొంత మంది దరఖాస్తు చేసుకోగా 3,000 వరకు దరఖాస్తుదారుల సంఖ్య పెరిగింది. దీనిని స్క్రీనింగ్ చేసిన అధికారులు 19న 1,550 మంది అర్హులుగా గుర్తిస్తూ మరో జాబితాను విడుదల చేశారు. కేసీఆర్ 1,250 ఇళ్లు మంజూరు చేయగా అందులో 100 కు పైగా ఇళ్లను పట్టణంలో పలు రోడ్ల విస్తరణకు ఇండ్లు కోల్పోయిన వారికి కేటాయించడానికి గతంలో ఒప్పందాలకు కుదిరాయి.

పేదలకు దక్కని అదృష్టం..

సోమవారం మహతి ఆడిటోరియంలో 1,100 ఇళ్లను లాటరీ ద్వారా లబ్ధిదారులకు కేటాయించారు. దీంతో మరో 450 మంది అర్హులకు ఇల్లు దక్కలేదు. స్థానిక ఆర్డివో విజయేందర్ రెడ్డి, గడ ఓఎస్డీ ముత్యంరెడ్డి ఆధ్వర్యంలో లాటరీ డ్రా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక జాబితా ప్రకటించారు. చాలామంది నిజమైన నిరుపేదలకు లాటరీ పద్ధతిలో అదృష్టం వరించలేదు. 1,550 మంది జాబితాను తయారు చేసి 1,100 మంది లబ్ధిదారులను గుర్తించడంతో 450 మంది కి ఇళ్లు దక్కకపోవడంతో లబ్ధిదారుల్లో నిరసన వ్యక్తమైంది.

ముఖ్యంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 450 మంది అర్హులకు ఇల్లు దక్కకపోవడంతో డ్రా ముగియగానే మహతీ ఆడిటోరియంలోనే లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. అధికార పార్టీ నాయకులకు, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలు అధికార పార్టీ నాయకులకు శాపనార్థాలు పెట్టారు. తమ భూ పట్టాలను లాక్కున్నారని రెండు మూడు సార్లు విడుదల చేసిన జాబితాలో తమ పేర్లు ఉండగా లాటరీ పద్ధతిలో తమకు ఇల్లు కేటాయింపు జరగకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

జాబితాను పెంచి అర్హులకు అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. మహతి ఆడిటోరియం ఆవరణలో గంటకు పైగా నిరసనకారులు నిరసన చేపట్టగా అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. 14వ వార్డుకు చెందిన రహిమాన్ అనే యువకుడు తన తల్లి పేరు లాటరీ పద్ధతిలో రాకపోవడంతో మనస్తాపానికి గురై అంబేద్కర్ చౌరస్తా వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పట్టించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు అతడిని, ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు.

అర్హులకు న్యాయం చేస్తాం: కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

డబుల్ బెడ్ రూవ ఇళ్ల కేటాయింపులో లాటరీ పద్ధతిలో ఇల్లు రాని అర్హులకు న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ స్పష్టం చేశారు. ప్రభుత్వం పేదల పక్షాన పనిచేస్తుందని గజ్వేల్ లో అర్హుల జాబితా పెరగడం వల్ల ఇప్పుడున్న ఇళ్లను లాటరీ పద్ధతిలో కేటాయించామని తెలిపారు. ఇళ్లు రాని వారికి త్వరలోనే స్థలాలను మంజూరు చేస్తామని ఆయన తెలిపారు.



Next Story

Most Viewed