తార్ధాన్ పల్లి నూతన టోల్ ప్లాజా వద్ద ధర్నా..

by Disha Web Desk 11 |
తార్ధాన్ పల్లి నూతన టోల్ ప్లాజా వద్ద ధర్నా..
X

దిశ, చౌటకూర్: సంగారెడ్డి జిల్లా పుల్కల్ ఉమ్మడి మండల పరిధిలోని తార్ధాన్ పల్లి గ్రామ శివారులో నిర్మించిన టోల్ ప్లాజాను గురువారం ఉదయం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న పుల్కల్ ఉమ్మడి మండల వాహనదారులు రైతులు అట్టి టోల్ ప్లాజా వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ టోల్ ప్లాజా నిర్మాణ సమయంలో చుట్టూ 20కిలోమీటర్ల వరకు పలు రకాల వాహనాలకు ఎలాంటి రుసుం తీసుకోమని చెప్పినప్పటికీ స్థానిక నాలుగు చక్రాల వాహనదారులకు నెలకు రూ. 350 చెల్లించాలంటూ టోల్ ప్లాజా యాజమాన్యం నిర్ణయం తీసుకోవడంతో ఇక్కడి వాహనదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 161 అకోలా నాందేడ్ జాతీయ రహదారిలో తమ విలువైన భూములు కోల్పో యామని తమ వద్దనే మళ్లీ టోల్ ట్యాక్స్ వసూలు చేయడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు.

స్థానిక ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, తమ వ్యవసాయ భూమి వద్దకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. వెంటనే టోల్ ప్లాజా యాజమాన్యం సుల్తాన్పూర్ తార్ధాన్ పల్లి, చక్రియాల గ్రామాల వద్ద అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణాలు వెంటనే నిర్మించాలన్నారు. రోడ్డు విస్తీర్ణ పనులలో తమ విలువైన భూములు కోల్పోయిన వారికి టోల్ ప్లాజాలో ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలన్నారు. ఇక్కడి ఉమ్మడి పుల్కల్ మండల ప్రజలకు ఎలాంటి రుసుం తీసుకోకుండా వాహనదారులకు ఉచిత పాసులు ఇవ్వాలన్నారు.

ధర్నా కారణంగా జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పుల్కల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరువురితో మాట్లాడి వారు కోరిన సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా తగు చర్యలు తీసుకోవాలని వారు టోల్ ప్లాజా యజమాన్యాన్ని కోరారు. దీంతో పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని టోల్ ప్లాజా యాజమాన్యానికి అందజేశారు. పోలీసులు హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. నెల రోజుల వ్యవధిలో ఈ సమస్య పరిష్కరించకుంటే టోల్ ప్లాజా వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పల్లె సంజీవయ్య, పార్కల రాంరెడ్డి, అందోలు కృష్ణ, మల్లికార్జున్ గౌడ్, ఉమ్మడి పుల్కల్ ఫోరం అధ్యక్షుడు సర్పంచుల కృష్ణారెడ్డి, కోర్పోల్ ఉప సర్పంచ్ ముకుందం ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed