CM KCR సొంత ఇలాకాలో భగ్గుమన్న అసమ్మతి.. కీలక నిర్ణయం తీసుకున్న గజ్వేల్ కౌన్సిలర్లు!

by Disha Web Desk 19 |
CM KCR సొంత ఇలాకాలో భగ్గుమన్న అసమ్మతి.. కీలక నిర్ణయం తీసుకున్న గజ్వేల్ కౌన్సిలర్లు!
X

దిశ బ్యూరో, సంగారెడ్డి: అభివృద్ధిని కాంక్షించి ఎంతో గొప్ప బాధ్యతలు అప్పగిస్తే అవినీతి పరుడిగా మారి పరువు తీస్తున్నాడు. ఆయనను తక్షణమే పదవి నుంచి దింపేయాలి. లేదంటే పరువుపోతుంది. అతని అవినీతితో పట్టణ అభివృద్ది కుంటుపడుతుంది. అధికారులు సస్పెన్షన్‌కు గురవుతున్నారు. అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావులు కోట్ల నిధులు అందిస్తున్నారు. వారికి పాదాభివందనం చేస్తున్నాం. ఇలాంటి అవినీతి ప్రజాప్రతినిధి మాత్రం తమకు వద్దు.. అని గజ్వేల్ మున్సిపాలిటీ చైర్మన్ రాజమౌళిపై సొంత పార్టీ కౌన్సిలర్లు ఫైర్ అయ్యారు. చైర్మన్ వద్దని నేరుగా సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వద్దకు వెళ్లి అవిశ్వాస తీర్మాన పత్రాన్ని అందించారు.

సీఎం సొంత నియోజకవర్గంలో అవినీతి చైర్మన్ దిగిపోవాలని అవిశ్వాసం పెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశంగా మారింది. మరో వైపు గజ్వేల్ పట్టణంలో అవినీతి రాజ్యమేలుతున్నదనే ప్రతిపక్షాల ఆరోపణలకు నిజం చేకూరుతున్నటు అవుతుంది. మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులుండగా 14 మంది కలెక్టరేట్‌కు వెళ్లారు. అందులో 13 మంది సంతకాలతో కూడిన పత్రాన్ని అధికారులకు అందించారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే సంగారెడ్డి, అందోలు, సదాశివపేట మున్సిపాలిటీలలో అవిశ్వాస తీర్మాణాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు గజ్వేల్‌తో అవిశ్వాస మున్సిపాలిటీల సంఖ్య నాలుగుకు చేరింది.

మొదటి నుంచి వ్యతిరేకతే..

గతంలో అధికారిగా పనిచేసి రిటైర్ట్ అయిన తరువాత సీఎం ప్రత్యేక చొరవతో రాజమౌళి గజ్వేల్‌కు మున్సిపల్ చైర్మన్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆయన చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన వ్యవహార శైలి నచ్చలేదని కౌన్సిలర్లు చెబుతున్నారు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 20 వార్డులున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహించడం, రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు జిల్లా మంత్రిగా ఉండడంతో అభివృద్దికి నిధులు కొరతలేదని చెప్పొచ్చు. అయితే మున్సిపాలిటీలో జరిగే అభివృద్ది పనుల్లో అవినీతి పెరిగిందని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇది మంచిది కాదని పలువురు కౌన్సిలర్లు హెచ్చరించినా చైర్మన్ కనీసం పట్టించుకోకపోగా నన్ను ఎవరూ ఏం చేయలేరని, తాను చెప్పినట్లు వింటేనే మంచిదని బెదిరించినట్లు కూడా పలువురు కౌన్సిలర్లు చెబుతున్నారు. ఆయనతో పాటు ఆయన కుమారుడి తీరుపై కూడా కౌన్సిలర్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఛైర్మెన్‌ను నామమాత్రం చేసి మొత్తం కొడుకే వ్యవహారం చూస్తున్నారంటున్నారు. మొదటి నుంచి చైర్మన్ వ్యవహార శైలి నచ్చకపోవడంతో పలు సందర్భాల్లో మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు చెబుతున్నారు.

కలెక్టరేట్‌కు 14 మంది కౌన్సిలర్లు..

చైర్మన్ అవినీతి, అక్రమాలను సహించలేని కౌన్సిలర్లు ఆయనపై అవిశ్వాస తీర్మాణం పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే గురువారం మొదట 13 మంది కౌన్సిలర్లు కలెక్టరేట్‌కు వెళ్లి తమ సంతకాలతో కూడిన అవిశ్వాస పత్రాన్ని నేరుగా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌కు అందించారు. మరో కౌన్సిలర్ కొంత ఆలస్యం కావడంతో సంతకం పెట్టలేకపోయారని చెప్పారు. మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులుంటే మెజార్టీ కౌన్సిలర్లు చైర్మన్‌పై తీవ్ర వ్యతిరేకతో ఉన్నారని.. ఈ అవిశ్వాసంతో అర్థం అయిపోతుందని కౌన్సిలర్లు చెబుతున్నారు. అవినీతి, అక్రమాలతో మున్సిపాలిటీలో అభివృద్ది కుంట పడడంతో పాటు, ఆయన పలువురు అధికారులు సస్పెన్షన్‌కు గురయ్యారని కౌన్సిలర్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

సీఎంకు రుణపడి ఉంటాం..

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నుంచి ప్రాతినిథ్యం వహించడంతోనే తమ ప్రాంతానికి పేరు వచ్చిందని కౌన్సిలర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గజ్వేల్ దేశంలోనే గుర్తింపు పొందిన నియోజకవర్గంగా చరిత్ర సృష్టించిందని మురిసిపోయారు. అయితే అవినీతి చైర్మన్ ఉండడంతో గజ్వేల్ చరిత్ర మసకబారుతున్నదని కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. తమ గజ్వేల్ చరిత్ర మార్చిన సీఎం కేసీఆర్‌తో పాటు నియోకవర్గ అభివృద్దికి అహర్నిషలు కృషి చేస్తున్న మంత్రి హరీష్ రావుకు పాదాభివందనం చేస్తున్నట్లు కౌన్సిలర్లు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో చైర్మన్ ఉండవద్దని, అతని స్థానంలో కౌన్సిలర్లలో ఎవరు ఉన్నా ఓకేననే ఏకాభ్రిపాయానికి వచ్చామని కౌన్సిలర్లు చెప్పారు.

రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశం..

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్ మున్సిపాలిటీలో చైర్మన్ అవినీతికి పాల్పడుతున్నాడని కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టడం రాజకీయంగా తీవ్ర దుమారం లేపుతున్నది. అభివృద్ధి పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని ప్రతిపక్షపార్టీలు విమర్శిస్తున్నట్లుగానే ఈ వ్యవహారం రుజువు చేస్తున్నది. గత మూడేళ్లుగా గజ్వేల్‌లో అవినీతి రాజ్యమేలుతుంటే కనీసం ఏ అధికారి పట్టించుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా రాజమౌళిని దింపేయాలని నిర్ణయించుకున్న కౌన్సిలర్లు ఎవరిని చైర్మన్ చేయాలని అనుకుంటున్నారో మాత్రం ప్రకటించలేదు. దీనితో ఈ అవిశ్వాసం వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారు..? కావాలని చేస్తున్నారా..? కౌన్సిలర్లే తీవ్ర ఆగ్రహించి ఇంత వరకు వచ్చారా..? అనే అంశాలపై అధిష్టానం ఏం తేల్చనున్నదో వేచి చూడాల్సి ఉన్నది.

ఇవి కూడా చదవండి : ఇంటి పన్ను కట్టలేదా.. అయితే మీరు చీకట్లో ఉండాల్సిందే.. లక్ష్మీపతి గూడెంలో కొత్త రూల్!



Next Story

Most Viewed