సబ్ సెంటర్ల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి : మంత్రి హరీష్ రావు

by Disha Web Desk 1 |
సబ్ సెంటర్ల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి : మంత్రి హరీష్ రావు
X

అన్ని నియోజకవర్గాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ

దిశ, సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అధికారులకు సూచించారు. మంగళవారం మంత్రి జిల్లా కలెక్టర్లు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, ఇంజినీరింగ్ విభాగం అధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా సంబంధిత శాఖ అంశాలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఇప్పటికే తొమ్మిది జిల్లాల్లో సీఎం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే హెల్త్ డే రోజున మిగతా 24 జిల్లాలలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్రంలో కేసీఆర్ కిట్ పథకాన్ని అమలు చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించగలిగామని తెలిపారు.

అదేవిధంగా మాత, శిశు మరణాలను అరికట్టడంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉందన్నారు. గర్భిణీల్లో రక్తహీనతను నివారిస్తూ, పుట్టబోయే శిశువులు ఆరోగ్యవంతంగా ఉండేలా ప్రభుత్వం ప్రస్తుతం న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేయాలని నిర్ణయించిందన్నారు. ఈ సందర్భంగా సబ్ సెంటర్ల భవనాల నిర్మాణాల ప్రగతి గురించి మంత్రి జిల్లాల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీపీఆర్ శిక్షణ కార్యక్రమంపై వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

జిల్లాకు 2,630 న్యూట్రీషన్ కిట్లు : కలెక్టర్ శరత్

జిల్లాకు 2,630 న్యూట్రిషన్ కిట్స్ వచ్చాయని జిల్లా కలెక్టర్ శరత్ మంత్రికి తెలిపారు. న్యూట్రిషన్ కిట్స్ పంపిణీకి ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. జిల్లాకు 19 బస్తీ దవాఖానాలు మంజూరు కాగా, 18 బస్తీ దవాఖానాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. మరొక బస్తీ దవాఖాన ప్రారంభానికి సిద్ధంగా ఉందని, త్వరలో దాదాని కూడా ప్రారంభించనున్నట్లు మంత్రికి వివరించారు.

జిల్లాలో 173 పల్లె దవాఖానాలు ఉన్నాయని, అందులో 136 దవాఖానాల్లో ఎం. ఎల్.హెచ్.పి ల నియామకాలు పూర్తయ్యాయని, 37 పల్లె దుకాణాలకు ఎం.ఎల్.హెచ్.పిల నియామకాలు రేపు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఐదు పీహెచ్సీలకు కొత్త భవనాలు మంజూరయ్యాయని నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. జూమ్ మీటింగ్ లో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి గాయత్రి దేవి, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమార్, ఆర్.ఎం.వో సంగారెడ్డి, డాక్టర్ శశాంక్, పంచాయతీరాజ్ ఈ.ఈ జగదీశ్వర్, ఆయా అధికారులు పాల్గొన్నారు.

Read More: సిగ్గులేకుండా ఆ విషయం చెబుతున్నారా.. BRS ఎమ్మెల్సీపై ఆకునూరి మురళి సీరియస్

‘111 జీవో రద్దుతో హైదరాబాద్ ఆగం కాబోతోంది’



Next Story

Most Viewed